కర్నూలులో 547కు చేరిన కరోనా కేసులు

8 May, 2020 18:57 IST|Sakshi

కలెక్టర్‌ వీరపాండ్యన్‌

సాక్షి, కర్నూలు: జిల్లాలో ఇప్పటివరకు 547 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కలెక్టర్‌ వీరపాండ్యన్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 191 మంది డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొన్నారు. విశ్వభారతి కోవిడ్‌ ఆసుపత్రి నుంచి 80 ఏళ్ల వృద్ధుడు, ఒకటిన్నర ఏళ్ల చిన్నారిని ఆరోగ్యంగా డిశ్చార్జ్‌ చేశామని చెప్పారు. ఆదోనిలో వలసకు వెళ్ళిన వారిలో ఒక్కరికీ కరోనా వైరస్‌ సోకిందని.. ఆ డివిజన్ లో  అప్రమత్తం ఉండాలని ప్రజలకు సూచించారు. అక్కడ కరోనా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు.
(ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు..) 

బీహార్, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌కు చెందినవారిని తరలించామని కలెక్టర్‌ పేర్కొన్నారు. మూడు రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు చెందినవారిని తరలించామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చేవారి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు కరోనా పరీక్ష చేయించుకోవాలని, లేదంటే క్వారంటైన్‌లో ఉండాలని తెలిపారు.  విశాఖ ఘటనను దృష్టిలో ఉంచుకుని 5 ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేస్తున్నామని కలెక్టర్‌ వీరపాండ్యన్‌ పేర్కొన్నారు.
(కరోనా ఖతం!)

లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు: ఎస్పీ ఫక్కీరప్ప
జిల్లాలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అత్యవసర సేవల అనుమతి కోసం 9 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. 419 దరఖాస్తులకు మాత్రమే అనుమతులు ఇస్తున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి 10,812 వాహనాలు సీజ్ చేశామని ఎస్పీ ఫక్కీరప్ప పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు