దళిత ఓట్ల గాలానికి 4 సూత్రాలు

6 Jan, 2014 01:15 IST|Sakshi
దళిత ఓట్ల గాలానికి 4 సూత్రాలు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పూర్తిగా దూరమవుతున్న దళిత ఓట్లను మళ్లీ తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం నాలుగు సూత్రాలతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. దీని అమలు బాధ్యతను రాహుల్‌గాంధీ కోర్‌కమిటీ సభ్యుడు, ఏఐసీసీ ఎస్సీసెల్ విభాగం చైర్మన్ కొప్పుల రాజుకు అప్పగించింది. అందులో భాగంగా ఆదివారం రాష్ట్రానికి వచ్చిన కొప్పుల రాజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను వేర్వేరుగా కలిసి ఇదే అంశంపై చర్చించారు. అనంతరం సాయంత్రం గాంధీభవన్‌లో, ఆ తరువాత పీసీసీ ఎస్సీ విభాగం కార్యవర్గ భేటీలో మాట్లాడారు. దూరమవుతున్న దళితుల విశ్వాసాన్ని మళ్లీ పొందేందుకు నాలుగు అంశాలతో రూపొందించిన ప్రణాళికను వివరించారు.
 
 దళితులను పార్టీ నిర్లక్ష్యం చేస్తోందన్న నేతలు
 కొప్పుల రాజు ముఖ్య అతిథిగా ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన ఎస్సీసెల్ కార్యవర్గ సమావేశంలో వివిధ జిల్లాల నాయకులు పార్టీ తీరును ఎండగట్టారు. కాంగ్రెస్‌లో దళితులంటే చిన్న చూపుందని నేతలు వాపోయారు. ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పదవుల్లో ఎస్సీలకు స్థానమే లేకుండా పోయిందన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దళితులకు ఒరిగిందేమీ లేదని అనంతపురం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు శంకర్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు కూడా ఎస్సీలను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఉన్నా రుణాలిచ్చే దిక్కులేదని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ ైచైర్మన్ ఎ.లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ.. తాను కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలైనా ఒక్క లబ్ధిదారుడికి కూడా రుణం ఇవ్వలేదని చెప్పారు.
 
  సబ్‌ప్లాన్ నిధుల్లో రూ. 300 కోట్లు కార్పొరేషన్‌కు కేటాయించినా రుణాల మంజూరు అధికారమంతా బ్యాంక్ చేతుల్లోనే పెట్టడం బాధాకరమన్నారు. బొత్స మాట్లాడుతూ.. ఎస్సీల విషయంలో ఎంతో అవకాశం ఉన్నా పెద్దగా కార్యక్రమాలు అమలు చేయలేకపోయామని, ఇలా జరగడం బాధాకరమన్నారు. అయినా ‘‘ఎన్నికలు రాబోతున్నందున మనల్ని మనమే సముదాయించుకుని పార్టీ కోసం ముందుకు వెళదాం’’ అని ఊరడించే ప్రయత్నం చేశారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ భట్టివిక్రమార్క, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ఎంపీ నంది ఎల్లయ్య, పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ఎ.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 
 దళితుల ఓట్ల ఆకర్షణకు సూత్రాలివే..
 ఙ్ట్చఛగ్రామ స్థాయిలో దళితుల సమస్యలపై పోరాడుతున్న యువకులను గుర్తించి కమిటీలుగా ఏర్పాటు చేస్తారు.
     దళితులకు, ఇతర సామాజికవర్గాలకు మధ్య తేడాను, వారి ఆకాంక్షలను గుర్తించి వాటిని నెరవేర్చేందుకు దళిత నాయకులు ఏమేరకు విజయవంతమయ్యారనే దానిపై పర్యవేక్షణా కమిటీలను నియమిస్తారు. 3 నెలల్లో ఆ కమిటీలిచ్చే నివేదికల ఆధారంగా పంచాయతీ, మున్సిపల్, నగర ఎన్నికలతోపాటు శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో నేతలకు టికెట్లు ఇస్తారు. అలాగే నామినేటెడ్ పదవుల్లోనూ నియమిస్తారు.
 
     బ్లాక్, డీసీసీ, పీసీసీ మొదలు ఏఐసీసీ వరకు ప్రతి సమావేశంలోనూ దళితుల అభిప్రాయాలు విన్పించే ఎజెండాను చేర్చాలి. ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాట పంథాను అనుసరించాలి.
 
     యూపీఏ ప్రభుత్వానికి జాతీయ సలహా మండలి ఏ విధంగా ఉందో కాంగ్రెస్ పార్టీకి కూడా ఇకపై ఓ సలహా మండలిని ఏర్పాటు చేయాలి. ప్రధానంగా దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంతోపాటు వారి కోసం అమలవుతున్న కార్యక్రమాల సరళిని విశ్లేషించి ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేసేలా కృషి చేయడం వీటిలో ఉన్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా