విశాఖ‌లో కోలుకున్న మ‌రో బాధితుడు

30 Mar, 2020 16:59 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్య‌ధికంగా ఆరు కేసులు న‌మోదైన విశాఖ‌ప‌ట్నంలో ఓ క‌రోనా వ్యాధిగ్ర‌స్తుడు సోమ‌వారం కోలుకున్న ఘ‌ట‌న జిల్లావాసుల‌కు ఊర‌ట‌నిస్తోంది. అందులోనూ కరోనాను జయించింది అర‌వై ఏళ్ల వృద్ధుడు కావ‌డం విశేషం. మార్చి 14న మ‌దీనా నుంచి విశాఖ‌కు వ‌చ్చిన ఆయ‌నకు క‌రోనా సోకింది. అత‌నికి చికిత్స అందిస్తున్న వైద్యులు మ‌రోసారి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా నెగెటివ్ అని తేలింది. దీంతో అత‌న్ని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ విష‌యం గురించి టీబీసీడీ ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ డా.విజ‌య్ కుమార్ మాట్లాడుతూ.. "మార్చి 17న క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఓ వృద్ధుడు ఆసుప‌త్రిలో చేరాడు. అత‌నికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా మార్చి19న క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది.

తాజాగా సోమ‌, ఆదివారాలు వ‌రుస‌గా రెండుసార్లు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా నెగెటివ్ అని తేలింది. ప్ర‌స్తుతం అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద"ని పేర్కొన్నారు. కాగా అత‌నికి క‌రోనా ఉంద‌ని తెలియ‌గానే అప్ర‌మ‌త్త‌మైన యంత్రాంగం అత‌డి కుటుంబాన్ని క్వారంటైన్‌లో ఉండాల‌ని ఆదేశించింది. అత‌ని కుటుంబ స‌భ్యుల‌తోపాటు వారిని క‌లిసిన‌వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. అత‌ని ద్వారా ఆమె భార్య‌కు క‌రోనా సోకిన‌ట్లు తేల‌గా మిగ‌తావారికి నెగెటివ్ వ‌చ్చింది. (ఏపీలో మరో రెండు పాజిటివ్‌)

మరిన్ని వార్తలు