37 మంది గల్లంతు

16 Sep, 2019 09:16 IST|Sakshi

సాక్షి, రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో గోదావరిలో జరిగిన బోటు (లాంచీ) మునిగిపోయిన విషాద ఘటనలో 37 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. వీరి కోసం సహాయ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. తమ వారి కోసం బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన 23 మంది రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం తక్షణమే స్పందించడంతో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ధవళేశ్వరం వద్ద గేట్లు మూసివేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మత్స్యకారులు బోట్లతో గోదావరిలో గాలింపు జరుపుతున్నారు. లాంచీ ప్రమాదంలో గల్లంతైన వ్యక్తుల ఆచూకీ కోసం కాటన్ బ్రిడ్జి వద్ద వలల వేయించారు. మరోవైపు ధవళేశ్వరం వద్ద కుండ పోతగా వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద బాధితుల కోసం  ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.

12 మంది విశాఖ వాసుల గల్లంతు
పాపికొండల్లో విహార యాత్ర, తర్వాత భద్రాచలం తీర్థయాత్ర రెండూ కలిసివస్తాయని బయలుదేరిన విశాఖకు చెందిన 13 మంది కుటుంబ సభ్యులు గోదావరిలో లాంచీ ప్రమాదంలో చిక్కుకున్నారు. వారిలో ఒక్కరు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. ఐదుగురు చిన్నారులు సహా మిగతా 12 మంది ఆచూకీ తెలియక బాధితుల కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

వివరాల్లోకెళ్తే.. అనకాపల్లి మండలంలోని గోపాలపురం సమీపంలోని చేనుల అగ్రహారానికి చెందిన పెద్దిరెడ్డి దాలమ్మ (45), భూసాల లక్ష్మి (45), బోనుల పూర్ణ (18), సుస్మిత (3)తోపాటు విశాఖ కేజీహెచ్‌ సమీపంలోని రామలక్ష్మి కాలనీలో నివాసం ఉంటున్న దాలమ్మ కుమార్తె, అల్లుడు మధుపాడ అరుణ, మధుపాడ రమణబాబు, వారి పిల్లలు అఖిలేష్‌ (7), కుశాలి (5), అలాగే వారి బంధువులు వేపగుంటకు చెందిన బి.లక్ష్మి (30), ఆమె కుమార్తె పుష్ప (15), ఆరిలోవ దుర్గాబజారుకు చెందిన టి.అప్పలనర్సమ్మ (60), ఆమె మనవరాళ్లు గీతా వైష్ణవి (3), ధాత్రి అనన్య (1) ఆదివారం తెల్లవారు జామున విశాఖ నుంచి రైలులో రాజమహేం ద్రవరం వెళ్లారు. అక్కడి నుంచి గండిపోచమ్మ గుడి దగ్గరకు వెళ్లి లాంచీలో పాపికొండలకు బయల్దేరారు. లాంచీ ప్రమాదానికి గురవడంతో 13 మందిలో భూసాల లక్ష్మి మాత్రమే సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది. మిగతావారంతా గల్లంతయ్యారు. వారిలో రమణబాబు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తమ కుటుంబసభ్యుల జాడ తెలియకపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

గోదావరి బోటు ప్రయాణ బాధితుల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా కాకినాడ కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. టోల్‌ ఫ్రీ నంబర్‌ : 18004253077కు వరంగల్, విశాఖ, హైదరాబాద్, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు...

నిండు గోదారిలో మృత్యు ఘోష

ముమ్మరంగా సహాయక చర్యలు

మేమైతే బతికాం గానీ..

గల్లంతైనవారిలో తెలంగాణవాసులే అధికం

తండ్రి అస్థికలు కలుపుదామని వచ్చి..

కన్నీరు మున్నీరు

అక్కడ బోటు నడపడం ప్రాణాలతో చెలగాటమే

మరిన్ని వార్తలు