తొలుత 6 శాఖల తరలింపు

30 Sep, 2014 02:48 IST|Sakshi
తొలుత 6 శాఖల తరలింపు

తొలుత హోం, విద్య, వైద్యం, వ్యవసాయం, పంచాయతీరాజ్, సాగునీటి శాఖలు బెజవాడకు
 6న విధివిధానాల రూపకల్పన
 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక
 మేధా టవర్స్, లైలా కాంప్లెక్స్‌లపై సుముఖత

 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడకు తరలించటంపై అక్టోబర్ 6వ తేదీన విధివిధానాలు రూపొందించాలని ముఖ్య కార్యదర్శులతో ఏర్పాటైన కమిటీ నిర్ణయించింది. తొలి దశలో హైదరాబాద్ నుంచి 6 ప్రభుత్వ శాఖలు విజయవాడకు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేయూలని కమిటీ సూచించింది. హోంశాఖ, విద్య, వైద్యం, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖలతో పాటు నీటిపారుదల శాఖల విభాగాధిపతులు విజయవాడ నుంచే కార్యకలాపాలు నిర్వహించాలని కమిటీ సభ్యులు నిర్ణరుుంచారు. వీలైనంత త్వరగా హోంశాఖ, విద్య, సాగునీటి శాఖల కార్యాలయాలను తరలించాలన్న ప్రభుత్వ సూచనపై కమిటీ చర్చించింది.
 
 సోమవారం సచివాలయంలోని ‘జే’ బ్లాకులో రవాణా, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి శాంబాబ్ చాంబర్‌లో ముఖ్య కార్యదర్శులు అజయ్ కల్లాం, సాంబశివరావు, జవహర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎల్వీ సుబ్రహ్మణ్యం, నీలం సహానీ తదితరులు సమావేశమై విజయవాడకు కార్యాలయూల తరలింపుపై చర్చించారు. తొలి దశలో తరలివెళ్లే ప్రభుత్వ శాఖలకు ఎంత స్థలం కావాలి? అవసరాలు తదితరాలపై సిబ్బందితో సోమవారంలోగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. గన్నవరంలోని మేధా టవర్స్, విజయవాడ బందరు రోడ్డులోని లైలా కాంప్లెక్స్‌లలో కార్యాలయాలు నిర్వహించేందుకు అనువుగా ఉన్నాయని భావిస్తున్నారు. ఈ భవనాల్ని సీఎం చంద్రబాబు సైతం విజయవాడ పర్యటన సందర్భంగా సందర్శించి తరలింపుపై సుముఖత వ్యక్తం చేయటాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో 15 రోజుల్లోగా ప్రాథమికంగా ఓ నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. విభాగాధిపతులు నిర్దిష్ట గడువులోగా వెళ్లాలనే అంశంపై సమావేశంలో స్పష్టత రాలేదు.

మరిన్ని వార్తలు