‘మీ సేవ’ ద్వారా 300 రకాల సేవలు

27 Jul, 2014 00:59 IST|Sakshi

 ఒంగోలు టౌన్ : 15 ప్రభుత్వ శాఖలకు చెందిన 300 రకాల సేవలను ఇక నుంచి మీ సేవ కేంద్రాల ద్వారానే అందించాలని జాయింట్ కలెక్టర్ కే యాకూబ్‌నాయక్ ఆదేశించారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఆ సేవలన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లోనూ నేరుగా రాతపూర్వకంగా నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ఆ 15 శాఖల అధికారులు, మీ సేవ కేంద్రాల నిర్వాహకులతో శనివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా మాట్లాడుతూ 300 రకాల సర్వీసులను ఇకపై మీ సేవ ద్వారానే పొందాల్సి ఉంటుందన్నారు. ఆయా సేవల వివరాలను శాఖల వారీగా కేటాయించి కార్యాలయాల ముందు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంబంధిత సేవల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలను మీ సేవ కేంద్రాలకు పంపించాలన్నారు. మీ సేవ కేంద్రాలకు వెళ్లిన ప్రజలు తాము పొందాల్సిన సేవలకు సంబంధించి కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే దానికి ఏయే ఫారాలు జతచేయాలో తెలుపుతూ పూర్తి వివరాలు వస్తాయన్నారు.

 దీనిలో భాగంగా వ్యవసాయశాఖకు సంబంధించిన 34 రకాల సేవలను ఇకపై మీ సేవ కేంద్రాల ద్వారానే పొందాల్సి ఉంటుందన్నారు. పంటల బీమా మొదలుకుని ఫెర్టిలైజర్స్ వరకూ ప్రతిదీ మీ సేవ ద్వారానే జరగాల్సి ఉంటుందని వివరించారు. అదే విధంగా పౌరసరఫరాల శాఖకు సంబంధించి 14 రకాల సేవలు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి 19 రకాల సేవలు, గనులు, భూగర్భ వనరులకు సంబంధించి 13 రకాల సేవలు, కార్మికశాఖకు సంబంధించి 12 రకాల సేవలు, ట్రాన్స్‌కోకు సంబంధించి 11 రకాల సేవలు, జిల్లా పరిశ్రమల కేంద్రానికి సంబంధించి 8 రకాల సేవలు, ప్రాంతీయ రవాణాశాఖకు సంబంధించి 4 రకాల సేవలను ఇకపై మీ సేవ కేంద్రాల ద్వారానే పొందాల్సి ఉంటుందని జేసీ వెల్లడించారు.

పోలీస్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, దేవాదాయశాఖ, మున్సిపాలిటీలు, డ్రగ్ కంట్రోలర్, వైద్యారోగ్యశాఖ తదితర వాటిలో కొన్నిరకాల సేవలను కూడా మీ సేవ ద్వారా పొందాల్సి ఉంటుందన్నారు. అయితే, కొన్ని శాఖలకు సంబంధించిన సేవలు ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులతో ముడిపడి ఉన్నాయని పలువురు జిల్లా అధికారులు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వారితో మాట్లాడి మీ సేవ కేంద్రాల ద్వారానే సేవలు కొనసాగేలా చూస్తానని జేసీ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, నేషనల్ ఇన్‌ఫర్‌మేటిక్ సెంటర్ డీఐవో మోహన్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు