దొంగ ఓట్ల కార్ఖానా

15 Nov, 2018 04:09 IST|Sakshi

రాష్ట్రంలో నమోదైన నకిలీ ఓట్లు 52,67,636

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే బాగోతం 

ఎన్నికల సంఘం తాజాగా ప్రచురించిన ఓటర్ల జాబితాలో ఎన్నెన్నో వింతలు

‘ఓటర్‌ అనలిస్టు అండ్‌ స్ట్రాటజీ టీమ్‌’ అధ్యయనంలో నివ్వెరపోయే నిజాలు బహిర్గతం

ఒకే ఓటర్‌కు వేర్వేరు చోట్ల ఓటర్‌ ఐడీ కార్డులు 

ఏడాది కూడా నిండని పసిబిడ్డలకూ ఓటు హక్కు  

రాష్ట్రంలో ఒక ఓటరు వయసు 352 ఏళ్లు 

ఇంటి నెంబర్లు లేకుండానే ఓటర్లుగా నమోదు 

పేరులోని పదాలను మార్చేసి 2,60,634 ఓట్లు

తెలంగాణతోపాటు ఏపీలోనూ ఓటర్లుగా కొనసాగుతున్న వారు 18.50 లక్షలు

సాక్షి, అమరావతి: ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ దొంగ ఓట్ల కార్ఖానాగా మారింది. దేశంలో ఎక్కడా లేనంత విచ్చలవిడిగా రాష్ట్రంలో నకిలీ ఓట్లు నమోదవుతున్నాయి. ఏపీలో ఏకంగా 52.67 లక్షల మేర నకిలీ ఓట్లు నమోదైనట్లు ‘ఓటర్‌ అనలిస్టు అండ్‌ స్ట్రాటజీ టీమ్‌’ (వాస్ట్‌) స్పష్టం చేసింది. కేవలం ఒకటి, రెండు శాతం ఓట్ల వ్యత్యాసం ఎన్నికల్లో పార్టీల తలరాతలను మార్చేస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు కావడం పట్ల రాజకీయ పరిశీలకులతోపాటు సామాన్య ప్రజల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. నకిలీ ఓటర్ల నమోదు వ్యవహారం యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటే దీని వెనుక ఒత్తిళ్లు, ప్రలోభాలు ఉన్నాయనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

ఓటర్‌ జాబితాలో నివ్వెరపరిచే వాస్తవాలు
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ దొంగ ఓట్లు నమోదయ్యాయి. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ‘వాస్ట్‌’ అనే సంస్థ దీనిపై లోతైన అధ్యయనం నిర్వహించింది. పలువురు ఐటీ నిపుణులు, డేటా అనలిస్టులు వివిధ రంగాల ప్రముఖులతో కూడిన ‘వాస్ట్‌’ గత ఏడాదిన్నరగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఓటర్లు నమోదు తీరుపై అధ్యయనం చేపట్టింది. క్షేత్రస్థాయిలో పక్కా ఆధారాలను సేకరించింది. ఓట్ల నమోదు విషయంలో లెక్కలేనన్ని అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. పలు అంశాలతో సమగ్ర నివేదిక రూపొందించింది. జీవించి ఉన్నవారి పేరుతో నాలుగైదు ఓట్లు నమోదు కావడం ఒక ఎత్తయితే ఏడాది కూడా నిండని పసిబిడ్డల పేరుతో, చనిపోయిన వారి పేర్లతోనూ ఓటరు కార్డులుండడం గమనార్హం. కొందరు ఓటర్ల వయసును ఏకంగా 352 ఏళ్లుగా చూపించడం వింతల్లోకెల్లా వింత. ఎన్నికల సంఘం(ఈసీ) రూపొందించిన ఓటరు జాబితాను పరిశీలిస్తే ఇలాంటి నివ్వెరపోయే వాస్తవాలు కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 1వ తేదీన ఎన్నికల సంఘం ప్రచురించిన ఓటర్ల జాబితాలోని వివరాల ఆధారంగా ఈ నకిలీ ఓట్లను ‘వాస్ట్‌’ గుర్తించి, తన నివేదిక ద్వారా బహిర్గతం చేసింది.

దొంగ ఓట్లకు దారులెన్నో...
రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని 45,920 పోలింగ్‌బూత్‌ల పరిధిలో 3.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఇందులో 52.67 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు ‘వాస్ట్‌’ తేల్చింది. అంటే మొత్తం ఓట్లలో దాదాపు 15 శాతం నకిలీ ఓట్లేనని తేటతెల్లమవుతోంది. ఏకంగా అర కోటికిపైగా దొంగ ఓట్లు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో నకిలీ, రిపీట్, అక్రమ, చెల్లని, ఒకే విధమైన సమాచారం ఉన్న ఓట్లు 34.17 లక్షలున్నాయి. ఇవికాకుండా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓటర్లుగా కొనసాగుతున్న వారి సంఖ్య 18.50 లక్షలుగా ఉంది. ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు 18 ఏళ్లు నిండి ఉండాలన్నది నిబంధన. కానీ ఏడాది వయసున్న చంటిబిడ్డలు కూడా ఓటర్లుగా నమోదైన ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఇంటి నెంబరు, చిరునామా లేకుండా లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితాలో దర్శనమిస్తున్నాయి. 

ఒకే ఐడీ నెంబర్‌తో రెండుచోట్ల ఓటు 
సాక్షాత్తూ ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటరు జాబితాలోనే నకిలీ ఓటర్ల బాగోతం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో దొంగ ఓట్లను పలు రకాలుగా నమోదు చేయించినట్లు ‘వాస్ట్‌’ గుర్తించింది. వీటిని 10 కేటగిరీలుగా విభజించింది. ఒకటో కేటగిరీలోని నకిలీ ఓట్లను పరిశీలిస్తే.. ఉదాహరణకు అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో 46వ పోలింగ్‌ బూత్‌లోని 362 సీరియల్‌ నెంబర్‌లో... ‘డి.అనిల్‌కుమార్‌ (ఐడీ నెం.వైడబ్ల్యూబీ0957993) తండ్రి డి.నందప్ప, ఇంటినెంబర్‌ 1–4–135, వయసు 36, సెక్స్‌ మేల్‌’ అనే ఓటరు పేరు నమోదై ఉంది. అయితే, ఇదే ఐడీ నెంబర్‌తో అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో 64వ పోలింగ్‌బూత్‌లో ‘అనిల్‌కుమార్‌ దొడ్డపనేని, తండ్రి నందప్ప దొడ్డపనేని, ఇంటి నెంబర్‌ 14/166–2డి’గా కూడా ఓటరు కార్డు ఉంది. 

వేర్వేరు ఐడీ నెంబర్లతో రెండు ఓట్లు 
రెండో కేటగిరీలోని నకిలీ ఓట్లను పరిశీలిస్తే... తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 20లోని 815 సీరియల్‌ నెంబర్‌లో ఐడీ నెంబర్‌ ‘డబ్ల్యూయూజెడ్‌1410737’ తో ‘శ్రీను యండపల్లి, తండ్రి సత్యనారాయణ యండపల్లి, ఇంటినెం.2–96, వయసు 36, సెక్స్‌ పురుష’ అనే వివరాలతో ఓటరు నమోదై ఉన్నారు. ఇవే వివరాలతో ఈ నియోజకవర్గంలోని 21వ పోలింగ్‌బూత్‌లో సీరియల్‌ నెంబర్‌ 513లో ఐడీ నెంబర్‌ ‘డబ్ల్యూయూజెడ్‌1412337’ నెంబర్‌తో ఓటు నమోదై ఉంది. 

ఒకే వ్యక్తికి వేర్వేరు వయసులా? 
మూడో కేటగిరీ నకిలీ ఓట్లను పరిశీలిస్తే.. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో 75వ నెంబర్‌ పోలింగ్‌ బూత్, సీరియల్‌ నెంబర్‌ 413లో ఐడీ నెంబర్‌ ‘ఐడీఎస్‌1243500’తో ‘కృష్ణారావు ఊబలంక, తండ్రి వీర్రాజు ఊబలంక, ఇంటి నెం.4–4–25, వయసు 54, సెక్స్‌ పురుష’ అనే ఓటరు ఉన్నారు. అయితే 54 ఏళ్ల వయసును మార్పు చేసి 53 ఏళ్లుగా పేర్కొంటూ ఇదే వ్యక్తి పేరుతో మండపేట నియోజకవర్గంలోని 27వ నెంబరు పోలింగ్‌ బూత్‌లో సీరియల్‌ నెంబర్‌ 9లో కూడా ఓటు నమోదైంది.  

పురుషుడిని మహిళలను చేశారు 
నాలుగో కేటగిరీకి సంబంధించి ‘వాస్ట్‌’ చూపిన ఉదాహరణల్లో తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో 138వ నెంబర్‌ పోలింగ్‌బూత్, 133వ సీరియల్‌ నెంబర్‌లో ‘దుర్గా ప్రసాద్‌ ఇరుసుమల్ల, తండ్రి సత్తిబాబు ఇరుసుమల్ల, ఇంటినెంబర్‌ 4–89, వయసు 28. సెక్స్‌ మహిళ’ అనే వివరాలతో ఐడీ నెంబర్‌ ‘ఆర్‌హెచ్‌ఏ0983123’తో ఓటరు కార్డు ఉంది. విచిత్రం ఏమిటంటే ఇదే నియోజకవర్గంలోని 139వ పోలింగ్‌ బూత్‌లో 565 సీరియల్‌ నెంబర్‌లో ఇవే పేర్లు, సమాచారంతో సెక్స్‌ అనే దగ్గర మహిళకు బదులు పురుషుడిగా పేర్కొంటూ మరో ఓటు నమోదై ఉంది. 

వివరాలే అవే.. ఓట్లే వేర్వేరు 
ఐదో కేటగిరీ నకిలీ ఓట్లకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తే... కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో 10 నెంబర్‌ పోలింగ్‌బూత్‌లోని 267 సీరియల్‌ నెంబర్‌లోని ఐడీ నెంబర్‌  ‘ఎక్స్‌ఎక్స్‌సీ0461293’తో ‘శివకుమారి వేమూరి, భర్త శ్రీహర్షవర్థన్‌ వేమూరి, ఇంటి నెం.1–110, వయసు 30, సెక్స్‌ మహిళ’ అనే సమాచారంతో ఓటు నమోదై ఉంది. ఇదే నియోజకవర్గంలోని 11వ నెంబర్‌ పోలింగ్‌బూత్‌లోని 624వ సీరియల్‌ నెంబర్‌లో ఇదే సమాచారంతో ‘ఎక్స్‌ఎక్స్‌సీఓ192641’ ఐడీ నెంబర్‌తో మరో ఓటును నమోదు చేశారు. 

పేరులోని పదాలను అటుఇటుగా మార్చేశారు 
ఆరో కేటగిరీలో ఓటరు పేరులోని పదాలను ముందు వెనుకకు మార్చేసి 2,60,634 ఓట్లు నమోదు చేసినట్లు ‘వాస్ట్‌’ గుర్తించింది. ఉదాహరణకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం 253వ పోలింగ్‌బూత్‌లోని 553 సీరియల్‌ నెంబర్‌లో ‘కోటేశ్వరమ్మ అవుల, భర్త ఎంకటేశ్వర్లు, ఇంటి నెం.2–31, వయసు 45, సెక్స్‌ మహిళ’ అనే వివరాలతో ఓటరు ఐడీ నెంబర్‌ ‘ఎఫ్‌ఎల్‌ఆర్‌2587012’తో ఓటు నమోదై ఉంది. ఇదే నియోజకవర్గం 55వ పోలింగ్‌బూత్, 545 సీరియల్‌ నెంబర్‌లో ఓటరు పేరులోని పదాలను ముందు వెనుకకు మార్చి ‘ఆవుల కోటేశ్వరమ్మ’గా మార్చి, వయసును 43 ఏళ్లుగా పేర్కొంటూ ఓటర్‌ ఐడీ నెంబర్‌ ‘కేబీబీ0940270’తో మరో ఓటును నమోదు చేయించారు. 

ఒకే వ్యక్తికి వేర్వేరు ఐడీలతో ఓట్లు
ఏడో కేటగిరీలో ఒక్కొక్కరి పేరిట రెండేసి ఓట్లు నమోదయ్యాయి. ఓటర్ల పేర్లు, తండ్రి/భర్త పేర్లలో ఎలాంటి మార్పులు లేవు. ఎక్కువగా అధికారపార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్ననియోజకవర్గాల్లో ఇలాంటి ఓట్లు 25,17,164 ఉన్నాయి. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఒకటో నెంబర్‌ పోలింగ్‌బూత్‌లోని సీరియల్‌ నెంబర్‌14లో ‘రామ ముద్గల, భర్త వెంకట్‌రావు ముద్గల, ఇంటి నెం.007. తిలక్‌ అపార్టుమెంట్స్, వయసు 44, సెక్స్‌ మహిళ’ అనే సమాచారంతో ‘జెడ్‌జెఓ1516988’ ఐడీ నెంబర్‌తో ఓటు నమోదై ఉంది. ఇదే నియోజకవర్గంలోని 61వ నెంబర్‌ పోలింగ్‌బూత్‌లోని 442 సీరియల్‌లో ఇవే పేర్లతో, ఇంటినెంబర్‌ 31–8–5/1గా పేర్కొంటూ ‘జెడ్‌జేఓ1512334’ మరో ఓటు నమోదైంది.  

ఆ ఓటరు వయసు 352 ఏళ్లట!
ఎనిమిదో కేటగిరీలోని అక్రమాలను పరిశీలిస్తే ఓటరు వయసును తప్పుగా పేర్కొంటూ ఓటు నమోదు చేశారు. నెల్లూరు నగరంలోని 76వ పోలింగ్‌బూత్, 473 సీరియల్‌ నెంబర్‌లో ‘సాయికుమార్‌ పేరూరి, తండ్రి ఐజాక్‌ న్యూటన్‌ పేరూరి, ఇంటి నెం.20–2–881, వయసు 1, సెక్స్‌ పురుష’ వివరాలతో ఐడీ కార్డు ‘జెడ్‌ఏఎఫ్‌1714971’తో ఓటు నమోదు చేశారు. ఇక్కడ ఓటరు వయసు ఏడాది మాత్రమే ఉండడం విశేషం. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో 208 పోలింగ్‌బూత్‌లోని 153వ సీరియల్‌ నెంబర్‌లో ‘దివ్య తాటిపాక, భర్త రవికుమార్‌ తాటిపాక, ఇంటి నెం.1–206, వయసు 5, సెక్స్‌ మహిళ’ సమాచారంతో ఐడీ నెంబర్‌ ‘యూడీఐ1123595’తో ఓటు నమోదై ఉంది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని 85వ పోలింగ్‌బూత్‌లోని 342 సీరియల్‌ నెంబర్‌లో ‘నర్సింగ్‌రావు ఎర్రంశెట్టి, తండ్రి అప్పన్న ఎర్రంశెట్టి, ఇంటి నెం.1–69/2, వయసు 352, సెక్స్‌ పురుష’ అనే వివరాలతో ‘ఎఫ్‌జెఎక్స్‌0992941’ ఐడీ నెంబర్‌తో ఒక ఓటు నమోదైంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం 107 పోలింగ్‌బూత్‌లోని 386 సీరియల్‌ నెంబర్‌లోని ఓటర్‌ వయసును ఏకంగా 248 ఏళ్లు. ‘సుదర్శన పుల్లగుర్ర, భర్త శ్యామ్, ఇంటి నెం.8–110, వయసు 248, సెక్స్‌ మహిళ’ అనే వివరాలతో ఐడీ కార్డు‘ఎస్‌జీఈ0247270’తో ఓటు నమోదైంది. 

ఇంటి నెంబర్ల మార్పుతో ఒక్కరికే వేర్వేరు ఓట్లు 
తొమ్మిదో కేటగిరీలో ఇంటి నెంబర్‌ లేకుండానే 3,95,877 ఓట్లు నమోదు చేశారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం 81వ పోలింగ్‌బూత్‌లోని ఒకటో సీరియల్‌ నెంబర్‌లో ‘టీక్యూక్యూ0809160’ ఐడీ నెంబర్‌తో గంగా భవానీ, భర్త భూలోక మధుమతి అనే పేరుతో ఇంటినెంబర్‌ లేకుండానే ఓటు నమోదు చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ‘ఎస్‌ఏఏ0761990’ ఐడీ నెంబర్‌తో నమోదైన ఓటరు సమాచారంలో ఇంటి నెంబరును ‘నన్‌’గా పెట్టి వదిలేశారు. విశాఖపట్నం వెస్ట్‌ నియోజకవర్గంలోని ‘ఎక్స్‌బీఓ1319673’ నెంబర్‌ ఓటరు సమాచారంలో ఇంటి నెంబర్‌ను సేమ్‌ అని పేర్కొన్నారు. ఇక ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో ‘ఐయూడబ్ల్యూ0647810’ నెంబర్‌తో నమోదైన ఓటరు సమాచారంలో ఇంటి నెంబర్‌ను ఓల్డ్‌ అని పేర్కొన్నారు.  

రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు
పదో కేటగిరీలో.. చాలామంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు చోట్లా ఓటర్లుగా నమోదయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని 6వ నెంబర్‌ పోలింగ్‌బూత్‌లోని 164వ సీరియల్‌ నెంబర్‌లో ‘ఎస్‌జీఏ0592551’ ఐడీ నెంబర్‌తో మౌనిక తమ్మన తల్లి ఎన్‌వీఎస్‌కే పద్మజ అనే మహిళ పేరుతో ఓటు నమోదై ఉంది. ఇదే పేరుతో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని 112వ పోలింగ్‌బూత్‌లోని 407 సీరియల్‌ నెంబర్‌లో ‘ఎస్‌జీఏ0592551’ ఐడీ నెంబర్‌తో మరో ఓటు ఉంది. తుని నియోజకవర్గంలో పోలింగ్‌బూత్‌ నెంబర్‌ 152, సీరియల్‌ నెంబర్‌ 26లో ‘యూడీఐ1300144’ ఐడీనెంబర్‌తో నాగభూషణరావు దిడ్డి, తండ్రి లక్ష్మీనరసింగరావు పేరుతో ఒక ఓటు ఉండగా, ఇదే పేరుతో తెలంగాణలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 564 పోలింగ్‌బూత్, 217 సీరియల్‌ నెంబర్‌లో ‘ఎస్‌డబ్ల్యూడీ0424507’ ఐడీ నెంబర్‌తో మరో ఓటు ఉంది. 

మరిన్ని వార్తలు