ఆ తీగలు..యమపాశాలు

29 Apr, 2019 10:06 IST|Sakshi

ఏటా 500 మంది మృతి

6 వేల మూగజీవాలు బలి

గ్రామాల్లోనే ఎక్కువ ప్రమాదాలు

చాలా ఏళ్ల క్రితం నాటి వ్యవస్థే కారణం

ఆధునికీకరణకు  రూ.1500 కోట్లు అవసరం

విద్యుత్‌ సంస్థల్లో 23 వేల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయని ప్రభుత్వం

సాక్షి, అమరావతి : విద్యుత్‌ ప్రమాదాలు రాష్ట్రంలో ఏటా కనీసం 500 మంది ఉసురుతీస్తున్నాయి. మరో వేయి మందిని గాయాలపాలు చేస్తున్నాయి. దాదాపు 6 వేల మూగజీవాల ప్రాణాలను హరిస్తున్నాయి. విద్యుత్‌ ప్రమాద ఘటనలన్నీ 90 శాతం గ్రామాల్లోనే నమోదవుతున్నాయి. తెగిపడే విద్యుత్‌ తీగలు, పంట పొలాలకు వేసే విద్యుత్‌ కంచెలు, స్టే వైర్లకు విద్యుత్‌ సరఫరా కావడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రాష్ట్రంలో చెయ్యి పైకెత్తితే విద్యుత్‌ వైర్లు తగిలే గ్రామాలు, శివార్లు, కాలనీలు ఇంకా 215 వరకూ ఉన్నాయని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఇప్పటికీ చిన్నగాలికే వంగిపోయే స్తంభాలు వేలల్లో ఉన్నాయి. తీర ప్రాంతంలో అయితే ఉప్పు నీటితో స్తంభాలకు తుప్పుపట్టి, అవి కూలిపోయి ఒక్కసారిగా జనం మీద పడే విద్యుత్‌ లైన్లూ ఉండటం గమనార్హం. ఇలాంటి ఘటనలతో జరిగిన ప్రాణనష్టాలపై ఒంగోలు న్యాయస్థానం తనకు తానుగా స్పందించింది. కేసును సుమోటోగా తీసుకుని సమాధానం ఇవ్వాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలకు సమన్లు జారీ చేసింది.

వినియోగదారులపై భారం తప్పదా?
ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం వేసిన లైన్లే ఇప్పటికీ గ్రామాల్లో ఉన్నాయి. అప్పట్లో విద్యుత్‌ వినియోగదారులు తక్కువ. ఎక్కువ శాతం పూరిళ్లే ఉండేవి. ఆ కాలంలో వేసిన విద్యుత్‌ స్తంభాలు అప్పటి అవసరాలకు తగ్గట్టుగానే ఉన్నాయి. నివాస ప్రాంతాల పక్క నుంచీ లైన్లు వేసినా ఎవరికీ ఇబ్బంది రాలేదు. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. 1990లో ఆంధ్రప్రదేశ్‌లో 500 ఫీడర్లు ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 2 వేలకు పెరిగింది. ఒక్కో ఫీడర్‌ పరిధిలో కనీసం 4 వేల విద్యుత్‌ కనెక్షన్లుంటాయి. 30 ఏళ్లనాటి ఊరు, వాడ పూర్తిగా మారిపోయింది. సిమెంట్‌ రోడ్లు, తారు రోడ్లు వచ్చాయి. దీంతో సహజంగానే రోడ్ల ఎత్తు పెరిగింది. పూరి గుడిసెల స్థానంలో డాబాలు వెలిశాయి. వీధి రోడ్డును మించి ఎత్తు ఉండేలా ఇంటి నిర్మాణం చేయడం సహజం. ఇన్ని మార్పులొచ్చినా అదే వీధిలో.. అదే ఇళ్ల మధ్య విద్యుత్‌ స్తంభాలను అలాగే ఉంచారు. రోడ్ల ఎత్తు పెరగడంతో స్తంభాలు బాగా కిందకు కనిపిస్తున్నాయి. ఇక తీగలు చేతి ఎత్తుల్లోనే ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలను ఎత్తు లేపాల్సిన అవసరం ఉందని అధికారులూ అంగీకరిస్తున్నారు. ఈ పనిచేయాలంటే సుమారు రూ.1500 కోట్లు కావాలని చెబుతున్నారు. డిస్కమ్‌లు, స్వతంత్ర సంస్థలు అప్పు తెస్తే తప్ప సమూల మార్పులు తేవడం సాధ్యం కాదు. ఇంత మొత్తాన్ని ప్రజలపైనే వేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే చార్జీల భారంతో అల్లాడుతున్న ప్రజలపై అదనపు భారం మోపడానికి డిస్కమ్‌లు సాహసించడం లేదు.

అన్నదాతల ఆయుష్షు తీస్తున్నా..
రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు పెరిగినా.. పాతకాలం నాటి విద్యుత్‌ లైన్లే ఉన్నాయి. దీంతో ట్రాన్స్‌ఫార్మర్‌ ఫ్యూజ్‌లు తరచూ పోతున్నాయి. వీటిని వేసేందుకు సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. వాస్తవానికి.. విద్యుత్‌ సంస్థల్లో 23 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిస్కమ్‌ల్లో కీలకమైన జూనియర్‌ లైన్‌మెన్, ఇతర క్షేత్ర స్థాయి సిబ్బంది పోస్టులు 15 వేల వరకూ ఉంటాయి. వీటిని భర్తీ చేయకపోవడంతో కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికీ నాలుగైదు గ్రామాలకు ఒకే లైన్‌మెన్‌ పనిచేస్తున్నాడు. ఫలితంగా సకాలంలో సేవలు అందించలేకపోతున్నాడు. దీంతో రైతులే ఫ్యూజులు వేసుకోవడం, ట్రాన్స్‌ఫార్మర్‌కు చిన్నచిన్న మరమ్మతులు చేసుకోవడం చేస్తున్నారు. ఇవి కొన్నిసార్లు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఎక్కడన్నా తీగ తెగిపోతే వెంటనే ఫ్యూజ్‌ పోవాలి. కానీ అలా జరగడం లేదు. ఫ్యూజులు రాలిపోనంత దట్టమైన వైర్లు వేస్తున్నారు. తీగలు తెగి నేలమీద పడితే విద్యుత్‌ సరఫరా అవుతోంది. తెగిపడిన విద్యుత్‌ తీగలు అన్నదాతల ప్రాణాలను హరిస్తున్నాయి. బోర్లు వేసేటప్పుడు కూడా సరైన పరిజ్ఞానం ఉండటం లేదు. విద్యుత్‌ వైర్ల సమీపంలో బోర్‌ వేసే యంత్రాలు వాడుతున్నారు. విద్యుత్‌ తీగలను పట్టించుకోకుండా పైకి లేపడం వల్ల ప్రమాదాలు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ పరిస్థితి చక్కదిద్దాలని వినియోగదారులు ఏటా విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ను వేడుకుంటున్నా ఫలితం శూన్యం.

మరిన్ని వార్తలు