రోడ్డెక్కితే 'రిస్కే'..

2 Sep, 2018 04:24 IST|Sakshi

     ప్రమాదాలతో రక్తసిక్తమవుతున్న రోడ్లు.. 

     52 శాతం ప్రమాదాలు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌తోనే...

     ఈ ఏడాది ఏడు నెలల్లో 11,969 ప్రమాదాలు.. 6,088 మంది మృతి

     1,335 ప్రమాదాలు.. 1,210 మృతులతో మొదటి స్థానంలో తూర్పుగోదావరి జిల్లా   

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోడ్డెక్కాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ప్రతి జిల్లాలోనూ రోడ్లు రక్తసిక్తమవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మొదటి ఏడు నెలలకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలపై నివేదికను రవాణా శాఖ విడుదల చేసింది. జనవరి నుంచి జూలై వరకు 11,969 రోడ్డు ప్రమాదాలు జరిగితే.. 6,088 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధిక ప్రమాదాలు కృష్ణా జిల్లాలో జరగ్గా.. మరణాల సంఖ్య మాత్రం తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయనే విషయం స్పష్టమవుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రహదారి భద్రత కోసం ఐదు విభాగాలు(పోలీస్, రవాణా, ఆర్‌అండ్‌బీ, వైద్య, విద్యా శాఖలు) కలిసి పనిచేస్తున్నాయని చెబుతున్నా.. ప్రమాదాల సంఖ్య మాత్రం ఏటా పెరిగిపోతోంది.
 
అటకెక్కిన రహదారి భద్రత సమావేశాలు.. 
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం, ఆ తర్వాత వదిలేయడం రాష్ట్రంలోని రవాణా, పోలీస్‌ అధికారులకు పరిపాటిగా మారింది. ఏపీలో అమలవుతున్న రహదారి భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ పలుమార్లు అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది. డ్రైవర్ల అనుభవలేమి, ఓవర్‌ లోడింగ్, ఇంజినీరింగ్‌ లోపాలు, అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, బ్లాక్‌స్పాట్స్, ప్రమాదకరమైన మలుపులు, సైన్‌ బోరŠుడ్స లేకపోవడం, ప్రమాదాలు జరిగినప్పుడు అందుబాటులో లేని ట్రామాకేర్‌ సెంటర్లు తదితరాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రహదారి భద్రత కౌన్సిల్‌ చైర్మన్‌గా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల ఆధ్వర్యంలో రహదారి భద్రతపై సమావేశాలు జరగాలి. అయితే జిల్లాల్లో ఎవరూ ఈ సమావేశాల్ని పట్టించుకోవడం లేదు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా ప్రభుత్వ తీరు మారలేదు. రాష్ట్రంలో మొత్తం 1,100 బ్లాక్‌స్పాట్స్‌ ఉన్నాయని గుర్తించడమే తప్ప.. వాటిని సరిచేసిన దాఖలాలే లేవు. మలుపులు లేని రహదారులను సరిచేయడం, డ్రైవర్లకు విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు తదితర అంశాలను పట్టించుకోలేదు. 

డ్రంకన్‌ డ్రైవ్‌.. బైక్‌లతోనే అధిక ప్రమాదాలు
డ్రంకన్‌ డ్రైవ్, బైక్‌ల వల్లే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణా శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 52 శాతం ప్రమాదాలు డ్రంకన్‌ డ్రైవ్‌ వల్ల జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే రవాణా శాఖ రూ.10 కోట్లతో స్పీడ్‌ గన్లు, బ్రీత్‌ ఎనలైజర్లు తదితర రహదారి భద్రత పరికరాలు కొనుగోలు చేసింది. టోల్‌ప్లాజాల్లో బ్రీత్‌ ఎనలైజర్లతో పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు కమిటీ స్పష్టంగా పేర్కొన్నా.. రాష్ట్రంలో ఎక్కడా అమలు చేస్తున్న దాఖలాలు లేవు.  

మరిన్ని వార్తలు