మందుల ధరలు దిగొచ్చాయోచ్..

14 Oct, 2013 00:25 IST|Sakshi
తూప్రాన్, న్యూస్‌లైన్:అన్ని రకాల వస్తువుల ధరలు పెరగడంతో సతమతమవుతున్న సామాన్యుడికి మందుల ధరల్లో తగ్గుదల ఊరటనిస్తోంది. ప్రాణాపాయ, దీర్ఘకాలిక జబ్బులకు ఉపయోగించే మందుల ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు 348 రకాల మందుల ధరలు 10 నుంచి 45 శాతం మేర తగ్గాయి. అయితే కొన్ని మందులు 60 శాతం వరకు తగ్గినట్టు సమాచారం. ప్రధానంగా ఎయిడ్స్, క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధులు, కొన్ని రకాల యాంటిబైటిక్, న్యూరాలజీ, శస్త్రచికిత్సలకు ముందు, తర్వాత వాడే మందుల ధరలు తగ్గాయి. గత ఆగస్టు 15న ఔషధ ధరల నియంత్రణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.  దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు 45 రోజుల గడువు ఇచ్చింది. ఇచ్చిన గడువు పూర్తి కావడంతో పక్షం రోజుల క్రితం నుంచే మందుల ధరలు అదుపులోకి వచ్చాయి. 
 
 మందుల ధరలపై నియంత్రణ
 ఈ చట్టం ద్వారా 348 రకాల మందుల ధరలపై నియంత్రణ ఉంటుంది. జిల్లాలో 1,136 వరకు మెడికల్, 80 వరకు హోల్‌సేల్(డిస్ట్రిబూటర్ ఏజెన్సీలు) షాపులు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు కోట్లాది రూపాయల వ్యాపారం సాగుతోంది. కంపెనీలను బట్టి టాబ్లెట్ల ధరల్లో 45 శాతం వరకు తగ్గుదల కన్పిస్తుంది. బీపీకి ఉపయోగించే ఎటెనల్(14 మాత్రలు) గతంలో రూ.51 ఉండగా ప్రస్తుతం రూ.30.43కు, ఫిట్స్ కు వాడే ఎప్టైన్ (100 మాత్రలు) ధర రూ.232 నుంచి రూ.149కి త గ్గింది. కొలెస్ట్రాల్‌కు వాడే ఎటర్వాస్టాటిన్(10 మాత్రలు) రూ.104 నుంచి రూ.62కు, ఇన్‌ఫెక్షన్ నివారణకు వాడే ఎజిత్రాల్ (3 మాత్రలు) రూ.95.55 నుంచి రూ. 62.55కు దిగి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 1995 నుంచి ఔషధ ధరల నియంత్రణ చట్టం అమలు చేస్తున్నా పూర్తి స్థాయిలో ఆచరణకు నోచుకోలేదు. ఈ కొత్త చట్టాన్ని పక్కా ప్రణాళికతో అమలు చేయాలని నిర్ణయించడంతో 348 రకాల మందుల ధరలు తగ్గాయి. 
 
 ఇదివరకైతే...
 ఇదివరకైతే ఔషధాల ధరలను కంపెనీలే నిర్ణయించేవి. వీటికి అదనంగా జోడించి హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు విక్రయిస్తూ వచ్చారు. ఈ పద్ధతికి కొత్త చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇకపై ఔషధ ఉత్పత్తి పరిశ్రమలు, మందుల దుకాణ యజమానులు తమ ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి విక్రయించే వీలు లేదు. పెద్ద కంపెనీలైనా.. చిన్నవైనా ప్రభుత్వం నిర్దేశించిన ధరకే మందులను విక్రయించాల్సి ఉంటుం దని తేల్చి చెప్పింది. అయితే వ్యాపారులకు లాభాలు కొంతమేర తగ్గనున్నాయి. ఈ విధానం వల్ల డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో రెండు శాతం, రిటైల్ స్థాయిలో ఆరు శాతం లాభాలు తగ్గి వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.
 
 పాత ధరలకు విక్రయిస్తే చర్యలు..
 ఔషధ ధరల నియంత్రణ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో మందుల ధరలు తగ్గాయి. ఎవరైనా పాత ధరలకే మందులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. ఇదే విషయాన్ని ఆయా దుకాణాల నిర్వాహకులు, యూనియన్ నాయకులకు సూచించాం. పాత స్టాకు ఉంటే వెంటనే కంపెనీలకు అప్పగించాలి.
 - ప్రభాకర్, సిద్దిపేట డివిజన్ ఔషధ నియంత్రణ అధికారి
 
మరిన్ని వార్తలు