ప్రాణాలు తీసిన విభజన ప్రకటన

2 Aug, 2013 01:24 IST|Sakshi

రాష్ట్ర విభజన ప్రకటనను జీర్ణిం చుకోలేక ఇద్దరు యువకులు గురువారం ఆత్మహత్య చేసుకోగా, గుండెపోటుతో మరో ముగ్గురు మరణిం చారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయపనులు చేస్తూ జీవనం సాగిస్తున్న నాగరాజు, హనుమంతమ్మ దంపతుల కుమారుడు బాలరాజు (18) పదో తరగతి చదివాడు. అలాగే ఎర్రిసామి, శకుంతలమ్మ దంపతుల కుమారుడు విష్ణు (18) ఎనిమిదో తరగతితో చదువు చాలించి, ఊర్లోనే వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. వీరిద్దరూ మంచి మిత్రులు. బుధవారం రాత్రి టీవీలలో రాష్ట్ర విభజనకు సంబంధించిన వార్తలను చూసి ఆందోళనకు గురైన వీరు గురువారం ఉదయం బహిర్భూమికి వెళ్లి, పురుగులమందు తాగారు. అపస్మారక స్థితిలో పడిఉన్న వీరిని అటువైపు వెళ్లిన గ్రామస్తులు గమనించారు. అప్పటికే బాలరాజు మృతిచెందగా, కొనఊపిరితో ఉన్న విష్ణును ఆదోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా, చికిత్సపొందుతూ మృతి చెందాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా, అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన డ్రైవర్ బాబ్జాన్  (45) బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. అన్నదమ్ముల్లా కలసి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం రెండుగా చీలిపోతోందన్న బాధను తట్టుకోలేక గుండెపోటుకు గురై చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గుంటూరు జిల్లా  కాకుమాను మండలం గార్లపాడుకు చెందిన వైఎస్సార్ సీపీ నేత ఉమ్మలనేని సుబ్బారావు (60) గురువారం మధ్యాహ్నం పంచాయతీ కార్యాలయం వద్ద స్థానికులతో తెలంగాణపై చర్చిస్తూ గుండెపోటుకు గురై మృతి చెందాడు. అదేవిధంగా చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామవాసి కూరాకుల నాగేంద్రం (65) రెండురోజులుగా టీవీల్లో వస్తున్న వార్తలతో మనస్తాపం చెంది, గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు అతడి బంధువులు తెలిపారు.

కాగా, వైఎస్సార్ జిల్లా కడపలో ఇద్దరు, బద్వేలులో ముగ్గురు, రైల్వే కోడూరులో మరో ముగ్గురు, ఎర్రగుంట్లలో ఇద్దరు విద్యార్థులు సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కడప నగరంలోని డీసీసీ కార్యాలయం ఎదుట ఇద్దరు విద్యార్థులు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా, పోలీసులు వీరిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతపురంలో ఎస్కేవర్సిటీకి చెందిన 15 మంది విద్యార్థులు వర్సిటీలోని కెమిస్ట్రీ భవనంపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నా రు. తిరుపతిలో ఓ భవనంపై నుంచి దూకేందుకు యత్నించిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు.

మరిన్ని వార్తలు