రక్షణగా ఉంటానని రాక్షసుడయ్యాడు

8 Oct, 2017 14:49 IST|Sakshi

ఎనిమిదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారయత్నం

కనిగిరి నగర పంచాయతీలో ఘటన

పోలీసుల అదుపులో నిందితుడు

ప్రకాశం జిల్లా : వరుసకు చెల్లెలయ్యే ఎనిమిదేళ్ల బాలికపై వికృతంగా ప్రవర్తించాడో కామాంధుడు. రాత్రి వేళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను వివస్త్రను చేసి అత్యాచారం చేయబోయాడు. ఆమె సహకరించక పోవడంతో చెంపపై గట్టిగా కొట్టాడు. బాలిక  ఏడ్పు విని ఇరుగుపొరుగు వారు వచ్చారు. అది చూసి నిందితుడు పరారయ్యాడు.  ఈ ఘటన శుక్రవారం రాత్రి కనిగిరిలో చోటుచేసుకుంది.బాధితురాలి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కనిగిరి నగర పంచాయతీలోని కాశిరెడ్డినగర్‌ చెందిన వివాహితను ముగ్గురు ఆడపిల్లలు పుట్టాక భర్త వదిలేశాడు. దీంతో ఆమె బేల్దారు పనులకు, వంట పనులకు వెళ్తూ పిల్లలను పోషించుకుంటోంది.

 శనివారం వంటకు వెళ్లాల్సి ఉండటంతో కాలనీలో సహచర వంట కూలీలను మాట్లాడుకునేందుకు బయటకు వెళ్లాల్సి వచ్చింది. రాత్రి వేళ కావడంతో తాను తిరిగి వచ్చే వరకు చెల్లెళ్లను జాగ్రత్తగా చూసుకోమని ఎనిమిదేళ్ల పెద్ద కుమార్తెకు చెప్పింది. ఎదురింట్లో ఉండే యువకుడు రావూరి నర్సయ్య(30)కు పిల్లలను చూస్తుండమని చెప్పి వెళ్లింది. రక్షణగా ఉంటానని చెప్పిన నర్సయ్య.. బయట ఆడుకుంటున్న పెద్ద కుమార్తెకు కొనుక్కోమంటూ రూ.10 ఇచ్చి ఆశపెట్టాడు. ఇంటికి సమీపంలో ఓ తడికె చాటుకు తీసుకెళ్లి దుస్తులు ఊడదీశాడు. అతడి వికృత చేష్టలకు బాలిక సహకరించకపోవడంతో చెంపపై గట్టిగా కొట్టాడు. బాలిక కేకలు విని స్థానికులు రావడంతో నిందితుడు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఇంటికి చేరింది. బాలిక చెప్పింది విని బాధితురాలి తల్లి, అమ్మమ్మ వెంటనే నిందితుడి ఇంటికి వెళ్లి అతడిని నిలదీశారు.

దీంతో నర్సయ్య ఎక్కువగా మాట్లాడితే చంపుతానని వారిని కూడా బెదిరించాడు. ఆందోళనకు గురైన బాధితులు బాలికను తీసుకుని శనివారం కనిగిరి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. సీడీపీఓ ఇందిరాకుమారితో కలిసి, జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. నిందితుడు నర్సయ్యను అదుపులోకి తీసుకుని, అతడిపై అత్యాచారయత్నం, సెక్షన్‌ 448, 307, 376/రెడ్‌విత్‌ 511, సెక్షన్‌ 10 ఆఫ్‌ ఫోక్సో యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. నిందితుడిపై కనిగిరి, పీసీ పల్లి పోలీస్‌ స్టేషన్‌లలో చోరీ, వన్యమృగాల వేట తదితర కేసులు ఉన్నాయని సమాచారం. కాలనీలో రాత్రి వేళ ఒంటరిగా కన్పించే మహిళలు, బాలికల పట్ల వెలికిగా వ్యవహరిస్తుంటాడనే ఆరోపణలున్నాయి. 

మరిన్ని వార్తలు