జసిత్‌ను చూసిన ఆ క్షణం.. తల్లి ఉద్వేగం..!

25 Jul, 2019 12:32 IST|Sakshi

తల్లడిల్లిన అమ్మకు సాంత్వన

మూడు రోజుల నరకయాతనకు తెర

సాక్షి, మండపేట : కన్నకొడుకు కానరాక ఆ తల్లి పడిన వేదన వర్ణనాతీతం. నాలుగేళ్ల జసిత్‌ బుడిబుడి అడుగులు లేక ఆ ఇల్లు చిన్నబోయింది. మూడు రోజులుగా కిడ్నాపర్ల చెరలో ఉన్న చిట్టి తండ్రి ఎలా కంటబడతాడో అని క్షణమొక యుగంగా గడిచింది. అయితే, ఆ తల్లి మొర ఏ దేవుడో ఆలకించాడు. ఓవైపు పోలీసుల ముమ్మర గాలింపు చర్యలు, మరోవైపు సామాజిక మాధ్యమాలు, టీవీల్లో జసిత్‌ కిడ్నాప్‌ ఉదంతంపై విసృత ప్రచారం నేపథ్యంలో కిడ్నాపర్లు దిగొచ్చారు. పిల్లాడు తమవద్దే ఉంటే ఇక దొరికిపోవడం ఖాయమనుకున్నారు. గురువారం ఉదయం అనపర్తి మండలం కుతుకులూరు అమ్మవారి గుడివద్ద వదిలివెళ్లారు.
(చదవండి : జసిత్‌ను వదిలిపెట్టిన కిడ్నాపర్లు..!)

ఇటుకబట్టీల్లో పనిచేసే కార్మికులు పిల్లాన్ని చేరదీసి ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. జసిత్‌ను ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ క్షేమంగా తల్లి ఒడి చేర్చారు. బిడ్డను చూసిన నాగావళి ఆనందంతో కన్నీటిపర్యంతమయ్యారు. తనయుడ్ని చేతుల్లోకి తీసుకుని ముద్దులతో ముంచెత్తారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ చొరవ వల్లే తమ పిల్లాడు క్షేమంగా ఇల్లు చేరాడని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల పనితీరుపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. జసిత్‌ రాకతో ఆ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది. పండుగ వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు