యూపీఎస్సీ పరీక్షలకు 32 కేంద్రాలు

21 Aug, 2015 00:49 IST|Sakshi
యూపీఎస్సీ పరీక్షలకు 32 కేంద్రాలు

23న పరీక్ష
హాజరు కానున్న అభ్యర్థులు 15,589
10 నిమిషాలు ఆలస్యమైనా ప్రవేశం
అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సుల ఏర్పాటు
అధికారులతో సమావేశంలో కలెక్టర్

 
విజయవాడ : నగరంలో ఈ నెల 23న నిర్వహించనున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షలకు జిల్లా కలెక్టర్ బాబు.ఎ కసరత్తు చేస్తున్నారు. స్థానిక సబ్-కలెక్టర్ కార్యాలయంలో గురువారం యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణపై శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగరంలో 32 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. 15 వేల 589 మంది ఈ పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, పరికరాలను పరీక్షా కేంద్రంలోకి తీసుకురావటాన్ని నిషేధించినట్లు తెలిపారు. పరీక్షలు రాసే అభ్యర్థులు బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ను మాత్రమే ఉపయోగించాలన్నారు. పరీక్షలను పూర్తి భద్రత తో, స్నేహభావంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రం నుంచి ఏ అభ్యర్థీ ఓఎంఆర్ షీట్, క్వశ్చన్ పేపర్ బయటకు తీసుకువెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా అభ్యర్థి బయటకు తీసుకువెళితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

144 సెక్షన్ విధింపు...
 పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షలకు చెందిన పేపరు-1 ఉదయం 9.30 గంటల నుంచి 11.30 వరకు, పేపరు-2 మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. అభ్యర్థులను 10 నిమిషాల వరకు ఆలస్యమైనా అనుమతిస్తామని చెప్పారు. నగరంలో నిర్వహించే పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి సమాచారాన్ని అభ్యర్థులకు తెలియజేసేందుకు నగరంలో ఫెలిసిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 0886 248155 లేదా 2778090 నంబర్లకు ఫోన్ చేసి ఈ కేంద్రాల నుంచి సమాచారం తెలుసుకోవాలని కోరారు. అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు చేర్చేందుకు బస్టాండు, రైల్వేస్టేషన్ నుంచి బస్సులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదే శించారు.

 అంధులు వికలాంగులకు ప్రత్యేక కౌంటర్
 పరీక్షలు రాస్తున్న 43 మంది అంధులు, వికలాంగ అభ్యర్థుల కోసం నగరంలో విశాలాంధ్ర కార్యాలయం పక్కనే శాతవాహన కాలేజీలో ప్రత్యేకంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్, సబ్-కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్-2 శేషయ్య, డీఆర్వో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.  
 
హాల్‌టిక్కెట్ రాని అభ్యర్థులకు సూచనలు
 హాల్‌టిక్కెట్ రాని అభ్యర్థులు ఒక ఫొటో ఐడీ, రెండు పాస్‌పోర్టు ఫొటోలతో పరీక్ష కేంద్రం సూపర్‌వైజర్ వద్ద అండర్ టేకింగ్ లెటర్ ఇచ్చి హాజరుకావచ్చు. హాల్‌టిక్కెట్‌లో పేరు లేకపోయినా, నంబ రు లేకపోయినా న్యూఢిల్లీలోని కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలి.

>
మరిన్ని వార్తలు