50% మధ్యంతర భృతి ఇవ్వాలి: అశోక్‌బాబు

29 Oct, 2013 01:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పదో వేతన సంఘం సిఫారసులు అమలులోకి వచ్చేందుకు ఇంకా సమయం ఉన్నందున, ప్రస్తుత అధిక ధరల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని 50% మధ్యంతర భృతిని ప్రకటించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈమేరకు రేపోమాపో సీఎంను కలసి విజ్ఞాపన పత్రం ఇవ్వాలని నిర్ణయించింది. హెల్త్‌కార్డుల జారీ విషయంలో జాప్యానికి తెరదించి ఉద్యోగులు కోరినట్టుగా పరిమితిలేని చికిత్స, ఔట్‌పేషెంట్ చికిత్సకూ చోటు కల్పించే నిబంధనలతో వాటిని జారీ చేయాలని డిమాండ్ చేసింది. సోమవారం ఉద్యోగ సంఘాల జేఏసీ కార్యవర్గ సమావేశం జరి గింది. అనంతరం జేఏసీ నేతలు ఏపీ ఎన్జీఓల సంఘం భవనంలో విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అంశం పరిశీలనలో ఉన్న ప్రస్తుత తరుణంలో పదో వేతన సంఘం అమలుపై కాలయాపన తగదన్నారు.
 
  ప్రస్తుత సందిగ్ధ పరిస్థితి ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, పీఆర్‌సీ నివేదికపై కసరత్తును నవంబర్ 15 నాటికల్లా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు. అన్ని వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యం లో పీఆర్‌సీ అమలు వరకు ఎదురు చూడకుండా ఉద్యోగులకు 50% మధ్యంతర భృతి ప్రకటించాలని, దీన్ని గత జూలై ఒకటి నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే మళ్లీ ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమని స్పష్టంచేశారు. సమావేశంలో జేఏసీ సభ్యులు కె.నరసింహారెడ్డి, బి.వెంకటేశ్వర్లు, ఐ.వెంకటేశ్వరరావు, కె.సుబ్బారెడ్డి, ఎన్.రఘురామిరెడ్డి, యు.కుల్లాయప్ప, ఆర్.అప్పారావు, డి.జి.ప్రసాదరావు, డి.మణికుమార్, టి.వి.ఫణిపేర్రాజు, ఎన్.చంద్రశేఖరరెడ్డి, ఓబులపతి తదితరులు పాల్గొన్నారు.
 
 సీమాంధ్ర ఉద్యమం ఆగదు: అసెంబ్లీని సమావేశపరచిన వెంటనే మళ్లీ సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ప్రారంభిస్తామని అశోక్‌బాబు తెలిపారు. ఎవరు ఒత్తిడి తెచ్చినా సమ్మెను విరమించే పరిస్థితి ఉండదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్తూ, తమను భయపెట్టి ఉద్యమాన్ని నిలువరించే స్థాయి సీఎంకు కూడా ఉందనుకోవటం లేదన్నారు.

 మధ్యంతరభృతి వెంటనే చెల్లించాలి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే 65% మధ్యంతరభృతి చెల్లించాలని ఏపీ నీటి పారుదల శాఖ ఎన్జీవోలు డిమాండ్ చేశారు. సంక్రాంతిలోగా పీఆర్సీని అమల్లోకి తేవాలని, గత జూలై 1 నుంచి వర్తింపజేయాలని కోరారు. ఈ మేరకు సంఘం ప్రతినిధులు సోమవారం పీఆర్సీ చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. తర్వాత సంఘం అధ్యక్షుడు పి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ పీఆర్సీ అమల్లో ప్రభుత్వ జాప్యాన్ని తప్పుపట్టారు. కాగా, విభజనపై కేంద్రం ముందుకు వెళ్తే మెరుపుసమ్మెకు దిగుతామని, ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలేస్తామని సంఘం కార్యదర్శి శ్రీనివాసరావు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు