వైద్య బలగాలు సంసిద్ధం!

7 Jun, 2020 04:19 IST|Sakshi

లాక్‌డౌన్‌ తర్వాత కరోనా పెరిగితే సేవలు వినియోగించుకునేందుకు కార్యాచరణ

రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో 5,943 మంది వైద్యులు

ఐఎంఏ పరిధిలో 7,865 మంది..

అవసరాన్ని బట్టి వీళ్ల సేవలు వినియోగంలోకి..

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ అనంతరం ఒకవేళ కరోనా కేసులు పెరిగితే సేవలు అందించేందుకు పూర్తి స్థాయిలో వైద్య బలగాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధం చేస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో ఎంతమంది వైద్యులు ఉన్నారు? ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) పరిధిలో ఎంతమంది వైద్యులు ఉన్నారు? అన్నదానిపై అధికారులు లెక్కలు తీశారు. కరోనా పాజిటివ్‌ బాధితులకు అత్యవసరంగా వైద్యం చేయాల్సిన పల్మనాలజిస్ట్‌లు, అనస్థీషియా డాక్టర్లు, జనరల్‌ ఫిజీషియన్లు ఈ మూడు కేటగిరీల్లో ఎంతమంది ఉన్నారనేదానిపైనా అంచనాకు వచ్చారు. ఆగస్ట్‌ 30 వరకూ కరోనా ఎంత స్థాయిలో పెరగచ్చు? ఏ దశలో ఎంతమంది వైద్యులను ఉపయోగించుకోవచ్చు? అన్నదానిపై వైద్య ఆరోగ్యశాఖ పూర్తిస్థాయిలో నివేదిక సిద్ధం చేసింది. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ముందుకు వెళుతోంది. ప్రభుత్వ పరిధిలో 5,943 మంది, పీజీ వైద్య విద్యార్థులు, హౌస్‌ సర్జన్లు కలిపి 7,329 మంది, ఐఎంఏ పరిధిలో 7,865 మంది వైద్యులు ఉన్నట్లు తేల్చారు.

వైద్యుల్లో చిత్తూరు టాప్‌..
► ప్రభుత్వ పరిధిలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 679 మంది వైద్యులు ఉన్నారు.
► విశాఖపట్నంలో అత్యధికంగా 13 మంది పల్మనాలజిస్ట్‌లు ఉన్నారు.
► ఐఎంఏ పరిధిలో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 1,425 మంది, శ్రీకాకుళం అత్యల్పంగా 43 మంది వైద్యులు ఉన్నారు.
► పీజీ వైద్య విద్యార్థుల్లో అత్యధికంగా 666 మంది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు.
► ఐఎంఏ, ప్రభుత్వ పరిధిలో మొత్తం 21,137 మంది డాక్టర్లు సేవలు అందించేందుకు సిద్ధం ఉన్నారు.
► కరోనా కేసుల పెరుగుదలను బట్టి దశల వారీగా వీరిసేవలు వినియోగించుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. 

మరిన్ని వార్తలు