రెండో దశలో 35,000 ఇళ్లకు ‘రివర్స్‌’

4 Dec, 2019 04:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

20 నుంచి టెండర్లకు ఏపీ టిడ్కో సన్నాహాలు 

మూడో దశలో మరో 14 వేల ఇళ్లకు...

ఏడాదిన్నరలో నిర్మాణాలు పూర్తి చేసేలా ప్రణాళిక  

తొలిదశలో ఖజానాకు ఇప్పటికే రూ.105.91 కోట్లు ఆదా

సాక్షి, అమరావతి: ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రెండో దశ రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియను ఏపీ టౌన్‌షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీటిడ్కో) వేగవంతం చేసింది. మొదటి దశలో 14,368 ఇళ్లకు ఇప్పటికే రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించగా ప్రభుత్వ ఖజానాకు రూ.105.91 కోట్లు ఆదా కావడం తెలిసిందే. రెండు, మూడో దశలను జనవరి నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధమైంది. రెండో దశలో 35,000 ఇళ్లకు ఈ నెల 20 నుంచి 22 తేదీ వరకు రివర్స్‌ టెండర్లు నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో కూడా ప్రజాధనం ఆదా అవుతుందని అంచనా వేస్తోంది. 

ఉగాదికి పనులు ప్రారంభం
మూడో దశ కింద మరో 14,000 ఇళ్లకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించేందుకు టిడ్కో ప్రణాళిక రూపొందించింది. మొత్తం టెండరింగ్‌ ప్రక్రియను జనవరి చివరికి పూర్తి చేయాలని భావిస్తోంది. ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందేనని కాంట్రాక్టు సంస్థలకు ఇప్పటికే స్పష్టం చేసింది. ఏడాదిన్నరలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని  నిర్ణయించింది.

మరిన్ని వార్తలు