జలయజ్ఞంలో 500 కోట్లు హాంఫట్

23 Oct, 2013 02:49 IST|Sakshi
జలయజ్ఞంలో 500 కోట్లు హాంఫట్
వారంతా జలయజ్ఞం కాంట్రాక్టర్లు... లెక్క ప్రకారం వ్యాట్ రూపంలో ప్రభుత్వానికి పన్ను చెల్లించారు. కానీ... ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన ఆ మొత్తం చూస్తుండగానే తిరిగి కాంట్రాక్టర్ల జేబుల్లోకి చేరింది. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా రూ.500 కోట్లు ఇలా వెనక్కు మళ్లాయి. ‘ఇదో కుంభకోణం... బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అంటూ విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా దీనిపై చర్యలు లేవు. డబ్బులు పొందిన వారిలో అధికార పార్టీ పార్లమెంటు సభ్యులు, పలువురు నేతలకు చెందిన కంపెనీలున్నాయి. 
 
  ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది.  లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయటంలో విఫలమవుతున్న కిరణ్ ప్రభుత్వం.... కాంట్రాక్టర్లకు అయాచిత లబ్ధి చేకూర్చటంలో మాత్రం ఎనలేని 
 
 ఉత్సాహం చూపుతోంది. ప్రభుత్వ పెద్దలు చకచకా పావులు కదిపి గుట్టుగా గూడుపుఠాణి నడుపుతున్నారు. జలయజ్ఞం పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు అప్పటి వాణిజ్య పన్నుల శాఖ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి వ్యాట్ రూపంలో పన్ను చెల్లించారు. కానీ ఆ తర్వాత వాటిని తిరిగి రాబట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా గతంలో ఎప్పుడో ఓ కేసు విషయంలో వచ్చిన కోర్టు తీర్పును ఆధారం చేసుకుని ఈ పన్నును తిరిగి పొందేందుకు ప్రభుత్వ పెద్దలతో సమాలోచనలు జరిపారు. 
 
 ఓ ముఖ్యనేతతో సన్నిహిత సంబంధాలున్న అధికారి ఒకరు చక్రం తిప్పారు. ఇంకేముంది.. బడా కాంట్రాక్టర్లు చెల్లించిన పన్ను తిరిగి వారి జేబుల్లోకి వెళ్లడం ప్రారంభమైంది. గడచిన రెండేళ్ల కాలంలో దశలవారీగా రూ.500 కోట్లు వారికి చేరిపోయాయి. కొన్ని కంపెనీలకు ఐదారు దఫాలుగా కూడా చెల్లించారు. ఈ వ్యవహారమంతా గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. అయితే పన్ను డబ్బులు తిరిగి పొందలేకపోయిన కొందరు కాంట్రాక్టర్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన ఆ విభాగం ... కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా జరిగిన ఈ వ్యవ హారం అక్రమమని తేల్చి ఇదో కుంభకోణమేనంటూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవ హరించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫారసు కూడా చేసింది. 
 
 ఆ నివేదిక ఆరునెలల క్రితమే అందినా ప్రభుత్వం దాన్ని తొక్కి పెట్టింది. సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరినా ‘ఈ వ్యవహారం దర్యాప్తులో ఉన్నందున వివరాలు ఇవ్వలేము’ అంటూ అధికారులు దాన్ని బయటపెట్టడం లేదు. కాంట్రాక్టర్ల నుంచి ముందస్తుగా వసూలు చేసే టీడీఎస్‌ను... ఆ తర్వాత వారు చెల్లించాల్సిన పన్నును బేరీజు వేసుకుని, టీడీఎస్ కంటే పన్ను మొత్తం తక్కువగా ఉన్న సందర్భాల్లోనే ఇలా వెనక్కు ఇవ్వాల్సి వచ్చిందంటూ అధికారులు ఓ నివేదికను సిద్ధం చేస్తున్నారు. వెరసి పన్ను మొత్తం వెనక్కు ఇవ్వటంలో అక్రమాలు జరగలేదని చెప్పే ప్రయత్నం జరుగుతోంది. పన్ను మదింపులో లాఘవం ప్రదర్శించటం ద్వారా ఈ మొత్తం వ్యవహారంలో తప్పులు జరగలేదని తే ల్చే ప్రయత్నం ఇప్పటికే మొదలైందని సమాచారం. విజిలెన్స్ విచారణ సరిగా జరగలేదని పేర్కొంటూ మరో విచారణకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 
 
 ఇది మరో దారుణం..: చాలా సందర్భాల్లో వ్యాట్ చెల్లించేప్పుడు వ్యాపారులు అధికారుల వాదనతో విభేదిస్తుంటారు. పెద్దమొత్తంలో పన్ను చెల్లించాల్సిన పరిస్థితుల్లో కొందరు వాణిజ్య పన్నుల ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వానికి తీర్పు వ్యతిరేకంగా వస్తే, తీర్పు వచ్చిన 180 రోజుల్లో ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేయాల్సి ఉంటుంది. గడువు దాటితే హైకోర్టు కేసును డిస్మిస్ చేస్తుంది. గత మూడునాలుగేళ్లలో 185 కేసులకు సంబంధించి ఇలా ప్రభుత్వం గడువు లోపు హైకోర్టును ఆశ్రయించటంలో విఫలమైంది. ఆలస్యంగా రావటంతో ఆ కేసులను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఫలితంగా ఆ కేసులకు సంబంధించి భారీ మొత్తంలో ఆదాయాన్ని వాణిజ్య పన్నుల శాఖ కోల్పోయింది. ఈ మొత్తం దాదాపు రూ.300 కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా. 
 
 ఇంత దారుణమా...: ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
 ఇటు ప్రభుత్వం లోనివారు.. అటు కాంట్రాక్టర్లు తలచుకుంటే గుట్టు చప్పుడు కాకుండా కుంభకోణాలు జరిగిపోతాయనటానికి  వాణిజ్య పన్నుల శాఖలో వెలుగు చూసిన అక్రమాలే నిదర్శనమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభిప్రాయపడింది. జలయజ్ఞం కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా రూ.500 కోట్ల పన్ను మొత్తాన్ని తిరిగి చెల్లించటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాణిజ్య పన్నుల ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ సకాలంలో హైకోర్టును ఆశ్రయించకుండా దాదాపు రూ.300 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోవడం దారుణమని పేర్కొంది. ఈ అంశాలకు సంబంధించి తాము సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా అధికారులు వివరాలు అందించటం లేదని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు రావు చెలికాని, కార్యదర్శి పద్మనాభరెడ్డిలు తెలిపారు. రూ.500 కోట్ల కుంభకోణంపై పూర్తయిన విజిలెన్స్ విచారణ వివరాలను కూడా బయటకు పొక్కనీయటం లేదని ఆరోపించారు. ట్రిబ్యునల్ తీర్పుపై సకాలంలో హైకోర్టును ఆశ్రయించని కారణంగా ఐటీసీ లిమిటెడ్ అన్న సంస్థ ఒక్కటే రూ.84.33 కోట్ల లబ్ధి పొందిందంటే మిగతా కేసుల్లో ఆ మొత్తం ఎంతుంటుందో ఊహించుకోవచ్చని అన్నారు.  
 
మరిన్ని వార్తలు