రాష్ట్రం.. గజగజ

19 Dec, 2018 02:42 IST|Sakshi
విశాఖ ఏజెన్సీ హుకుంపేట మండలం కొట్నాపల్లిలో పొద్దెక్కినా చలి మంటల దగ్గరే ఉన్న స్థానికులు

గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

తీవ్రమైన చలితో వణికిపోతున్న ప్రజలు

పగలు, రాత్రి అనే వ్యత్యాసం లేదు..

ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల పవనాలు

శరీరం గడ్డకట్టుకుపోయేలా ఉందంటున్న వృద్ధులు

శీతల గాలుల ప్రభావానికి రెండు రోజుల్లో మృతుల సంఖ్య 45

సాక్షి, అమరావతి, సాక్షి, విశాఖపట్నం: చలి.. చలి! చిన్నా పెద్దా ఒకటే వణుకు... ఉష్ణోగ్రతల్లో పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో పగలు, రాత్రి అనే తేడా తెలియడం లేదు. భానుడి కిరణాలు సోకక ఎటు చూసినా, ఎప్పుడు చూసినా మసక మసకగానే కనిపిస్తోంది. చలి పులి పట్టపగలే అందరినీ గజగజలాడిస్తోంది. శీతల గాలుల ప్రభావానికి రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల వ్యవధిలో 45 మంది మృత్యువాత పడటం గమనార్హం. ఇక నోరులేని మూగజీవాల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. హఠాత్తుగా ఉష్ణోగ్రతలు పడిపోవడం, పెథాయ్‌ తుపాను ప్రభావంతో అతి శీతలమైన ఈదురు గాలులు ఈడ్చి కొడుతుండటంతో రాష్ట్రం మరీ ముఖ్యంగా కోస్తాంధ్ర చలితో వణికిపోతోంది. రాత్రి ఉష్ణోగ్రతలే కాకుండా పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. దీంతో పగటిపూట కూడా చలిగా ఉంటోంది. ఒక్కసారిగా పెరిగిన చలి జనం ప్రాణాలు తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వీస్తున్న శీతల పవనాలకు తట్టుకోలేక సోమవారం 26 మంది ప్రాణాలు కోల్పోగా మంగళవారం 19 మంది చనిపోయారు. రాష్ట్రంలో వడగాడ్పు మరణాలు భారీగా నమోదైనా చలిగాలులకు ఇంత పెద్ద ఎత్తున మృత్యువాత పడటం అరుదని పేర్కొంటున్నారు. 

వణికిస్తున్న ఉత్తరాది గాలులు
బంగాళాఖాతంలో అల్పపీడనం/వాయుగుండం/తుపాన్లు ఏర్పడినప్పుడు మేఘాలు ఆవరించి ఉంటాయి. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల చలి తీవ్రత అంతగా ఉండదు. అయితే నిన్నటిదాకా కొనసాగిన పెథాయ్‌ తుపాను అల్పపీడనంగా బలహీనపడడంతో చలికి రెక్కలొచ్చి నట్టయింది. శనివారం నుంచే వణికించడం మొదలైంది. అల్పపీడనం ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఉత్తర భారతదేశం నుంచి కోస్తా వైపు చల్ల గాలులు బలంగా వీస్తున్నాయి. దీంతో పగలు, రాత్రి చలి తీవ్రత పెరుగుతోంది. ఇళ్లలోనే గడుపుతున్నా ఇబ్బంది పెడుతోంది. డిసెంబర్‌ 22వతేదీ నుంచి సూర్యుడు ఉత్తరార్థగోళం వైపు పయనించడం వల్ల భూమికి దూరమవుతాడు. ఫలితంగా సూర్యకిరణాలు వాలుగా పడుతూ ఎండ తీవ్రత తగ్గి రాత్రి ఉష్ణోగ్రతలు క్షీణిస్తాయని వాతావరణ శాఖ రిటైర్డ్‌ అధికారి ఆర్‌.మురళీకృష్ణ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తాలో కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా (సాధారణం కంటే 3–10 డిగ్రీలు) తక్కువగా నమోదవుతున్నాయి. ఇది క్రమంగా మరింత తగ్గి చలి విజృంభిస్తుందని, అదే సమయంలో పొగమంచు కూడా పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 

పడిపోయిన గరిష్ట ఉష్ణోగ్రతలు..
రాష్ట్రంలో చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే బాగా పడిపోయాయి. కృష్ణా జిల్లా నందిగామలో సాధారణ ఉష్ణోగ్రత కంటే ఏకంగా 10 డిగ్రీల సెల్సియస్‌ తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు విజయవాడలో 9, మచిలీపట్నంలో 8,  తునిలో 7, నరసాపురంలో 7, జంగమేశ్వరపురంలో 6 డిగ్రీల సెల్సియస్‌ తక్కువగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో నమోదైన పగటి, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం స్పల్పంగా మాత్రమే ఉండటం గమనార్హం. చలి భారీగా పెరగడంతో ఉదయం 9 గంటలకు కూడా ట్యాప్‌ తిప్పితే నీళ్లు షాక్‌ కొడుతున్నాయి. మంచు దట్టంగా కురుస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో తెల్లవారుజామునే చలిమంటలు వేస్తున్నారు. పంటలకు కాపలాగా పొలాల్లో పడుకునే వారు దుంగలు రాజేసి చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. చలికి శరీరం గడ్డ కట్టుకుపోయేలా ఉందని వృద్ధులు పేర్కొంటున్నారు. ఉదయం 9 గంటలకు కూడా చలిగా ఉండటంతో బయటకు వెళ్లినవారు వణుకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. తెల్లవారుజామునే ఉదయం నడక కోసం వెళ్లేవారు ఈ చలితో సమయాన్ని మార్చుకుని 8 –9 గంటల మధ్య వెళుతున్నారు. పొలం పనులకు వెళ్లే కూలీలు వణికిపోతున్నారు. సూర్యరశ్మి లేకపోవటంతో అరటి, బొప్పాయి ఆకులపై కురిసిన మంచు నీటి బిందువుల్లా ఉండిపోతోంది. ఊపిరితిత్తుల సమస్య ఉన్న వారు చలి తీవ్రత వల్ల నరకయాతన అనుభవిస్తున్నారు. చలి నేపథ్యంలో స్వెట్టర్లు, ఉన్ని దుస్తులకు బాగా గిరాకీ పెరిగింది. వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. 

ఏజెన్సీలో రాకపోకలకు ఇబ్బందులు
ఏజెన్సీ ప్రాంతంలో రాత్రిపూట పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో రాత్రిపూట వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అరకులో పర్యాటకుల కోసం రిసార్టు నిర్వాహకులు రాత్రిపూట చలిమంటలు ఏర్పాటు చేస్తున్నారు. గాజు కిటికీలకు బయట భాగంలో మంచు దట్టంగా ఆవరిస్తోంది. 

జనవరిలో మరింత ఉధృతం...
విశాఖపట్నం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉన్నా ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా పూర్తిస్థాయిలో పడిపోలేదు. విశాఖ జిల్లా లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రత డిసెంబరు చివరికి సున్నా డిగ్రీలకు చేరిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 7 – 8 డిగ్రీల సెల్సియస్‌ దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 5 డిగ్రీల సెల్సియస్‌ కంటే తగ్గినప్పుడే ఇక్కడి వారు ఇబ్బంది ఎదుర్కొంటారు. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోతే ఇళ్ల ఎదుట చలిమంటలు వేసి నిద్రిస్తారు. దీంతో కొంతవరకూ చలి నుంచి ఊరట లభిస్తుంది. చింతపల్లి, పాడేరు, నర్సీపట్నం, అరకు, మారేడుమిల్లి, సీతంపేట ఏజెన్సీల్లో జనవరిలో చలి తీవ్రరూపం దాల్చుతుంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా చలి ముదురుతుంది. 

రక్తనాళాలు పూడుకుపోయే ప్రమాదం..
చలి బాగా పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు, గుండె, ఊపిరితిత్తులు తదితర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ పీఎల్‌ఎన్‌ కపర్థి సూచించారు. ‘చలికి శరీరంలో రక్తానికి గడ్డ కట్టే స్వభావం ఉంటుంది. దీనివల్ల గుండె రక్తనాళాలు పూడుకుపోతాయి. అందువల్ల హృద్రోగ సమస్యలు ఎదుర్కొంటున్నవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, బలహీనులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.

చలి నుంచి కాపాడుకోవాలి ఇలా....
– చలి నుంచి రక్షణ కోసం ఉన్ని దుస్తులు ధరించాలి. చెవులకు చల్ల గాలి తగలకుండా ఉన్ని మఫ్లర్, టోపీ ధరించాలి.
– ఇళ్లలోకి చల్ల గాలి రాకుండా కిటికీలు మూసివేయాలి.
– అవకాశం ఉన్నవారు గది వాతావరణం పడిపోకుండా ఎయిర్‌ కండిషనర్లు వాడుకోవచ్చు. 
– ద్విచక్ర వాహనాలపై రాత్రిపూట, తెల్లవారుజామున వెళ్లాల్సి వస్తే ముక్కు, చెవులకు చల్ల గాలి తగలకుండా ఉన్ని టోపీ ధరించాలి.స్వెట్టర్లు వాడాలి.
– ఉదయం నడక అలవాటు ఉన్నవారు సూర్యోదయమైన తర్వాత వెళ్లడం మంచిది. 

మరిన్ని వార్తలు