కడపలో బాంబుల భయం.!

25 Jul, 2019 10:33 IST|Sakshi

సాక్షి, జమ్మలమడుగు(కడప) : జమ్మలమడుగుకు బాంబుల మడుగు ఉన్న అపవాదు తొలగిపోయి దశాబ్దాల కాలమైంది.  ఈ మధ్య కాలంలో అక్కడక్కడా హత్యలు జరిగినప్పటికి బాంబులను వినియోగించిన సంఘటనలు లేవు. ఇక బాంబుల సంస్కృతి పూర్తిగా చరిత్రలో కలిసిపోయిందనుకుంటున్న తరుణంలో జమ్మలమడుగు ప్రాంతంలో మళ్లీ బాంబుల బకెట్లు బయటపడటం సామాన్య ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. జమ్మలమడుగు పట్టణ శివారు ప్రాంతంలో రెండు రోజుల క్రితం నాలుగు బకెట్లలో 54 నాటు బాంబులు బయటపడేసరికి స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

20 ఏళ్ల క్రితం..
1999వ సంవత్సరానికి ముందు జమ్మలమడుగు ప్రాంతంలో నాటుబాంబులు దొరకడం పెద్ద వింతేమీ కాదు. అప్పట్లో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఫ్యాక్షన్‌ ఉండటంతో ఇరువర్గాల వద్ద నాటుబాంబులు విరివిగా లభించేవి. వీటి తయారీ కూడా జమ్మలమడుగు ప్రాంతంలోనే జరిగేది. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సైతం బాంబులను సరఫరా చేసేవారు. బకెట్‌లలో, లెదర్‌ బ్యాగులలో బాంబులను తీసుకెళ్లేవారు.

కాని 1999లో జమ్మలమడుగు సబ్‌ డివిజన్‌కు అడిషనల్‌ ఎస్పీగా వచ్చిన శంకరబాత్రా బాగ్చీ అప్పటి జిల్లా ఎస్పీ గోవింద్‌సింగ్‌ల ప్రత్యేక కృషి వల్ల నియోజకవర్గంలో స్వచ్ఛంద బాంబుల అప్పగింత కార్యక్రమం జరిగింది. ఫ్యాక్షనిస్టుల వద్ద నుంచి వేల సంఖ్యలో బాంబులను స్వాధీనం చేసుకుని అప్పట్లో పోలీసులు రికార్డు సృష్టించారు. ఆ తర్వాత బాంబుల వాడకం క్రమేపీ తగ్గుతూ వచ్చింది.

ఇక వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ స్థాయి నేతలు సైతం అభివృద్ధి, ఆదాయాలపై దృష్టి సారించడంతో గ్రామాల్లో ఫ్యాక్షనిజం దాదాపు కనుమరుగైపోయింది. గత పది సంవత్సరాలుగా జమ్మలమడుగు ప్రాంతంలో నాటుబాంబుల మాటే వినబడలేదు. ఇప్పుడు తాజాగా బయటపడుతున్న నాటుబాంబులు జమ్మలమడుగు ప్రాంతంలో కలకలం సృష్టిస్తున్నాయి.

మొన్న రామచంద్రాయపల్లె..నిన్న జమ్మలమడుగు...
ఇటీవల రెండు వారాల క్రితం మైలవరం మండలం రామచంద్రాయపల్లె గ్రామంలో రెండు దశాబ్దాల క్రితం దాచిపెట్టిన బాంబుల బకెట్‌ బయట పడింది. పొక్లెయిన్‌తో పొలం గట్లను చదును చేస్తున్న సమయంలో కనిపించిన బాంబుల బకెట్‌ను పరిశీలిస్తున్న సమయంలో అందులోని బాంబులు పగిలి పొలం యజమాని కుమారుడు  గాయపడ్డాడు. ఆ సంఘటన మరువక ముందే మంగళవారం జమ్మలమడుగు పట్టణ శివార్లలో , ముద్దనూరు రహదారిలో భూములను కొనుగోలు చేసి వాటిని ఫ్లాట్‌లుగా మార్చుతున్న క్రమంలో భూమి లోపల నాలుగు బాంబుల బకెట్‌లు  బయటపడటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 8వతేదీ జమ్మలమడుగుకు వచ్చిన సందర్భంగా ముద్దనూరు రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు కేవలం మూడు వందల మీటర్ల దూరంలోనే ఈ నాటు బాంబులు దొరకడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.   ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నప్పుడు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలి.   అలాంటిది హెలిప్యాడ్‌కు సమీపంలోనే ఉన్న పొలంలోనే నాటుబాంబులు బయటపడటం నిఘా వైఫల్యానికి పరాకాష్టగా నిలిచింది.

ముఖ్యమంత్రి పర్యటనకు ప్రస్తుతం దొరికిన నాటుబాంబులకు ఎలాంటి సంబంధం లేకపోవచ్చు గాని శిక్షణ పొందిన బాంబ్‌స్క్వాడ్‌ సభ్యులు సీఎం పర్యటన సందర్భంలో వీటిని ఎందుకు పసిగట్టలేకపోయారనేది  అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ముఖ్యమంత్రి సభకు విచ్చేసిన ప్రజల్లో కొందరు మలమూత్ర విసర్జన నిమిత్తం ఆ పరిసరాలలో సంచరిస్తున్నప్పుడు పొరపాటున జరగరానిది ఏదైనా జరిగి ఉంటే బాధ్యులు ఎవరన్న ప్రశ్నకు నిఘా విభాగమే జవాబు చెప్పాలి. 

మరిన్ని వార్తలు