త్రీడీ.. రెడీ

27 Jun, 2018 12:17 IST|Sakshi
త్రీడీ ల్యాబ్‌ , శిక్షణ పొందుతున్న విద్యార్థులు

రాయలసీమ యూనివర్సిటీలో త్రీడీ ల్యాబ్‌ ఏర్పాటు  

రాష్ట్రంలోని నాన్‌టెక్నికల్‌ వర్సిటీల్లో ఆర్‌యూలోనే ప్రప్రథమం

రూ.30 లక్షలతో అందుబాటులోకి

కర్నూలు (గాయత్రీ ఎస్టేట్‌): సాంకేతిక రంగంలో భవిష్యత్‌ తరాలకు త్రీడీ టెక్నాలజీ అత్యంత కీలకంగా మారుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కంటే అత్యాధునిక అడ్వాన్స్‌డ్‌ త్రీడీ టెక్నాలజీ ఆవశ్యకత పెరుగనుంది. నిర్మాణ రంగం, పరిశ్రమలు, వైద్య రంగంలో అవసరమైన వాటిని డిజైన్‌ చేసే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాయలసీమ యూనివర్సిటీలో ఇటీవల సుమారు రూ.30 లక్షలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన త్రీడీ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని నాన్‌టెక్నికల్‌ యూనివర్సిటీల్లో త్రీడీ ల్యాబ్‌ ఏర్పాటు చేసిన ఏకైక విశ్వవిద్యాలయం రాయలసీమ విశ్వవిద్యాలయం కావటం గర్వకారణం. రూ.30 లక్షలతో త్రీడీ ల్యాబ్‌ను రెండు నెలల క్రితం అప్పటి వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వై.నరసింహులు, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.అమర్‌నాథ్‌ ప్రారంభించారు. ఐదు కంప్యూటర్లు, అత్యాధునికమైన ఐదు ప్రింటర్లు, స్కానింగ్‌ మిషన్‌ ల్యాబ్‌లో అత్యంత కీలకమైన వస్తువులు. త్రీడీ స్కానర్‌ మనుషులు కొలవలేని, డిజైన్‌ చేయలేని వాటిని స్కానర్‌ ద్వారా స్కాన్‌ చేసి ప్రింటింగ్‌ తీసుకోవచ్చు.  
త్రీడీ టెక్నాలజీ.. త్రీ డైమెన్సనల్‌ ప్రింటింగ్‌ అనేది (త్రీడీ) అడిటివ్‌ మానుఫ్యాక్షరింగ్‌ అనే అంశంపై ఆధారపడి భౌతిక వస్తువులను త్రీ డైమెన్సన్‌లో అచ్చు వేస్తోంది. ఇది ఒక పొర మీద ఒక పొరను జమ చేస్తూ ఒక క్రమపద్ధతిలో ప్రింట్‌ చేస్తుంది. దీని కోసం త్రీడీ క్యాడ్‌ నమూనాను కంప్యూటర్‌లో సాఫ్ట్‌వేర్‌ ద్వారా రూపొందిస్తారు.

ఆర్‌యూ ల్యాబ్‌లో ఇలా..  
హైదరాబాద్‌ బీహెచ్‌ఈఎల్‌ వారు టర్బైన్‌ బ్లేడ్స్‌ను త్రీడీ స్కానింగ్‌ చేసుకోడానికి ఆర్‌యూలోని త్రీడీ స్కానర్‌ను ఉపయోగించుకున్నారు.  
ఏపీలోని అటానమస్‌ డిగ్రీ కళాశాలలకు చెందిన సుమారు 40 మంది విద్యార్థులకు సమ్మర్‌ స్కూల్‌ ప్రొగ్రామ్‌లో భాగంగా త్రీడీ ప్రిటింగ్‌పై శిక్షణ ఇచ్చారు.  
ఆర్‌యూలోని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం విద్యార్థులు కొంత మంది హైదరాబాద్‌లోని ఆడెడ్‌ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో శిక్షణ పొందారు.   
ఆర్‌యూ క్యాంపస్‌లోని భవనాలు, వర్సిటీ పేరును త్రీడీ ప్రింటింగ్‌ ద్వారా తయారు చేస్తున్నారు.  

త్రీడీ ల్యాబ్, స్కానర్‌తో ఉపయోగాలు
పరిశ్రమల్లో చాలా వేగంగా ప్రాథమిక నమూనాను తయారు చేసుకోవచ్చు.
త్రీడీ షూ లాస్ట్స్‌ (షూ మోడల్‌) తయారు చేయడానికి ఉపయోగిస్తారు.  
ఆర్ట్‌ అండ్‌ జ్యూవెలరీ ఫొటో టైప్‌ డిజైనింగ్‌కు అవకాశం.
దంత వైద్యాలయాల్లో పళ్ల నమూనాలు రూపొందిస్తారు.
ఇళ్లు, కాలనీలు, వెంచర్ల నమూనాల  డిజైనింగ్‌కు నిర్మాణ రంగంలో  ఉపయోగిస్తారు.  
ఆటోమోటీవ్‌ ఇండస్ట్రీస్‌లో ఉపయోగిస్తారు.  
యంత్రాల బాహ్య డిజైనింగ్‌ చేయుటకు ఉపయోగిస్తారు. 

మరిన్ని వార్తలు