ప్రమోషన్ కోసమే స్వాతి హత్య

17 Jun, 2015 14:07 IST|Sakshi
ప్రమోషన్ కోసమే స్వాతి హత్య

విజయనగరం : జిల్లాలో సంచలనం సృష్టించిన ఎస్.కోట రైల్వే ఉద్యోగిని హత్య కేసు చిక్కుముడి వీడింది. పోలీసులకు సవాల్‌గా మారిన స్వాతి హత్య కేసును నెలరోజుల దాటాక ఎట్టకేలకు ఛేదించారు. గతనెల 11న శృంగవరపుకోట మండల కేంద్రం రైల్వే విద్యుత్ ఉప కేంద్రంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న చిట్టిమోజు స్వాతి దారుణ హత్యకు గురవడం తెలిసిందే. హత్యకు ప్రధాన సూత్రధారి అదే విభాగంలో పనిచేసే ఉద్యోగి గోపి అని పోలీసులు గుర్తించారు. ప్రమోషన్ కోసమే స్వాతిని హత్య చేసినట్టు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. హత్యకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

గోపాలపట్నంలో పనిచేస్తున్న స్వాతిని ఎస్.కోటకు, ఎస్.కోటలో పనిచేస్తున్న నిందితుడిని గోపాలపట్నం బదిలీ చేయడమే హత్యకు కారణమని తెలిసింది. స్వాతిని బెదిరించి ఎస్.కోట నుంచి బదిలీ చేయించుకుని వెళ్లేలా ప్రయత్నించాడు. అది వీలు కాకపోవడంతో స్వాతి అడ్డు తొలగించుకునేందుకు పథకం రచించాడు. మరో ముగ్గురితో కలిసి స్వాతిని హత్య చేశాడు. రైల్వే పోర్టర్‌గా పనిచేసి, డిపార్ట్‌మెంటల్ పరీక్ష రాసిన నిందితునికి కొద్దిరోజుల క్రితం పదోన్నతి లభించడం గమనార్హం.

 ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ ఆదేశాల మేరకు విజయనగరం డీఎస్పీ పి.వి.రత్నం, సీసీఎస్ డీఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి కేసును సవాల్‌గా తీసుకున్నారు.  దాదాపు 12 వందల మంది వరకు అనుమానితుల్ని విచారించారు. రైల్వే ఉద్యోగులతో పాటు రైళ్లలో పనిచేసే ప్రైవేటు కార్మికులు, టీ, సమోసాలు అమ్మేవారు, స్వాతి భర్త కుటుంబ సభ్యులు, ఇనుప ముక్కలు అమ్మేవారిని విచారించారు. ఈ క్రమంలో సహ ఉద్యోగి సూత్రధారి అన్న కీలక సమాచారం బయటపడింది. ఎస్.కోటలో నిందితుడు పనిచేస్తుండగా కొందరు ఇనుప తుక్కు నేరస్తులతో సంబంధాలున్నట్టు సమాచారం. ఇతనిపై ఇప్పటికే ఇనుప తుక్కు రవాణా కేసులున్నట్టు తెలిసింది.
 
 

>
మరిన్ని వార్తలు