మెట్రో నగరాల్లో 350 ఎలక్ట్రిక్‌ బస్సులు

21 Jun, 2019 05:03 IST|Sakshi
సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఫైలుపై తొలి సంతకం చేస్తున్న మంత్రి పేర్ని నాని

రవాణా, ఐ అండ్‌ పీఆర్‌ శాఖ మంత్రి పేర్ని నాని  

సచివాలయంలోని తన చాంబర్‌లో బాధ్యతల స్వీకారం  

దివ్యాంగుల బస్‌పాస్‌ మూడేళ్లపాటు చెల్లుబాటయ్యే ఫైలుపై తొలి సంతకం

సాక్షి, అమరావతి :  రాష్ట్రంలోని మెట్రో నగరాల్లో త్వరలో 350 ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెడుతున్నట్టు రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు. ఆర్టీసీని అన్ని విధాలా ఆదుకుంటామని, దేశంలోనే అత్యుత్తమ ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రవాణా, సమాచారశాఖ మంత్రిగా ఆయన గురువారం వెలగపూడి సచివాలయం ఐదో బ్లాక్‌లోని తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. దివ్యాంగులు ఒకసారి బస్‌పాస్‌ తీసుకుంటే మూడేళ్ల పాటు చెల్లుబాటయ్యే ఫైలుపై తొలి సంతకం చేశారు. అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ రవాణాశాఖ కార్యాలయాల్లో కూడా లైసెన్సులకు దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త వాహనాల కొనుగోలు సమయంలో డీలర్‌ వద్దే రిజిస్ట్రేషన్‌ చేయాలని, 24 గంటల్లోగా ఆర్టీవో అనుమతులివ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలిచ్చేందుకు సీఎం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు మంత్రి చెప్పారు.  

ఫిట్‌నెస్‌ లేకుంటే సీరియస్‌గా పరిగణిస్తాం .. 
ఈ నెల 13 నుంచి ఫిట్‌నెస్‌ లేని వాహనాల విషయంలో తనిఖీలు చేపట్టి 624 స్కూల్‌ బస్సులపై కేసులు నమోదు చేశామని.. ఇప్పటిదాకా 357 బస్సులను సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఫిట్‌నెస్‌ లేకుండా విద్యా సంస్థల బస్సులు పట్టుబడితే ఇకపై సీరియస్‌గా పరిగణిస్తామని మంత్రి స్పష్టం చేశారు. విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నాయని, తమ బస్సులకు ఫిట్‌నెస్‌ లేదని చెప్పకుండా రవాణాశాఖ అధికారులపై తప్పులు నెడుతున్నాయన్నారు. ఫిట్‌నెస్‌ లేని విద్యా సంస్థల బస్సుల విషయంలో తల్లిదండ్రులు తమకు సహకరించాలని మంత్రి కోరారు.

>
మరిన్ని వార్తలు