10 వేల ఎకరాలు.. 36 వేల ప్లాట్లు

13 Jul, 2016 07:03 IST|Sakshi
10 వేల ఎకరాలు.. 36 వేల ప్లాట్లు

- 7,244 ఎకరాలు మెట్ట భూముల్లోనివే
- జరీబు ప్రాంతంలో 3,720 ఎకరాలు
- రాజధానిలో రైతులకిచ్చే ప్లాట్ల లెక్కతేల్చిన సీఆర్‌డీఏ
- 5 కేటగిరీలుగా ఇచ్చేందుకు కసరత్తు
 
 సాక్షి, విజయవాడ బ్యూరో : రాజధాని కోసం సమీకరించిన 34 వేల ఎకరాల్లో 10,964.87 ఎకరాలను తిరిగి రైతులకు ప్లాట్లుగా ఇవ్వాల్సి ఉంటుందని సీఆర్‌డీఏ లెక్కతేల్చింది. ఇలా ఇచ్చే ప్లాట్ల భూమిలో 7,244 ఎకరాలు మెట్ట ప్రాంతంలో ఉండగా 3,720 ఎకరాలు జరీబు ప్రాంతంలో ఉంది. జరీబు, మెట్ట భూముల్లో ఎన్ని ఎకరాలు, ఎన్ని ప్లాట్లు రైతులకు తిరిగి ఇవ్వాలనే దానిపై సీఆర్‌డీఏ కసరత్తు పూర్తి చేసింది. తుళ్లూరు మండలం నేలపాడులో ప్రయోగాత్మకంగా ప్లాట్ల కేటాయింపు జరిపినట్లే మిగిలిన 28 గ్రామాల్లోని రైతులకు కేటాయింపు జరపనుంది. మెట్ట ప్రాంతంలో 6049.62 ఎకరాల్లో 23,667 నివాస ప్లాట్లు, 1194.85 ఎకరాల్లో 23,667 వాణిజ్య ప్లాట్లను రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు. జరీబు ప్రాంతంలో 2,564.52 ఎకరాల్లో 12,490 నివాస ప్లాట్లు, 1155.88 ఎకరాల్లో 12,490 వాణిజ్య ప్లాట్లు రైతులకు దక్కనున్నాయి. మొత్తంగా 36,157 నివాస ప్లాట్లు 29 గ్రామాల్లోని రైతులకు పంపిణీ చేయాల్సివుంది. నివాస ప్లాట్లతోపాటే వాణిజ్య ప్లాట్లూ ఇవ్వాల్సి ఉండడంతో అదే సంఖ్యలో ఆ ప్లాట్లనూ రైతులకు కేటాయించనున్నారు. నివాస, వాణిజ్య ప్లాట్లను కలిపి లెక్కేస్తే 72,314 ప్లాట్లుగా లెక్కతేలుతుంది.

 ఐదు కేటగిరీలుగా ప్లాట్లు
 ప్లాట్లను ఐదు కేటగిరీలుగా విభజించి రైతులకు ఇవ్వనున్నారు. ఏ కేటగిరీలో 120 నుంచి 210 గజాలు, బీ కేటగిరీలో 250 నుంచి 450 గజాలు, సీ కేటగిరీలో 480 నుంచి 1910 గజాలు, డీ కేటగిరీలో 1440 నుంచి 5940 గజాలు, ఇ కేటగిరీలో ఆరు వేల నుంచి 7,500 గజాల విస్తీర్ణంలో ప్లాట్లు ఉంటాయి. ఈ విభజన ప్రకారం సీ కేటగిరీలో అత్యధికంగా డీ కేటగిరీలో 4552.79 ఎకరాలు రైతులకు ఇవ్వాల్సివుండగా ఆ తర్వాత సీ కేటగిరీలో 3785.34 ఎకరాలు, బీ కేటగిరీలో 913.15, ఈ కేటగిరీలో 721.63 ఎకరాలు, ఎ కేటగిరీలో 336.38 ఎకరాలను నివాస, వాణిజ్య ప్లాట్లుగా రైతులకు ఇవ్వాలని తేల్చారు. దీన్నిబట్టి ఎక్కువ మంది రైతులకు 1400 గజాల కంటె ఎక్కువ విస్తీర్ణం ఉన్న స్థలాలు ఇచ్చే పరిస్థితి నెలకొంది.

 మెజారిటీ మెట్ట ప్లాట్లే కేటాయింపు
 సీఆర్‌డీఏ తేల్చిన ప్లాట్ల కేటాయింపు లెక్కల్లో రైతులకు మెట్ట ప్లాట్లు మెజారిటీగా దక్కనున్నాయి. 7224 ఎకరాల్లో మెట్ట ప్రాంతంలోనే ఇస్తుండడం గమనార్హం. జరీబు ప్రాంతంలో 3,720 ప్లాట్లను మాత్రమే ఇవ్వనున్నారు. నిజానికి 29 గ్రామాల్లో జరీబు, మెట్ట భూములు సమానంగానే ఉన్నాయి. కానీ పంపిణీలో మాత్రం మెట్ట భూములే రైతులకు ప్లాట్ల రూపంలో ఎక్కువగా తిరిగి వస్తుండడం విశేషం.

మరిన్ని వార్తలు