సమ్మె ప్రశాంతం

9 May, 2015 03:50 IST|Sakshi
సమ్మె ప్రశాంతం

ఎంసెట్ పరీక్షతో ర్యాలీ, ధర్నాలకే పరిమితం
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వైఎస్సార్‌సీపీ సంఘీభావం
ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో ఆర్టీసీపై అదనపు భారం
జిల్లాలో రోడ్డెక్కిన  403 బస్సులు
ఇబ్బందులుపడ్డ దూర ప్రాంత ప్రయాణికులు

 
 నెల్లూరు (రవాణా): జిల్లాలో శుక్రవారం విద్యార్థులకు ఎంసెట్ పరీక్ష ఉండటంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెను ప్రశాంతంగా నిర్వహించారు. కేవలం ర్యాలీలు, ధర్నాలకే పరిమితమయ్యారు. నగర, రూరల్ ప్రాంతాల్లోని 20 సెంటర్లలో 16 వేల మంది విద్యార్థులు పరీక్షకు హజరయ్యారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో ఆర్టీసీ యూనియన్లు సమ్మెకు సడ లింపు ఇచ్చారు. దీంతో జిల్లాలోని ఆయా డిపోల నుంచి పోలీసుల సహకారంతో 403 బస్సులు తిరిగాయి. ఆర్టీసీ అధికారులు దూరప్రాంతాలకు బస్సులను పంపకుండా కేవలం జిల్లాలోనే తిప్పారు. మొత్తం 707 బస్సులుకు గాను 294 ఆర్టీసీ, 109 అద్దె బస్సులును తిప్పినట్లు అధికారులు చెబుతున్నారు.

అయితే దూరప్రాంతాలు చెన్నై, విశాఖ, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డా రు. ట్రావెల్స్, ప్రైవేటువాహనాలు చార్జీలను రెట్టింపు చేశారు. అధికచార్జీలను నియంత్రించడం లో అటు పోలీసు, రవాణా, అర్టీసీ అధికారులు విఫలమయ్యా రు. ఇంకెన్నాళ్లు ఈ అవస్ధలు పడాలో తెలియడం లేదని పలువురు ప్రయాణికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సులను ప్రైవేటు డ్రైవర్లు, కం డక్టర్లతో తిప్పడంతో ఆర్టీసీపై అదనపుభారం పడింది.

 ర్యాలీ, ధర్నాలకే పరిమితం
  43శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని సమ్మెబాట పట్టిన ఆర్టీసీ యూనియన్ల నాయకులు, కార్మికులు శుక్రవారం ర్యాలీ, ధర్నాలకే పరిమతమయ్యారు. ఆర్టీసీలోని అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి వీఆర్‌సీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిపోల ఎదుట ముందు ధర్నా నిర్వహించారు.ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మెకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధరరెడ్డి వెళ్లి సంఘీభావం ప్రకటించారు. నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ కూడా సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు సీపీఎం, సీపీఐ, సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు.

అర్టీసీపై అదనపు భారం
 శుక్రవారం మొత్తం 403 బస్సులు తిరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అంటే మొత్తం డ్రైవర్లు 294 మంది, కండక్టర్లు 403 మందిని కొత్తగా నియమించారు. డ్రైవర్‌కు రూ. 1000లు, కండక్టర్‌కు రూ. 800లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన డ్రైవర్లుకు రోజుకు రూ. 2.94 లక్షలు, కండక్టర్లకు రూ. 3.22 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం కలిపి రూ. 6.16 లక్షలు చెల్లించాల్సి ఉంది. పీక్ సీజన్ పేరుతో పక్కన బెట్టిన కొంతమంది కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరైనట్లు తెలిసింది.

 ఇబ్బందుల పడ్డ ప్రయాణికులు
 ఎంసెట్ పరీక్ష ఉండటంతో ఎక్కువ బస్సులను విద్యార్థులకు కేటాయించారు. దీంతో ఆయా ప్రాం తాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సమీప ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆటోలు, టాటాఏసీలను ఆశ్రయించారు. అయితే దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు మాత్రం వాహనాల కోసం ఎదురుచూశారు. చెన్నై, తిరుపతి, బెంగూళూరు, హైదరాబాద్‌లకు ప్రవేటు బస్సులు ఛార్జీలను రెట్టింపు చేశారు. కొంత మంది కార్లును అద్దెకు తీసుకుని వెళ్లగా మరికొంతమంది రైళ్లును ఆశ్రయించారు.

ఎంసెట్‌కు 253 బస్సులు
 ఎంసెట్ పరీక్షకు మొత్తం 253 బస్సులన తిప్పినట్లు అధికారులు చెబుతున్నారు. 137 బస్సులను ఆర్టీసీ, 116 బస్సులను రవాణాశాఖ అందజేశారు. అయితే ఎక్కువ మంది విద్యార్థులు, తల్లిదండ్రులు అద్దె వాహనాలు తీసుకుని ఎంసెట్ పరీక్షకు హజరైనట్లు తెలిసింది. దూర ప్రాంతాల విద్యార్థులు మాత్రం ముందు రోజే నెల్లూరు నగరానికి చేరుకున్నట్లు సమాచారం. వరుసగా 3రోజులు టెట్, డీఎస్సీ పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షల సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సడలింపు ఇస్తారా లేక మరింత ఉధృతం చేస్తారో వేచి చూడాల్సి ఉంది. ఆర్టీసి కార్మికులు మాత్రం శనివారం నుంచి సమ్మెను ఉధృతం చేయునున్నట్లు చెబుతున్నారు.  

 విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వాహనాలు- ఎన్.శివరాంప్రసాద్, రవాణా ఉపకమిషనర్
 విద్యార్థులకు మూడు రోజులు వరుస పరీక్షలు ఉండటంతో ఇబ్బందులు లేకుండా వాహనాలను తిప్పుతున్నాం. ఎంసెట్‌కు రవాణాశాఖ నుంచి 116 వాహనాలను ఏర్పాటు చేశాం, మిగిలిన పరీక్షలకు కూడా వాహనాలను ఏర్పాటు చేస్తున్నాం. శుక్రవారం 115 మంది డ్రైవర్లును అర్టీసీకి పంపాం.

మరిన్ని వార్తలు