310వ రోజు పాదయాత్ర డైరీ

3 Dec, 2018 04:10 IST|Sakshi

ఇప్పటి వరకు నడిచిన దూరం 3,360.5 కిలోమీటర్లు
02–12–2018, ఆదివారం, బూరాడ, శ్రీకాకుళం జిల్లా.  

ఇస్త్రీ పెట్టెలు, కత్తెర్లు ఇచ్చి అదే ఆదరణ అంటే సరిపోతుందా బాబూ?
ఈ రోజంతా రేగిడి మండలంలోనే పాదయాత్ర సాగింది. పేదల బతుకుల్ని అంధకారం చేస్తున్న పాలకుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది. సంక్షేమం తెలియని సర్కారు జనజీవితాలపై చూపే దుష్ప్రభావాన్ని చూశాను. కన్నీళ్లు పెట్టే కిడ్నీ బాధితులు.. జీవితాలు బూడిదవుతున్న ఇటుకబట్టీదారుల దయనీయ గాథలు.. ఛిద్రమైన జాలర్ల బతుకులు.. సాయం కోసం నా వద్దకు వచ్చాయి. 

అంబకండి గ్రామంలో ఆరేడేళ్లుగా కిడ్నీ సమస్యలు విజృంభిస్తున్నాయట. ఇవాళ నన్ను కలిసిన ఓ పదిహేనుమంది బాధితుల మాటల్లో గుండె తరుక్కుపోయే బాధ కనిపించింది. పాలకుల నిర్లక్ష్యంతో కిడ్నీ సమస్యకు పరిష్కారమే లభించలేదని చెప్పారు. ఇప్పటికే 20 మందిని కిడ్నీ రోగం పొట్టనపెట్టుకుందని వాపోయారు. మరో 40 మంది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వమే దీనికి ప్రథమ కారణమన్నారు. తాగునీరే కిడ్నీలను గుల్ల చేస్తోందని నిపుణులు చెప్పినా వినిపించుకోవడం లేదన్నారు. ప్రాణాలు హరించుకుపోతున్నా.. బోర్లు, బావుల్లోని నీరే దిక్కని చెప్పారు. రక్షిత మంచినీటి కోసం ఊరు ఊరంతా ఏళ్ల తరబడి ఇస్తున్న అర్జీలకు దిక్కే లేకుండా పోయిందని బాధపడ్డారు. వింటుంటే చాలా బాధనిపించింది. పేదవాడి ప్రాణాలు కాపాడేందుకు కనీసం గుక్కెడు రక్షిత మంచినీరు కూడా ఈ సర్కార్‌ ఇవ్వలేదా? లేక ఇవ్వాలని లేదా?  

ఉదయం అంతా ఇటుక బట్టీల మధ్య నుంచే సాగింది.. యాత్ర. బట్టీదారుల కష్టాలు విన్నాను. వారంతా ఒకప్పుడు నేలతల్లిని నమ్ముకున్న సన్న, చిన్నకారు రైతులేనట. సాగునీరు లేక, వర్షపు చినుకులు రాక వ్యవసాయాన్ని వదిలేసినవారే. పొలాలను బీళ్లుగా పెట్టి.. బట్టీలవైపు బతుకుదారి పట్టినా బావుకున్నదేమీ లేదని బావురుమన్నారు. అప్పుల మీద అప్పులు తెచ్చి బట్టీలు పెట్టినా.. ఆదాయం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. కులవృత్తికి ఆదరణ లేక ఎందరో కుమ్మరులు ఆ ఇటుక బట్టీలలో కూలీలుగా మారడం బాధనిపించింది. బుల్లిబాబు అనే రైతన్న అనుభవం ప్రభుత్వ వంచనకు అద్దం పట్టింది. బంగారం తాకట్టుపెట్టి పంట రుణం తీసుకున్నాడట. బాబుగారి రుణమాఫీ దెబ్బకు ఆ బంగారాన్ని బ్యాంకువాళ్లు వేలం వేసేశారట. విధిలేక పొలం వదిలి ఇటుక బట్టీ పెట్టుకున్నానని చెప్పాడు. బుల్లిబాబే కాదు.. చంద్రబాబు మోసానికి బలికాని రైతన్నే లేడనడం అతిశయోక్తి కాదేమో! 

బిక్కుబిక్కుమని బతుకుతున్న ఎచ్చెర్ల మండలానికి చెందిన తొమ్మిది జాలర్ల కుటుంబాల మహిళలు సాయం కోరుతూ నన్ను కలిశారు. ఉపాధి కరువై బతుకు భారమైన దుస్థితిని వివరించారు. వలసల బాట.. సముద్రపు వేట జాలర్ల బతుకుల్లో కల్లోలం రేపుతున్న పరిస్థితిని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనంతగా డీజిల్‌ ధరలు పెంచితే వేట ఎలా గిట్టుబాటవుతుందని ప్రశ్నించారు. భారమైన తమ బతుకులకు ఈ సర్కార్‌ ఇసుమంతైనా సాయం చేయడం లేదని కళ్లనీళ్లు పెట్టుకున్నారు. బోట్లు ఇవ్వరు.. పనిముట్లు ఇచ్చిన పాపానపోలేదు.. వలలు ఇచ్చిందీ లేదు.. నిషేధ సమయంలో పస్తులున్నా సాయం చేసిన దిక్కే లేదు.. ప్రకృతి వైపరీత్యాలు జాలర్ల బతుకులను కమ్మేస్తున్నా ప్రభుత్వ సాయం ఇసుమంతైనా లేదని తెలిపారు. అడ్డగోలుగా వచ్చిన పరిశ్రమలు విడిచే కాలుష్యంతోచేపలూ తగ్గాయట. జట్టీలు లేకపోవడం, దళారీల రాజ్యం ఇక్కట్లపాలు చేస్తోందట. పొద్దంతా వేటకెళ్లినా పొట్టపోసుకోవడం కష్టమవుతోందట. బతకలేక.. చావలేక పెళ్లాం, పిల్లల్ని వదిలేసి చేపలవేట కోసం గుజరాత్‌ వలస వెళ్లిపోయారని చెప్పారు. గీత దాటారని పాకిస్థాన్‌ సైన్యం పట్టుకెళ్తే సమాచారం కూడా అందడం లేదన్నారు. తిరిగొచ్చేదాకా నమ్మకం లేదని బావురుమన్నారు. ఈ చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారులకు ఏ మాత్రం చేయూతనిచ్చి ఉన్నా ఈ వలస బాధలు ఉండేవికావు.. ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదని తెలిపారు. నిజమే.. ఏ ఒక్క కులానికైనా కాస్తంతైనా మంచి చేయాలనే ఆలోచన ఏ కోశానా లేని ఈ ప్రభుత్వ వైఖరే ఈ దుస్థితికి మూలకారణం.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. బలహీనవర్గాల వారిని ఎన్నికల వేళ మభ్యపెట్టి ఓటుబ్యాంకుగా వాడుకోవడమే తప్ప వారి సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి మీ ప్రభుత్వం తీసుకున్న నిర్మాణాత్మక చర్య ఒక్కటైనా ఉందా? నాలుగున్నరేళ్లుగా మీరు మరిచిపోయిన బీసీలు.. ఎన్నికలనగానే మూడు నెలల ముందు గుర్తుకొచ్చారా? ఇస్త్రీ పెట్టెలు, కత్తెర్లు వంటి వస్తువులు ఇచ్చి అదే ఆదరణ అంటే సరిపోతుందా? కమీషన్లకు కక్కుర్తిపడి అధిక ధరలకు నాసిరకం పనిముట్లను సరఫరా చేస్తున్నారంటున్న లబ్ధిదారులకు ఏం సమాధానం చెబుతారు? 
- వైఎస్‌ జగన్‌

మరిన్ని వార్తలు