ఏపీలో మరో 51 పాజిటివ్‌

7 Apr, 2020 02:30 IST|Sakshi

రాష్ట్రంలో మొత్తం 303కు పెరిగిన సంఖ్య

వీటిలో 280 కేసులకు ఢిల్లీతో లింకులు

కొత్తగా నెల్లూరులో 8, ‘పశ్చిమ’లో 6.. విశాఖలో 5, కడపలో 4 కేసులు నమోదు

ఢిల్లీ వెళ్లొచ్చిన వారందరికీ పరీక్షలు పూర్తి

ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా మరో 51 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 303కు చేరినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు ఆరుగురు పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయినట్లు వెల్లడించింది.

సాక్షి, అమరావతి :  రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 303కు చేరింది. ఆదివారం సా.6 గంటల నుంచి సోమవారం సా.6 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా మరో 51 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 303కు చేరినట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులెటెన్‌లో పేర్కొంది. ఇందులో ఒక్క కర్నూలు జిల్లాలోనే మరో 21 కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలు జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 74కు చేరింది. అంతకుముందు.. ఆదివారం ఒక్కరోజే కర్నూలు జిల్లాలో 49 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. రాష్ట్రం మొత్తం మీద నమోదైన కేసుల్లో 25 శాతం ఈ జిల్లాలోనివే కావడం గమనార్హం. దీంతో కర్నూలు జిల్లాలో హైఅలెర్ట్‌ ప్రకటించారు. ఇక సోమవారం నెల్లూరు జిల్లాలో 8 కేసులు, పశ్చిమ గోదావరిలో 6, విశాఖలో 5, కడపలో 4, అనంతపురంలో 3, గుంటూరులో 2, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.  

280 కేసులకు ఢిల్లీతోనే లింకులు 
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన 303 కేసుల్లో 23 కేసులు తప్ప మిగిలిన 280 కేసులు ఢిల్లీ వెళ్లివచ్చిన వారితో సంబంధాలున్నవేనని అధికారులు తెలిపారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారు, వారిని కలుసుకున్న వారందరికీ పరీక్షలు చేయడం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే వీటిలో అత్యధిక కేసుల పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయని, మరికొన్ని ఫలితాలు ఇంకా రావాల్సి ఉందన్నారు. దీంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుదల తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి ఆరుగురు పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం బులెటెన్‌లో పేర్కొంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు