కృష్ణా పుష్కరాలకు 600 ప్రత్యేక రైళ్లు

30 May, 2016 20:28 IST|Sakshi

- దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ అశోక్‌ కుమార్

రాజమహేంద్రవరం రూరల్ : ఆగస్టు నెలలో జరుగనున్న కృష్ణా పుష్కరాలకు 600 ప్రత్యేక రైళ్లు వేయడంతోపాటు, 2000 అదనపు బోగీలను ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లోని మొదటి ఫ్లాట్‌ఫారమ్‌లో చేపట్టిన ఆధునికీకరణ పనులు ఇటీవల పూర్తయ్యాయి. ఈ నేపధ్యంలో అశోక్ కుమార్‌తోపాటు రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహన్‌లు సోమవారం సాయంత్రం రైళ్ల రాకపోకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ.. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగే అన్నిశాఖల అధికారుల సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిపారు. నలుమూలలు నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగేవిధంగా నాలుగు ప్రధాన హాల్ట్‌ల సౌకర్యం కల్పిస్తామన్నారు.

జూలై 31నుంచి గోదావరి అంత్యపుష్కరాలు: ఎంపీ మాగంటి
గోదావరి అంత్య పుష్కరాలు జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహన్ పేర్కొన్నారు. అంత్య పుష్కరాల సమయంలో గోదావరి సంబరాలు కూడా నిర్వహిస్తామన్నారు.

అంత్యపుష్కరాల విషయంపై కొంత గందరగోళం ఉంది, అయితే దీనిపై టీటీడీ వేదపండితులు, రాజమహేంద్రవరంలోని వేదపండితులతో మాట్లాడామని, గోదావరి నదికి మాత్రమే అంత్య పుష్కరాలున్నాయని, మిగిలిన నదులుకు లేవని చెప్పారన్నారు. ఆగస్టు 11వ తేదీ రాత్రి అన్ని ఘాట్ల వద్ద హారతి ఇచ్చి గోదావరి అంత్య పుష్కరాలకు ముగింపు పలికి, ఆగస్టు 12న కృష్ణా పుష్కరాలకు స్వాగతం పలుకుతామన్నారు.

మరిన్ని వార్తలు