శిశువులు తక్కువ..తల్లులు ఎక్కువ!

15 May, 2019 04:39 IST|Sakshi

రాష్ట్ర ఆరోగ్య శాఖలో పొంతనలేని లెక్కలు

గడిచిన ఐదేళ్లలో తగ్గుతున్న బర్త్‌ రేటు 

కానీ, గర్భిణీల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగినట్టు లెక్కలు 

చాలా జిల్లాల్లో డబుల్‌ ఎంట్రీ

ఒక జిల్లాలో పుట్టిన పిల్లలు 54వేలు.. గర్భిణీల సంఖ్య 82వేలు 

అడ్డగోలుగా టార్గెట్లు విధిస్తుండడమే కారణం 

కేంద్ర నిధుల కోసం ఇలా చేసి చూపిస్తున్నారని విమర్శలు 

రాష్ట్ర ఆరోగ్య శాఖ లెక్కల తీరుపై కేంద్రం విస్మయం

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని శాఖల గణాంకాలను ఈ ఐదేళ్లల్లో కాకిలెక్కలతో రూపొందిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం గర్భిణుల విషయంలోనూ తప్పుడు సంఖ్యలు.. పొంతనలేని వివరాలతో జాబితాలు రూపొందించి కేంద్రం దృష్టిలో అభాసుపాలవుతోంది. గర్భిణుల సంఖ్య, పుట్టే పిల్లల సంఖ్య ఎక్కడా సరిపోలడంలేదు. రాష్ట్రంలో గర్భిణులను గుర్తించి వారికి వైద్య సేవలు అందించే క్రమంలో ఈ తప్పులతడకలు భారీగా చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు బర్త్‌ రేటు (పుట్టే చిన్నారుల శాతం) తగ్గుతూంటే మరోవైపు గర్భిణుల శాతం మాత్రం అమాంతంగా పెరిగిపోతోంది.  

మన రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందికి 16.4 శాతం చిన్నారులు పుడుతున్నారు. కానీ, గర్భిణులను మాత్రం 19 శాతానికి పైగానే అని ఆరోగ్య శాఖాధికారులు చూపిస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలని ఇలా చేస్తున్నారా లేదా ఎక్కువ మందికి వైద్యం అందిస్తున్నామని చెప్పడానికి ఇలా చేస్తున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో మాతా శిశు మరణాల విషయంలో ఇలాగే తప్పుడు లెక్కలు చూపించి దక్షిణాదిలో అద్భుతంగా నివారణ చర్యలు చేపడుతున్నట్టు పలుమార్లు జరిగిన కలెక్టర్ల సదస్సుల్లో నివేదికలు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా తప్పుడు లెక్కలు చూపించి గందరగోళం సృష్టించారు. ఓ వైపు ప్రజాసాధికార సర్వేలో రాష్ట్ర జనాభా 4.50 కోట్లు అని చెబుతుంటే.. కేంద్రం మాత్రం 5.30 కోట్లు అని చెబుతోంది. కేంద్ర లెక్కలనే అధికారులు పరిగణనలోకి తీసుకుని అద్భుతంగా చేస్తున్నామని చూపించడానికి ఇలా తప్పటడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. 

గర్భిణుల గణాంకాల్లో గందరగోళం! 
కాగా, రాష్ట్ర ఆరోగ్య శాఖ రూపొందించిన జాబితాలో తల్లులను ఎక్కువ మందిని చూపించి పిల్లల సంఖ్యను మాత్రం తక్కువగా చూపించారు. ఉదాహరణకు.. కృష్ణా జిల్లాలో ఒక ఏడాదిలో 52 వేల మంది చిన్నారులు (0 వయసు) అని లెక్కల్లో తేల్చారు. అదే గర్భిణుల నమోదులో 82 వేల మందికి పైగా నమోదైనట్లు చూపించారు. అంటే 30 వేల మంది చిన్నారులు పుట్టగానే మృతిచెందినట్లయినా ఉండాలి.. లేదా గర్భిణుల నమోదులో ఎక్కువైనా చేసి చూపించి ఉండాలి. క్షేత్రస్థాయి సిబ్బందికి టార్గెట్లు పెట్టి ఈ లక్ష్యాలను ఎలాగైనా సాధించాలంటూ ఒత్తిడి తేవడంతో చాలాచోట్ల గర్భిణుల నమోదులో డబుల్‌ ఎంట్రీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉదా.. విశాఖపట్నం జిల్లాలోని దొరకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక గర్భిణి నమోదై ఉంది. అదే గర్భిణి దేవరాపల్లి, బీమాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా నమోదై ఉంది.

అధికారులు తమ నివేదికలో ముగ్గురు గర్భిణులుగా చూపించి ముగ్గురికీ ప్రతినెలా వైద్యపరీక్షలు అందించినట్టు పేర్కొన్నారు. ఇలా సుమారు 82వేల మంది గర్భిణులను ఒకటికి రెండు లేదా మూడుసార్లు నమోదుచేసి అమాంతంగా వారి సంఖ్యను పెంచేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి 7 లక్షల పైచిలుకు ప్రసవాలు జరుగుతుండగా, 8.50 లక్షల మంది గర్భిణులను రిజిస్ట్రేషన్‌ చేసి, వారికి వైద్యమందించినట్లు చూపించారు. ఈ లెక్కలను చూసి కేంద్ర ప్రభుత్వం సంభ్రమాశ్చర్యాలకు గురవుతోంది.

అడ్డగోలుగా టార్గెట్లు 
రాష్ట్రంలో సరాసరిన 7.50 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. అందులోనూ ప్రతి ఏడాదీ బర్త్‌ రేటు తగ్గుతోంది కాబట్టి గర్భిణుల శాతం కూడా తగ్గాలి. కానీ, ఉన్నతాధికారులు మాత్రం ఏఎన్‌ఎంలకు, ఆశా వర్కర్లకు విధిస్తున్న టార్గెట్లు విస్మయం కలిగిస్తున్నాయి. ఏకంగా 9.90 లక్షల మందిని రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ టార్గెట్‌లు విధించారు. ఏ జిల్లాలో ఎంత టార్గెట్‌ ఇచ్చారో చూస్తే అవాక్కవాల్సిందే. అసలు లేని గర్భిణులను ఎక్కడ్నుంచి చూపించాలని క్షేత్రస్థాయి సిబ్బంది వాపోతున్నారు. గర్భిణుల విషయంలో జిల్లాల వారీగా ప్రభుత్వం విధించిన టార్గెట్లు ఇవీ.. 

రిజిస్ట్రేషన్లు ఎక్కువ.. బర్త్‌ రేటు తక్కువ 
రాష్ట్రంలో 2011 నుంచి బర్త్‌ రేటు బాగా తగ్గుతోంది. ఉదా.. 2011లో వైఎస్సార్‌ కడప జిల్లాలో 43,378 మంది చిన్నారులు పుట్టారు. అప్పటి జనన నిష్పత్తి వెయ్యి జనాభాకు 17.5 శాతం. ఆ తర్వాత 16.4కు తగ్గింది. కానీ, ఇప్పుడు చిన్నారుల రిజిస్ట్రేషన్‌ టార్గెట్‌ 57,443 మందిని ఇచ్చారు. ఓ వైపు బర్త్‌ రేటు తగ్గుతూంటే ఎక్కువ చూపించడమేంటో అర్థంకాని పరిస్థితి. కాగా, బర్త్‌ రేటును సంవత్సరాల వారీగా చూస్తే..

మరిన్ని వార్తలు