షేక్‌ చేస్తున్న ఫేక్‌ న్యూస్‌

20 Feb, 2020 13:13 IST|Sakshi

సోషల్‌ మీడియాలో 45 శాతానికి పైగానకిలీ వార్తలే

రాజకీయాలు, బిజినెస్‌ వార్తల్లో మరీ ఎక్కువ

ఫేక్‌ న్యూస్‌లో ఫేస్‌బుక్‌ ఫస్ట్‌.. తర్వాత వాట్సప్‌

ప్రముఖ సంస్థల సర్వేల్లో వెల్లడి

సాక్షి, అమరావతి: దేశంలో విస్తృతమవుతున్న సోషల్‌ మీడియాను ఫేక్‌ న్యూస్‌ షేక్‌ చేస్తోంది. భూతంలా మారి అతిపెద్ద సవాల్‌ విసురుతోంది. సోషల్‌ మీడియాలో 45 శాతానికి పైగా నకిలీ వార్తలు, నకిలీ పోస్టులు వైరల్‌ అవుతున్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఫేక్‌ న్యూస్‌ విచ్చలవిడిగా వైరల్‌ అవుతుండటం ఆందోళనకరంగా మారిందని టెక్నాలజీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రాజకీయ అంశాలు, బిజినెస్‌ వ్యవహారాల్లో ఎక్కువ నకిలీ వార్తలు అత్యధికంగా వైరల్‌ అవుతున్నట్లు గుర్తించారు. ‘స్టాటిస్టా’ వెబ్‌సైట్‌ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న సర్వేలో ఈ అంశాలు స్పష్టమయ్యాయి. సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ గవర్నెన్స్‌ ఇన్నోవేషన్‌ (సీఐజీఐ), మైక్రోసాఫ్ట్, బీబీసీ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ ఇవే అంశాలు వెల్లడయ్యాయి. నకిలీ వార్తలు వైరల్‌ అవడంలో ఫేస్‌బుక్‌ అగ్ర స్థానంలో ఉండగా, వాట్సప్‌ రెండో స్థానంలో నిలిచినట్లు గుర్తించారు.

మైక్రోసాఫ్ట్‌ సర్వే ఏం చెబుతోందంటే..
ఎప్పుడో చోటుచేసుకున్న ఘటనలను తాజాగా జరిగినట్లు ప్రచారం చేస్తూ ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ఘటనలు ఎక్కువ ప్రసారమవుతున్నట్లు మైక్రోసాఫ్ట్‌ సర్వేలో తేలింది. పాత ఫొటోలు, వీడియోలను ఇప్పుడు జరిగినట్లు చూపడం సమస్యాత్మకంగా మారిందని వెల్లడించింది. గ్రాఫిక్‌ కార్డులు ఉపయోగించి ప్రముఖ వ్యక్తులపై ప్రచారం చేయడం ద్వారా అవాస్తవ సమాచారాన్ని వైరల్‌ చేసే వారిలో సాధారణ ప్రజలు కూడా చాలాసార్లు తమకు తెలియకుండానే పాలుపంచుకుంటున్నట్లు గుర్తించారు. ఈ మాధ్యమాలన్నీ నకిలీ వార్తలు, తప్పుడు సమాచారంతో నిండిపోయి ఉంటున్నట్లు గుర్తించారు.

సీఐజీఐ సర్వేలో 65 శాతంగా వెల్లడి
దేశంలో 46 కోట్ల మంది సోషల్‌ మీడియా వినియోగదారులు ఉన్నారు. అందులో ఫేస్‌బుక్‌ వాడేవారు అత్యధికంగా 33 కోట్ల మంది. సీఐజీఐ గత ఏడాది అంతర్జాతీయంగా చేపట్టిన సర్వేలో మన దేశంలో ఫేస్‌బుక్‌ ద్వారా 67 శాతం ఫేక్‌ న్యూస్‌ వైరల్‌ అవుతున్నట్లు తేలింది. సాధారణంగా అన్ని సోషల్‌ మీడియా సాధనాల్లో 65 శాతం ఫేక్‌ న్యూస్‌ వస్తున్నట్లు ప్రజలు భావిస్తున్నట్లు ఆ సర్వేలో తేలింది. యూట్యూబ్‌లో 56 శాతం ఫేక్‌ వీడియోలు వస్తున్నట్లు తెలిపింది. ఎక్కువ శాతం పోస్టులు వాస్తవాలను వక్రీకరించేలా, తప్పుడు సమాచారాన్ని చొప్పించేలా ఉంటున్నట్లు ఆ సర్వే తేల్చింది. దాదాపు చాలా సర్వేల్లో ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, షేర్‌చాట్, టిక్‌టాక్, యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ నకిలీ కథనాలు, పుకార్లు, ద్వేషపూరిత అంశాలు ఎక్కువ వైరల్‌ అవుతున్నట్లు గుర్తించారు. మార్ఫింగ్‌ ఫొటోలను షేర్‌ చేయడం, నకిలీ వీడియోలు, తప్పుడు సంక్షిప్త సందేశాలను భారీ ఎత్తున సోషల్‌ మీడియా ద్వారా వ్యాప్తి చేయడం సర్వసాధారణంగా మారినట్లు గుర్తించారు.

