ఒక్క మండలం.. ఆరుగురు అభ్యర్థులు

19 Mar, 2019 10:05 IST|Sakshi
బాలినేని శ్రీనివాసరెడ్డి, బుర్రా, డాక్టర్‌ వెంకయ్య, దామచర్ల జనార్దన్, పోతుల రామారావు, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి

జిల్లాలో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఆరుగురు టంగుటూరు మండలం వారే

గత ఎన్నికల్లోనూ ఐదుగురు అభ్యర్థులు పోటీ 

సాక్షి, కొండపి (ప్రకాశం): కొండపి నియోజకవర్గంలోని టంగుటూరు మండలం ఎమ్మెల్యేల ఖిల్లాగా మారింది. గత ఎన్నికల్లో ఈ మండలానికి చెందిన ఐదుగురు అభ్యర్థులు జిల్లాలోని పలు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీచేయగా, ప్రస్తుత ఎన్నికల్లో ఆ సంఖ్య ఆరుకు చేరింది. ప్రస్తుతం ఒంగోలు నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డిది టంగుటూరు మండలం కొణిజేడు గ్రామం కాగా, అదే నియోజకవర్గం నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న దామచర్ల జనార్దనరావుది, కొండపి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న డోలా శ్రీబాలవీరాంజనేయస్వామిది టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం గ్రామం.

అదేవిధంగా కొండపి నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌ సీపీ తరఫున పోటీచేస్తున్న డాక్టర్‌ మాదాసి వెంకయ్యది టంగుటూరు మండలం కారుమంచి గ్రామం కాగా, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థి పోతుల రామారావుది టంగుటూరు గ్రామమే. కనిగిరి నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బుర్రా మధుసూదనయాదవ్‌ది కూడా టంగుటూరు మండలం శివపురం గ్రామం కావడం విశేషం. ఒకే మండలానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ప్రస్తుత ఎన్నికల్లో జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి పలు పార్టీల తరఫున పోటీలో ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. వీరిలో డాక్టర్‌ మాదాసి వెంకయ్య మినహా మిగిలిన ఐదుగురూ 2014 ఎన్నికల్లో కూడా పోటీ చేయడం కొసమెరుపు.

మరిన్ని వార్తలు