బాలుడిపై అమానుషం 

3 Aug, 2019 09:20 IST|Sakshi
దాడిలో గాయాల పాలైన బాలుడు

సాక్షి, తూర్పుగోదావరి(రాజమహేంద్రవరం) : పాచి పని చేసుకొని జీవించే తల్లి వెంట వెళ్లడమే ఆ బాలుడి చేసిన నేరమైంది. ఇంట్లో నగదు, సెల్‌ఫోన్‌ చోరీ చేశావంటూ పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే తెల్లవారు జామున ఇంటికి వచ్చి తీసుకువెళ్లి ఊచ కాల్చి వాతలు పెట్టిన అమానుష సంఘటన రాజమహేంద్రవరం త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం, లక్ష్మి వారపు పేటకు చెందిన మేడబోయిన సీత, అదే ప్రాంతానికి చెందిన రాణి అనే మహిళ ఇంట్లో పాచిపని చేసుకుని జీవిస్తోంది. సీత కుమారుడైన బాలుడు అప్పుడప్పుడూ తల్లితో కూడా రాణి ఇంటికి వెళ్తుంటాడు. ఈ నేపథ్యంలో గురువారం రాణి ఇంట్లో రూ.ఐదు వేల నగదు, ఒక సెల్‌ ఫోన్‌ పోవడంతో సీత కుమారుడే తీశాడనే అనుమానంతో శుక్రవారం తెల్లవారు జామున సీత ఇంటికి వచ్చి ఆమె కుమారుడిని తీసుకువెళ్లి నగదు, సెల్‌ ఫోన్‌ ఏం చేశావంటూ రాణి, ఆమె అన్నయ్య, తల్లి, పక్కన ఉండే మరో వ్యక్తి కర్రలతో కొట్టారు.

అంతటితో ఆగకుండా ఊచ కాల్చి వాతలు పెట్టారు. తనకు ఏమీ తెలియదని చెప్పినా ఆ బాలుడుని విడిచిపెట్టకుండా అమానుషంగా ప్రవర్తించారని అతడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న చైల్డ్‌లైన్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ బి.శ్రీనివాసరావు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొని జువైనల్‌ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేయించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ చోరీ జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అలా కాకుండా చట్టాన్ని చేతులోకి తీసుకుని బాలుడిని హింసించడం తగదని పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

>
మరిన్ని వార్తలు