కిడ్నాపర్లకు డబ్బులివ్వలేదు : జసిత్‌ తండ్రి

25 Jul, 2019 13:37 IST|Sakshi

సాక్షి, మండపేట: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన నాలుగేళ్ల చిన్నారి జసిత్‌ కిడ్నాప్‌ కథ సుఖాంతం అయింది. మూడు రోజుల ఉత్కంఠకు తెరదించుతూ.. అనపర్తి మండలం కుతుకులూరు చింతాలమ్మ గుడివద్ద బాలున్ని కిడ్నాపర్లు గురువారం తెల్లవారుజామున వదిలి వెళ్లారు. అయితే, జసిత్‌ తండ్రి వెంకటరమణ కిడ్నాపర్ల రహస్య డిమాండ్లకు తలొగ్గడం వల్లనే పిల్లాడ్ని విడిచిపెట్టారని, ఆయన బెట్టింగ్‌ కార్యకలాపాల్లో మునిగి తేలేవారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలను వెంకటరమణ తోసిపుచ్చారు.

‘నేనొక సాధారణ క్రికెట్ ప్లేయర్‌ని మాత్రమే. నాకు బెట్టింగ్‌లతో ఎటువంటి సంబంధం లేదు. కిడ్నాపర్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. జసిత్‌ను ఎవరు కిడ్నాప్‌ చేశారో.. ఎందుకు కిడ్నాప్‌ చేశారో తెలియదు. పోలీసుల విచారణలోనే అన్ని విషయాలు వెల్లడవుతాయి. ఆస్తిని బదలాయిస్తేనే కిడ్నాపర్లు నా కుమారుడిని విడుదల చేశారనడం నిజం కాదు. జసిత్‌ క్షేమంగా ఇల్లు చేరేందుకు చొరవ చూపిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కి ధన్యవాదాలు. ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. పోలీసులకు కృతఙ్ఞతలు’ అన్నారు.

రెండు బైకులు మీద వచ్చి వదిలేశారు!
జసిత్‌ను కిడ్నాపర్లు వదిలి వెళ్ళిన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయిం అస్మి పరిశీలించారు. ఇటుక బట్టి వద్ద ఉదయం అనుమానంగా తిరుగుతున్న కొంతమంది యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అర్ధరాత్రి 12:38 గంటల ప్రాంతంలో రెండు బైకులు మీద వచ్చిన నలుగురు వ్యక్తులు జసిత్‌ను వదలివెళ్లినట్టు కుతుకులూరు వద్ద సీసీ కెమెరాల్లో రికార్డైంది. మళ్లీ వారు 1.19 గంటల ప్రాంతంలో తిరిగివెళ్లినట్టు సీసీ కెమెరాల్లో కనిపించింది. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షి ఒకరు ధ్రువీకరించారు. జసిత్‌ను అర్థరాత్రి దాటిన తర్వాతే వదిలి వెళ్లారని తెలిపాడు.

(చదవండి : జసిత్‌ను వదిలిపెట్టిన కిడ్నాపర్లు..!)

మరిన్ని వార్తలు