ప్రత్యేక సందర్భాల్లో మరీ ఎక్కువ
ఎన్నికల సమయాల్లో నకిలీ వార్తలు ఊహించని రీతిలో వైరల్‌ అవుతున్నట్లు గుర్తించారు. గత సాధారణ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పోటీపడి నకిలీ, తప్పుడు వార్తలను వ్యాప్తి చేశాయని గుర్తించారు. ఏదైనా పెద్ద అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా ఫేక్‌ న్యూస్‌ వైరల్‌ అవడం సర్వసాధారణంగా మారిపోయింది. పుల్వామా దాడి ఘటన నుంచి ఆర్టికల్‌ 370 రద్దు, వాటిపై జరిగే ఉద్యమాలకు సంబంధించి కూడా విపరీతమైన అవాస్తవాలు వైరల్‌ అయినట్లు గుర్తించారు. వాట్సప్‌లో వైరల్‌ అవుతున్న సంక్షిప్త సందేశాల వల్ల కొన్నిచోట్ల ఘర్షణలు జరగడం, కుల, మతాల గొడవల కారణంగా హత్యలు వంటి నేరాలు చోటుచేసుకుంటున్నట్లు గుర్తించారు.

నియంత్రణ కోసం ఒకే గొడుగు కిందకు..
ఫేక్‌ న్యూస్‌ను నియంత్రించేందుకు కలిసి పని చేయాలని నిర్ణయించుకున్న ఫేస్‌బుక్, గూగుల్, షేర్‌ చాట్‌ వంటి ప్రముఖ సంస్థలు చర్చలు జరుపుతున్నాయి. ఇన్ఫర్మేషన్‌ ట్రస్ట్‌ అలయన్స్‌ పేరుతో ఒకే గొడుగు కిందకు వచ్చి కేంద్ర ప్రభుత్వం సూచించే మార్గదర్శకాల ప్రకారం పనిచేయాలని ఆ సంస్థలు భావిస్తున్నాయి. దేశంలోని డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్, పబ్లిషర్స్, సివిల్‌ సొసైటీ బృందాల భాగస్వామ్యంతో స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీల్లో అవగాహన సదస్సులు, వర్క్‌ షాపులు ఏర్పాటు చేయాలనే యోచనలో సదరు సంస్థలు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాలనూవణికిస్తున్నాయ్‌
తెలుగు రాష్ట్రాల్లోనూ నకిలీ, తప్పుడు వార్తలు వణికిస్తున్నాయి. మన రాష్ట్రంలో రాజకీయపరమైన అంశాల్లో ఎక్కువగా నకిలీ వార్తలు వైరల్‌ అవుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు ఎంత ప్రయత్నం జరుగుతున్నా అది ఆగడం లేదు. వాట్సప్‌ సందేశాల వల్ల ఘర్షణలు, హత్యలు జరిగే పరిస్థితి ఉండటంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఫలితంగా వాట్సప్‌ యాజమాన్యం దేశంలో ప్రత్యేకంగా తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి మరీ నియంత్రణ చర్యలు చేపట్టింది. సోషల్‌ మీడియా నెట్‌వర్కింగ్‌ వ్యవస్థలు స్వయం నియంత్రిత వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం ఒత్తిడి చేస్తోంది. ఫలితంగా ఆయా కంపెనీలు కొన్ని చర్యలు తీసుకుంటున్నా నకిలీ వార్తలు మాత్రం ఆగడం లేదు.

మరిన్ని వార్తలు