సీఆర్‌డీఏకు ఉచితంగా 3,838.86 ఎకరాలు

2 Nov, 2017 03:58 IST|Sakshi

భారీగా భూకేటాయింపులకు మంత్రివర్గం ఆమోదముద్ర

విశాఖ జిల్లాలో పెట్రోలియం  వర్సిటీకి 201.8 ఎకరాలు

సాక్షి, అమరావతి :  సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ)కు రాజధానిలో ఉచితంగా 3,838.86 ఎకరాలను అప్పగించేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని రాజధాని నగర పరిధిలోని ఈ భూమిని సీఆర్‌డీఏకు ఉచితంగా ఇవ్వాలని బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత జరిగిన మంత్రివర్గ సమావేశం ముందుకు ప్రతిపాదన రాగా.. దానికి ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం శాఖమూరు, ఐనవోలు, నేలపాడు, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, నవులూరు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ ఏడబుŠల్య్‌డీ పోరంబోకు భూమిని సీఆర్‌డీఏ కమిషనర్‌కు అప్పగించనున్నారు. రాజధాని అవసరాల కోసం ఈ భూమిని వినియోగించే అవకాశం ఉంది. కచ్చితంగా ఈ భూమిని ఎందుకు ఉపయోగిస్తారనే విషయం తెలియరాలేదు. దీంతోపాటు మరికొన్ని భూకేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది...

► కృష్ణాజిల్లా పెనమలూరు మండలం తాడిగడపలో ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌కి లీజు ప్రాతిపదికపై కేటాయించిన ఐదెకరాల భూమికి స్టాంప్‌ డ్యూటీ మినహాయింపునిస్తూ నిర్ణయం.
► నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు, వింజమూరు, అన్నసముద్రంపేట, దగదర్తి మండలాల్లోని వివిధ గ్రామాల్లో 664.61 ఎకరాల్ని నడికుడి–శ్రీకాళహస్తి కొత్త బ్రాడ్‌గేజ్‌ లైన్‌ నిర్మాణానికి ఉచితంగా రైల్వేశాఖకు ముందస్తుగా ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం.
► చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లె పరిధిలో 38.85 ఎకరాలు, ఎర్రచెర్లోపల్లిలో 22.13 ఎకరాలు, తలుపులపల్లెలో 15.72 ఎకరాలను ఇండస్ట్రియల్‌ పార్కు కోసం ఏపీఐఐసీకి షరతులతో ఇచ్చేందుకు అనుమతి. జీడీ నెల్లూరు మండలం జీడీ నెల్లూరులో 21.62 ఎకరాలను ఎంఎస్‌ఎంఈ పార్కు స్థాపన కోసం ఉచితంగా కేటాయించేందుకు అనుమతి.  
► గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులో కంపోస్టు ఎరువు యార్డు ఏర్పాటుకు మున్సిపల్‌ కార్పొరేషన్, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగానికి 51.24 ఎకరాలను ఉచితంగా ఇచ్చేందుకు ఆమోదం. చిలకలూరిపేటలో ఏపీ రెసిడెన్షియల్‌ బాలుర పాఠశాల కోసం ఐదెకరాల ప్రభుత్వ భూమి ఉచితంగా కేటాయింపు.  
► విశాఖ జిల్లా సబ్బవరం మండలం వంగలి లో పెట్రోలియం వర్సిటీ శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి 201.80 ఎకరాల్ని ఉచితంగా ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీకి బదలాయింపునకు ఓకే.  
     అనంతపురం జిల్లా తనకల్లు మండలం కోటపల్లిలో టూరిజం ప్రాజెక్టు నిర్మాణం కోసం 160.36 ఎకరాల భూమిని పర్యాటకశాఖకు అప్పగించేందుకు అనుమతి.  
► కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి లో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సంస్థను నెలకొల్పేందుకు 21.97 ఎకరాల్ని ఏపీఐఐసీకి ముందస్తు బదలాయింపునకు అనుమతి.  

మరిన్ని వార్తలు