ప్రశంసలు పొందుతోన్న దిశ యాప్‌

14 Feb, 2020 08:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ ఎస్‌వోఎస్‌ యాప్‌ వినియోగదారుల ప్రశంసలు పొందుతోంది. నాలుగు రోజుల్లోనే దిశ యాప్‌ను ఏకంగా 50 వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని దిశ స్పెషల్‌ ఆఫీసర్‌ దీపిక పాటిల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులు స్పందిస్తున్న తీరుకు మెచ్చి గూగుల్‌ ప్లేస్టోర్‌లో 5కి ఏకంగా 4.9 స్టార్‌ రేటింగ్‌ ఇచ్చారన్నారు. 9వ తేదీ నుంచి సగటున రోజుకు రెండు వేల మందికిపైగా దిశ యాప్‌ ద్వారా పోలీస్‌ కమాండ్‌ రూమ్‌కు టెస్ట్‌ కాల్స్‌ చేస్తున్నారని వివరించారు.

దిశ చట్టాన్ని తెచ్చిన 24 గంటల్లోనే మొదటి కేసులో పోలీసులు వాయు వేగంతో స్పందించిన విధానం, బాధితురాలికి పూర్తి స్థాయిలో భరోసా కల్పించిన తీరుతో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తున్నాయని పేర్కొన్నారు. కుటుంబ సమస్యల కారణంతో ఎక్కువ మంది దిశను ఆశ్రయిస్తున్నారని, అలాంటి వారికి నిపుణులైన, అనుభవము ఉన్నవారి చేత కౌన్సెలింగ్‌ నిర్వహించి వారు కలసి మెలసి ఉండేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

బుధవారం వచ్చిన ఫిర్యాదుల్లో ముఖ్యమైనవి..
భార్య, భర్తల మధ్య నెలకొన్న వివాదంలో భర్త విచక్షణ కోల్పోయి కొడుతుండడంతో బాధిత మహిళ తన చేతిలోని మొబైల్‌ ఫోన్‌ను షేక్‌ చేయడం ద్వారా దిశ కంట్రోల్‌ సెంటర్‌కు ఫిర్యాదు అందించింది. పోలీసులు నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకొని భర్త వేధింపుల నుంచి బాధితురాలిని రక్షించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో వరుసకు సోదరుడైన వ్యక్తి తనను వేధిస్తున్నాడంటూ ఒక మహిళ ఎస్‌వోఎస్‌ ద్వారా ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి తరచుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఓ బాలిక దిశ ఎస్‌వోఎస్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. తక్షణమే స్పందించిన పోలీసులు బాలిక వద్దకు చేరుకొని ధైర్యం చెప్పారు. వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. (చదవండి: ఇంటర్నెట్‌ అవసరం  లేకుండానే..)

మరిన్ని వార్తలు