35 రోజుల్లో రాజన్న రాజ్యం

4 Apr, 2014 03:04 IST|Sakshi
 శ్రీకాకుళం (టెక్కలి),న్యూస్‌లైన్: మరో 35 రోజుల్లోనే మనమంతా కోరుతున్న రాజన్న రాజ్యం వచ్చేస్తుందని, వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో సామాన్యుల ప్రభుత్వం ఏర్పాటవుతోందని ఆ పార్టీ టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. గురువారం రాత్రి టెక్కలి రైట్వేగేట్ కూడలిలో జరిగిన ‘వైఎస్సార్ జనభేరి’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ప్రస్తుత పరిస్థితులను మార్చే శక్తి, సీమాంధ్ర అభివృద్ధి. రాజధాని నిర్మాణం వంటి పనులన్నీంటినీ సమర్ధవంతంగా చేసే దమ్మున్న నేత జగన్ అన్నారు. ఇక జగ న్ ముఖ్యమంత్రి కాగానే మనందరి కోరిక మేరకు ఈస్ట్‌కోస్ట్ థర్మల్ ప్లాంట్ రద్దు చేస్తానని హామీ ఇవ్వడం ఎంతో ధైర్యమైన నిర్ణయమన్నారు. జిల్లాలో ప్రజలంతా ఏఎన్నికల్లోనైనా ఫ్యాన్ గుర్తుపైనే ఓటు వేసి వైఎస్సార్‌సీపీని గెలిపించి జగనన్నకు ముఖ్యమంత్రి చేయాలని కోరారు. స్థానిక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గ్రామాల్లో ఎన్నికల ప్రచారాలకు వెళ్తే వెంటబెడుతున్నారన్నారు. 
 
 నియోజకవర్గ ప్రజల నాశనానికి కారణంగా ఉన్న థర్మల్ ప్లాంట్‌ను నిర్మించేందుకు పూనుకున్నారని, ఈ దుష్టశక్తులైన అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడులకు ఘోర ఓటమి తప్పదని స్పష్టం చేశారు. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రెడ్డి శాంతి మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు దారుణపరిస్థితుల్లో ఉన్నాయని, అన్ని ప్రాంతాల అభివృద్ధికి జగన్ సారధ్యం కావాలన్నారు. ఇందుకోసం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీలతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పాలవలస రాజశేఖరం కుమార్తెగా, జిల్లా ఆడపడుచుగా తాను పార్లమెంట్ స్థానానికి పోటీచేస్తున్నానని.. అందరూ ఆశీర్వదించాలని కోరారు. జిల్లాలో కాంగ్రెస్ పని అయిపోయిందని, అలాగే రానున్న ఎన్నికలతో తెలుగుదేశం పార్టీ పని కూడా అయిపోనుందని జోస్యం చెప్పారు. జిల్లాలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బయటకొస్తే సార్వత్రిక ఎన్నికలకు ముందే దుకాణం బంద్ అవుతుందన్నారు.
 
మరిన్ని వార్తలు