పశుగ్రాసం కరువై.. ఆకలికి తాళలేక..

10 Apr, 2018 03:39 IST|Sakshi

విషపూరిత జొన్నపిలకలు తిని 56 ఆవుల మృత్యువాత

దైద(గురజాల రూరల్‌)/మాచర్ల రూరల్‌: పశుగ్రాసం కరువై ఆకలికి తాళలేక జొన్న పిలకలు తిన్న 56 గోమాతలు అకాలమృత్యువు పాలయ్యాయి. గుంటూరు జిల్లా గురజాల మండలంలోని దైద గ్రామ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు చెందిన గుండాల లక్ష్మయ్యకు 100 ఆవులు ఉన్నాయి. గతేడాది లాగే ఈసారీ పల్నాడు ప్రాంతానికి వచ్చి గత 45 రోజుల నుంచి అనేక చోట్ల ఆవులను మేపుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం దైద ప్రాంతానికి ఆవులను మేపటానికి తోలుకొచ్చాడు. పక్కనే ఉన్న పొలంలో జొన్న పిలకలు తిన్న ఆవులు సుడులు తిరుగుతూ కింద పడి మృతిచెందాయి.

కొన్ని ఆవులకు రూ.25 వేలు వెచ్చించి 25 పామ్‌ ఇంజక్షన్లు ఇచ్చి వైద్యం చేసినా ఫలితం లేకపోయింది. మొత్తం 56 ఆవులు మృతిచెందడంతో లక్ష్మయ్య కుటుంబం దిక్కు తోచని స్థితిలో ఉంది. సుమారు రూ.14 లక్షల నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆవులు మృతి చెందటానికి జొన్న పిలకలు విషపూరితమవటమే కారణమని తెలుస్తోంది. నాటు జొన్న కోత అనంతరం వచ్చే పిలకలు సైనేడ్‌ కంటే ప్రమాదకరమని గురజాల వెటర్నరీ ఏడీ హనుమంతరావు తెలిపారు.  

మరిన్ని వార్తలు