నకిలీ విత్తనం గుట్టు రట్టు

24 Aug, 2014 03:56 IST|Sakshi
నకిలీ విత్తనం గుట్టు రట్టు

- 53 క్వింటాళ్ల చిరుధాన్యాల విత్తనం సీజ్
- డ్వామా అధికారి, ప్రైవేట్ డీలర్ కుమ్మక్కు?
- రైతులకు నకిలీ విత్తనం అంటగట్టి సొమ్ము చేసుకుంటున్న వైనం
- రూ.25 లక్షల కుంభకోణం

అనంతపురం అగ్రికల్చర్/ క్రైం : నకిలీ విత్తనం గుట్టురట్టయింది. విత్తన ధ్రువీకరణ పత్రాలు లేకుండా పెద్ద ఎత్తున రైతులకు నాసిరకం విత్తనం అంటగడుతున్న వైనం వెలుగులోకొచ్చింది. త్రీటౌన్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి 53 క్వింటాళ్ల విత్తనం సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో డ్వామా అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ముందస్తు సమాచారం మేరకు అనంతపురంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న రాజహంస ప్యారడైజ్ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఉన్న ఓ గదిపై శనివారం ఉదయం 11 గంటలకు అధికారులు దాడులు చేశారు.

ఈ సందర్భంగా గదిలో కొందరు కూలీలు జొన్న, సజ్జ, మొక్క జొన్న తదితర చిరుధాన్యాలను ప్యాకెట్లలో నింపుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాదాపు 53 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. ఇందులో 2.47 క్వింటాళ్ల సజ్జకు మాత్రమే ధ్రువీకరణ సర్టిఫికెట్ ఉంది. సాయిరాం ఫర్టిలైజర్స్ యజమాని, డీలర్ శ్రీధర్‌రెడ్డి ఈ నకిలీ విత్తనాల సూత్రధారిగా గుర్తించారు. ధ్రువీకరణ సంస్థ ద్వారా సర్టిఫై లేని విత్తనాన్ని అనధికారికంగా నిల్వ చేసిన శ్రీధర్‌రెడ్డిపై
 కేసు నమోదు చేసినట్లు స్థానిక వ్యవసాయాధికారి అల్తాఫ్‌ఖాన్ తెలిపారు.
 
కాంట్రాక్టర్‌కు సహకరించిన డ్వామా అధికారి
జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఆధ్వర్యంలో వాటర్‌షెడ్ కార్యక్రమం అమలవుతున్న 386 ఆవాస ప్రాంతాల్లోని సన్న, చిన్నకారు రైతులకు చిరుధాన్యాల విత్తనాలను అందించే కాంట్రాక్టును సాయిరాం ఫర్టిలైజర్స్ యజమాని శ్రీధర్‌రెడ్డి కుదుర్చుకున్నారు.  ‘డ్వామా’తో ఒప్పందం మేరకు ఆ వ్యాపారి ఒక ఎకరాకు సరిపోయే చిరుధాన్యాల ధ్రువీకరణ విత్తనాలను (జొన్న, మొక్క జొన్న, సజ్జ, కొర్ర) రకానికి అర కిలో చొప్పున ఒక సంచిలో ప్యాక్‌చేసి సరఫరా చేయాలి. ఇందుకు గాను ఒక్కో మినీ కిట్‌కు ‘డ్వామా’ ఆ వ్యాపారికి రూ.350 చెల్లిస్తుంది. అయితే ఈ కాంట్రాకు పొందిన వ్యాపారి ‘సర్టిఫైడ్ సీడ్’కు బదులు మండీ బజారులో ధాన్యాన్ని కొనుక్కొచ్చి, ఆ ధాన్యాన్నే మినీ కిట్లలో నింపి ‘డ్వామా’కు అందజేస్తున్నాడు.

విత్తనాల పంపిణీ పర్యవేక్షణ బాధ్యతను ‘డ్వామా’ ఏపీడీ (వాటర్‌షెడ్ విభాగం) నాగభూషణం చూస్తున్నారు. ఇప్పటికే ఈ అధికారి ఆధ్వర్యంలో మడకశిర, కళ్యాణదుర్గం, కదిరి ప్రాంతాల్లో ఈ నకిలీ విత్తనాలను కాంట్రాక్టరు రైతులకు సరఫరా చేశాడు. సరఫరా చేసిన విత్తనాలు సర్టిఫైడ్ సీడ్ కాదన్న విషయం స్పష్టంగా తెలిసినా ఈ విభాగాన్ని పర్యవేక్షించే ‘డ్వామా’ అధికారి ఏమాత్రం అభ్యంతరం పెట్టకుండా కాంట్రాక్టరుకు సహకరించారని తెలుస్తోంది. ‘డ్వామా’ అధికారి వెన్నుదన్నుతోనే కాంట్రాక్టరు యథేచ్ఛగా మండీల్లో ధాన్యాన్ని విత్తనంగా సొమ్ము చేసుకుంటున్నాడని.. ఈ వ్యవహారంలో అధికారులు, కాంట్రాక్టరు అక్రమార్జనను చెరి సగం పంచుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
కుంభకోణం విలువ రూ.25 లక్షలు
ఒక్కో మినీ కిట్‌కు ప్రభుత్వం కాంట్రాక్టరుకు రూ.350 చెల్లిస్తుండగా జిల్లాలో 10 వేల మినీ కిట్ల సరఫరాకు కాంట్రాక్టు కుదిరింది. సర్టిఫైడ్ సీడ్ కాకుండా మండీల్లో దొరికే ధాన్యాన్ని మిని కిట్లలో నింపుతున్నారు. ఇందుకు గాను అన్ని ఖర్చులు కలుపుకున్నా ఒక్కో మినీ కిట్‌కు రూ.100 కన్నా ఎక్కువ ఖర్చు కాదని వ్యవసాయ శాఖ అధికారులే చెబుతున్నారు. ఈ లెక్కన ఒక్కో మినీకిట్‌పై రూ.250 చొప్పున 10 వేల మినీ కిట్లపై కాంట్రాక్టరు, అధికారులు నొక్కేస్తున్న సొమ్ము రూ.25 లక్షలు ఉంటుందని అంచనా.
 
అవి మంచి విత్తనాలే
నకిలీ విత్తన ప్యాకింగ్ కేంద్రంపై దాడి చేసిన పోలీసులు, వ్యవసాయ అధికారులు సంబంధిత ‘డ్వామా’ ఏపీడీని సంఘటనా స్థలానికి పిలిపించారు. ఆ సందర్భంగా ఈ విత్తనాలు మంచివే అని, కాంట్రాక్టరు నేషనల్ సీడ్ కార్పొరేషన్ అధీకృత డీలర్ కాబట్టే అతనికి కాంట్రాక్టు ఇచ్చామని మీడియా ఎదుటే వ్యవసాయ శాఖ అధికారుతో ‘డ్వామా’ ఏపీడీ వాదించారు. డ్వామా ఏపీడీ వాదనను వ్యవసాయ శాఖ జేడీ నిర్ద్వందంగా తోసిపుచ్చారు.

మరిన్ని వార్తలు