565 బస్సులు ఫిట్‌లెస్

18 Jun, 2015 23:49 IST|Sakshi
565 బస్సులు ఫిట్‌లెస్

♦ జిల్లాలో స్కూల్ బస్సులు 2,351
♦ ఫిట్‌నెస్ కోసం దరఖాస్తు చేసుకున్న బస్సుల సంఖ్య 1,786
♦ సర్టిఫికెట్ పొందినవి 1,402
♦ ముందుకు రాని 565 బస్సుల యజమానులు
♦ ఇప్పటికి 25 బస్సుల సీజ్  
♦ ఫిట్‌నెస్ లేకుంటే పాఠశాల నిర్వాహకులకు పోలీసు నోటీసులు
 
 సాక్షి, గుంటూరు : పాఠశాలలు తెరిచారు.. పిల్లలు స్కూళ్లకు రెడీ అవుతున్నారు. వారిని పాఠశాలలకు చేర్చేందుకు ఉపయోగించే స్కూల్ బస్సుల్లో కొన్ని అనుమతులు పొందకుండానే తిరుగుతున్నాయి. రవాణాశాఖ అధికారులు ఇప్పటికే 25 ఫిట్‌లెస్ స్కూల్ బస్సులను సీజ్ చేశారు. సర్టిఫికెట్ పొందేందుకు ముందుగా తమ వద్ద దరఖాస్తు చేసుకోవాలని రవాణాశాఖ అధికారులు పత్రికా ప్రకటనలు ఇచ్చినప్పటికీ కొన్ని స్కూళ్ల యాజమాన్యాలకు మాత్రం చీమకుట్టినట్లయినా లేదు.

జిల్లాలో మొత్తం 499 పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ఉందని గుర్తించిన రవాణా శాఖ అధికారులు ఈ పాఠశాలల బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇస్తామని తేల్చి చెబుతున్నారు. దీంతో కొన్ని పాఠశాలలు అనుమతులు లేకుండానే బస్సులను తిప్పుతున్నారు. ముఖ్యంగా అనేక పాఠశాలల బస్సులు కాలం చెల్లినవి ఉండటంతో వాటికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తీసుకునేందుకు వెళ్తే అధికారులు ఎక్కడ చర్యలు చేపడతారోనని భయంతో అసలు ఫిట్‌నెస్ లేకుండానే పిల్లలను ఎక్కించుకుని తిప్పుతున్నారు.

 హడావుడిగా దరఖాస్తులు..
 జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం  మొత్తం 2,351 స్కూల్ బస్సులు ఉన్నాయి. అందులో కేవలం 1,786 బస్సులు మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ల కోసం రవాణా శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. రోజుకు పది బస్సుల చొప్పున ఫిట్‌నెస్ సర్టిఫికెట్ అందించే వీలుండడంతో ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని రవాణా శాఖ అధికారులు పత్రికా ప్రకటనలు ఇచ్చారు. అయితే పాఠశాలల యజమానులు మాత్రం ఒక్కసారిగా స్కూల్ తెరిచేముందు దరఖాస్తుచేయించడంతో రవాణా శాఖ అధికారులకు తలనొప్పిగా మారింది.

జిల్లాలో 565 బస్సులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేకుండానే పిల్లలను తిప్పుతున్నారు. ఫిట్‌నెస్ పొందినవి గుంటూరు నగరంలో మొత్తం 856 స్కూల్ బస్సులు ఉండగా, అందులో 611 బస్సులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందారు. మిగతా 245 బస్సులు ఫిట్‌నెస్ లేకుండానే తిప్పుతున్నారు. నరసరావుపేటలో 312 బస్సులు ఉండగా 157, తెనాలిలో 254 బస్సులకు గాను 129, మంగళగిరిలో 276 బస్సులకు 136, బాపట్లలో 196 బస్సులకు 85, చిలకలూరిపేటలో 132 బస్సులకు 94, పిడుగురాళ్ళలో 171కు 64, మాచర్లలో 158కు 74 స్కూల్‌బస్సులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందారు.

ఇది గ్రహించిన పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుని పాఠశాలల నిర్వాహకులకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్న స్కూల్ బస్సులన్నింటికీ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందాలని, లేని పక్షంలో కేసులు నమోదు చేసేందుకు వెనుకాడబోమంటూ  అర్బన్‌ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు