ఖరీఫ్ కరువు

3 Oct, 2013 03:43 IST|Sakshi

విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఖరీఫ్ కలిసొచ్చే పరిస్థితులు కానరావడం లేదు. పెట్టుబడులు దక్కుతాయోలేదోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితులు కారణంగా జిల్లాలో కరువు చాయలు అలముకున్నాయి. సగానికి పైగా మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతా ల్లో ఇప్పటికీ నాట్లు వేస్తున్నారు. ముదురునారు తో ఆలస్యంగా నాట్లుతో పంటకు తెగుళ్లు ఆశిస్తున్నాయి.

దిగుబడులపై దీని ప్రభావం ఉంటుంద ని వ్యవసాయశాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చే స్తున్నారు. ప్రధానంగా నారు ముదిరిపోవడంతో పంట దిగుబడి సగానికి తగ్గిపోతుందని పేర్కొం టున్నారు. రైతులు ఇక ఖరీఫ్ నాట్లను ఆపేసి వర్షాల స్థితిగతులను బట్టి రబీలో స్వల్పకాలిక వంగడాలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఈ సీజ న్‌లో వరి సాధారణ విస్తీర్ణం 92,885 హెక్టార్లు.  సుమారు లక్ష హెక్టార్లలో వరి సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు.

రుతుపవనాలు కూడా ముందుగానే ప్రవేశించడంతో ఆశించిన స్థాయిలో వానలు పడతాయని సాగుపనులకు రైతులు సిద్ధమయ్యారు. అయితే ఆశించిన విధంగా వర్షాలు అనుకూలించలేదు. దాదాపుగా 30 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ముంచంగిపుట్టు, పెదబయలు, గూడెంకొత్తవీధి మండలాల్లో మాత్రం అత్యధిక వర్షం కురిసింది. దీంతో మొత్తంగా 56 వేల హెక్టార్లలో మాత్రమే నాట్లు పడినట్టు వ్యవసాయాధికారులు లెక్కలు తేల్చారు.
 
నివేదికకు సమైక్య సెగ


 వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో  కరవు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆగస్టు 30 వరకు వర్షపాతాన్ని మండలాల వారీగా పరిశీలించి తదనుగుణంగా కరవు అంచనాలను సిద్ధం చేయాల్సి ఉంది. కాని అందుకు ఆస్కారం లేకుండా పోయింది. వ్యవసాయ శాఖ అధికారుల నుంచి రెవెన్యూ సిబ్బంది వరకు అందరూ సమైక్యాంధ్ర సమ్మెలో ఉన్నారు. వాస్తవానికి సోమవారానికే మండలాల వారీగా వర్షపాతం వివరాలను నమోదు చేయాల్సి ఉండగా సిబ్బంది లేకపోవడంతో ఆ వివరాలు ఇప్పటి వరకు రాలేదు.

దీంతో కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆ బాధ్యతలను ఆర్డీవోలకు అప్పగించారు. మండలాల వారీగా వర్షపాతం వివరాలను సేకరించి చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్‌కు పంపించాలని ఆదేశించారు. కొన్ని చోట్ల తప్పుడు సమాచారం వచ్చినా సిబ్బంది సమ్మె అనంతరం వాటిని సరిచేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కొన్ని మండలాల్లో వర్షాపాతం నమోదుకు ఆటోమేటిక్ రెయిన్‌ఫాల్ రికార్డింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. వీటి లో నమోదైన వివరాలను సేకరించనున్నారు. ఆర్డీవోల నుంచి వివరాలు వచ్చిన తరువాత కరవుపై ఒక నివేదికను తయారు చేసి కలెక్టర్ ప్రభుత్వానికి పంపించనున్నారు.

 రబీకి కార్యాచరణ

 ఖరీఫ్ సీజన్ సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసింది. రబీకి కార్యాచరణ సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యాయి. వ్యవసాయాధికారులు సమ్మెలో ఉండటంతో దీనికీ కొంత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంట సాగు లక్ష్యంతో పాటు రైతులకు రుణ లక్ష్యంపైగా కూడా త్వరలో నిర్ణయాలు చేయనున్నారు. రుణ లక్ష్యంపై ఈ నెల తొలివారంలో డీసీసీ సమావేశం నిర్వహించాలని కలెక్టర్ నిర్ణయించారు. ఇందులో బ్యాంకర్లతో సమావేశమై పంట రుణ లక్ష్యాలను నిర్దేశించనున్నారు. రబీకి సంబంధించి ఇప్పటికే జిల్లాకు అవసరమైన మొత్తంలో ఎరువులను అందుబాటులో ఉంచారు. రబీకి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు