45 రోజుల్లో సమస్య పరిష్కారం

26 Jun, 2014 01:59 IST|Sakshi
45 రోజుల్లో సమస్య పరిష్కారం

విజయనగరం మున్సిపాలిటీ:విద్యుత్ వినియోగదారుల సమస్యలను 45 రోజుల్లో పరిష్కరిస్తామని విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక చైర్మన్ పి.నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇందు కోసం   180042555333 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేయూలని సూచించారు. వినియోగదారులు తెల్లకాగితంపై తమ సమస్యను నేరుగాగానీ,  పోస్టులోగానీ ఫిర్యాదు చేసినా స్వీకరించి తగు న్యాయం చేస్తామని చెప్పారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్వర సేవలు పొందాలని సూచించారు. దాసన్నపేట విద్యుత్ భవన్‌లో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక బుధవారం నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా వినియోగదారులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, అంతరాయం, మీటర్ సమస్యలు, బిల్లులు అధికంగా రావటం, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి తదితర అంశాలపై ఫిర్యాదు చేసే హక్కు ఉందన్నారు.  వినియోగదారులు తమ సమస్యను వేదికలో విన్నవించుకున్న 45 రోజుల్లో పరిష్కరిస్తుందన్నారు. స్థానికంగా ఉన్న అధికారులకు ఇదే తరహాలో ఫిర్యాదు చేయవచ్చని గుర్తు చేశారు. సమీపంలో ఉన్న కాల్‌సెంటర్‌కు వెళ్లి తమ సమస్యను నమోదు చేయించుకుంటే ఏఈ, ఏఓలు సమస్యను పరిష్కరిస్తారన్నారు.  గత  ఆర్థిక సంవత్సరం  నుంచి ఇప్పటి వరకు సంస్థ పరిధిలో ఐదు జిల్లాల్లో మొత్తం  582 ఫిర్యాదులు రాగా అందులో 503 ఫిర్యాదులను పరిష్కరించామని మిగిలిన 73 ఫిర్యాదులను త్వరలో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు.
 
 ఇందులో విజయనగరం  జిల్లా నుంచి 72 ఫిర్యాదులు రాగా 7 ఫిర్యాదులు పెండింగ్ ఉన్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 63 ఫిర్యాదులు రాగా 11, విశాఖపట్టణం జిల్లా లో 168 ఫిర్యాదులు రాగా 14, రాజమండ్రిలో 130 ఫిర్యాదులు రాగా 12, ఏలూరులో 149 ఫిర్యాదులు రాగా 29 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. వీటన్నిం టినీ వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వేదిక సభ్యులు పీఎస్ కుమార్, యు.కె.వి.రామకృష్ణరాజు, ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్  విజయనగరం డీఈ నాగి రెడ్డి కృష్ణమూర్తి, ఎస్‌ఏఓ వెంకటరాజు, పట్టణ ఏడీఈ బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.
 
 పరిష్కార వేదికకు 11 ఫిర్యాదులు...
 వినియోగదారుల సమస్యలను పరిష్కరించటంలో భాగం గా దాసన్నపేట విద్యుత్ భవన్‌లో  నిర్వహించిన  విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికకు  వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి  11 ఫిర్యాదులు అందాయి. ఇందులో ప్రధానంగా నెల్లిమర్ల, జామి ప్రాంతాల నుంచి వచ్చిన వినియోగదారులు తమకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరైనప్పటకీ సర్వీస్ నంబర్లు ఇవ్వటం లేదని ఫిర్యాదు చేశారు. వీటీ అగ్రహరంలో ఓల్టేజీ సమస్య తీవ్రంగా వేధిస్తోందని, కామాక్షి నగర్‌లో రోడ్డుకు అడ్డంగా విద్యుత్ స్తంభం ఉండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ఫిర్యాదులు వచ్చాయి.  పేర్లు మార్పు, మీటర్ రీడింగ్ సమస్యలపై ఫిర్యాదులు రాగా  రెండు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.  వీటిని వేదిక  చైర్మన్ పి.నాగేశ్వరరావు, సభ్యులు పీఎస్ కుమార్, యు.కె.వి.రామకృష్ణ స్వీకరించారు.

 

మరిన్ని వార్తలు