పాతతరం మందులకు స్వస్తి 

23 Oct, 2019 05:01 IST|Sakshi

సర్కారు నిర్ణయంతో ఏపీ ఎంఎస్‌ఐడీసీ జాబితాలోకి 440 కొత్త మందులు 

సాక్షి, అమరావతి: రోగాల తీరు మారిపోయింది. ఎన్ని మందులు వాడినా కొన్నిరకాల వైరస్‌లను నివారించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో రోగాలను తగ్గించేందుకు అధునాతన మందులు అందుబాటులోకొచ్చాయి. కానీ.. ప్రభుత్వాస్పత్రులకు మందులను సరఫరా చేసే మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ ఎంఎస్‌ఐడీసీ) జాబితాలో మాత్రం 1995 నాటి మందులే ఉన్నాయి. వాటివల్ల చాలా రోగాలు తగ్గటం లేదు. దీంతో ఏసీ ఎంఎస్‌ఐడీసీ జాబితా నుంచి పాత తరం మందులను తొలగించి కొత్త మందులను చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకు సంబంధించిన కసరత్తును కూడా పూర్తి చేసింది. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌ మందులతోపాటు కొన్ని రకాల యాంటీ బయోటిక్స్‌ను కొత్త జాబితాలో చేర్చుతున్నారు. రెండు నెలలుగా వివిధ వైద్య విభాగాల నిపుణులు పలు దఫాలుగా సమావేశమై చర్చించిన అనంతరం కొత్త మందులు తీసుకోవాలని నిర్ణయించారు. మొత్తం 440 రకాల కొత్త మందులను నూతన జాబితాలో చేర్చుతున్నారు. ఈ అంశంపై ఈనెల 21, 22 తేదీల్లో ఏపీ ఎంఎస్‌ఐడీసీ కార్యాలయంలో స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించి..  ఏయే మందులు తీసుకోవాలో నిర్ణయించారు. నాలుగైదు రోజుల్లో జాబితాను సిద్ధం చేయనున్నారు.

ఆ తర్వాత ఈ జాబితాను ప్రభుత్వం ఉత్తర్వుల రూపంలో ఇస్తుంది. ఇదిలావుండగా.. 2018–19 సంవత్సరంలో మందుల కోసం రూ.160 కోట్లు బడ్జెట్‌ ఇవ్వగా.. కేవలం రూ.30 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ ఏడాది వినియోగం ప్రాతిపదికన నిధులు కేటాయించడంతో అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కొత్త మందుల జాబితాపై వైద్య విద్యా సంచాలకులు డాక్టర్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ.. రోగాలకు పనిచేయని మందులు జాబితాలో ఉన్నా ఉపయోగం లేదని, అందుకే వాటిని తొలగించి కొత్త మందులను ఎంపిక చేశామన్నారు. కుక్క కాటు (ఏఆర్‌వీ) మందుల కొరతను నివారించేందుకు తొలిసారిగా ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఆ మందులను జిల్లాలకు విమానంలో తరలించించిందన్నారు. ప్రణాళికా బద్ధంగా మందులను ఎంపిక చేసి జాబితా ఇస్తే సకాలంలో సరఫరా చేసేందుకు కృషి చేస్తామని ఎండీ హామీ ఇచ్చారన్నారు.  

మరిన్ని వార్తలు