రాష్ట్రంలో సగం మందికి దంత సమస్యలు

23 Feb, 2014 00:46 IST|Sakshi
రాష్ట్రంలో సగం మందికి దంత సమస్యలు

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 50 శాతం మంది వివిధ రకాల దంత సమస్యలతో బాధపడుతున్నారని, అలాగే, దేశంలోనూ ఎక్కువ మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని దంతవైద్య నిపుణులు తెలిపారు. దీనిని అధిగమించేందుకు ప్రతి ఒక్క దంతవైద్యుడూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలయన్స్ ఫర్ క్యావిటీ-ఫ్రీ ఫీచర్ సంస్థ (ఏసీఎఫ్‌ఎఫ్) ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని హైటెక్స్‌లో భారతీయ దంతవైద్య సదస్సు-2014 జరిగింది. ఇందులో పలువురు నిపుణులు పాల్గొని మాట్లాడారు. ఎక్కువ మంది పిప్పిపళ్ల సమస్యతో బాధపడుతున్నారని.. దీన్ని అధిగమించేందుకు వైద్యులు, ఎన్జీవోలు ముందుకు రావాలని ఏసీఎఫ్‌ఎఫ్ సహ డెరైక్టర్, కింగ్స్ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ రామన్‌బేడీ తెలిపారు. ప్రభుత్వాలు కూడా సహకరించాలని సూచించారు.

పిప్పిపళ్ల సమస్య చిన్నారుల్లో అధికంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాల్లో  50 శాతం, గ్రామాల్లో 34 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులు పిప్పిపళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పారు. సమగ్ర నోటి ఆరోగ్యానికి, పిప్పిపళ్ల సమస్యను నియంత్రించేందుకు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నామని తెలిపారు. భారతీయ డెంటల్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ డాక్టర్ అశోక్ ధోబ్లే మాట్లాడుతూ.. ఏసీఎఫ్‌ఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషకరమని.. దీని ద్వారా సమాజంలో పిప్పిపళ్ల సమస్యను అధిగమించి, నోటి సంరక్షణపై అవగాహన కలిగించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు