పడగ్గదిలో ‘సోషల్‌’ ట్రెండ్‌!

18 Aug, 2018 04:34 IST|Sakshi

దేశంలోనే హైదరాబాద్‌ టాప్‌

రెండో స్థానంలో విశాఖపట్నం

తరవాత స్థానాల్లో బెంగళూరు, ఇండోర్, పూణే

70% మంది సిటీవాసులు పడుకునే చాటింగ్‌

తాజా సర్వేలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: నగరవాసులు తమకు తెలియకుండానే నిద్రకు దూరమవుతున్నారు. ఏకాంతంగా ఉండే పడక గదులను సైతం సైబర్‌ ‘చాట్‌ రూం’లుగా మార్చేస్తున్నారు. ఒకప్పుడు నట్టింట్లోకి మాత్రమే పరిమితమైన ల్యాప్‌టాప్‌.. ట్యాబ్‌.. స్మార్ట్‌ఫోన్‌.. ఐపాడ్‌ వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఇప్పుడు పడక సమయంలోనూ బెడ్‌మీదకు చేరుతున్నాయి. దీంతో సిటీజన్లు నిద్రలేమికి గురవుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. ‘సెంచురీ మాట్రిసెస్‌’ దేశవ్యాప్తంగా పది నగరాల్లోని ప్రజల ‘స్లీపింగ్‌ ట్రెండ్స్‌’(నిద్ర అలవాట్లు)పై చేసిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది.

ఈ విషయంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ దేశంలో అగ్రభాగాన నిలవడం గమనార్హం. ఈ నగరంలో సుమారు 70 శాతం మంది స్మార్ట్‌ఫోన్లలో సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లో గడుపుతున్నట్టు తేలింది. ఎప్పటికప్పుడు తాజా సమచారాన్ని తెలుసుకునేందుకు నిద్రలేని రాత్రులను గడుపుతున్నట్లు ఈ సర్వేలో గుర్తించారు. అంతేకాదు ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాల్లో సినిమాలు, తమకు నచ్చిన షోలను వీక్షిస్తున్నట్లు స్పష్టమైంది. ఇక ఈ సర్వేలో రెండో స్థానంలో నిలిచిన విశాఖపట్నంలో 66 శాతం మంది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు ప్రకటించారు. మూడోస్థానంలో నిలిచిన బెంగళూరులో 65 శాతం మంది, నాలుగో స్థానంలో నిలిచిన ఇండోర్‌లో 58 శాతం మంది, ఐదోస్థానంలో ఉన్న పూణేలో 56 శాతం మంది పడక గదుల్లో ఎలక్ట్రానిక్స్‌ వస్తువులతో కుస్తీ పడుతూ నిద్రకు దూరమవుతున్నట్లు తేలడం గమనార్హం.

పలు నగరాల్లో నిద్ర అలవాట్లు ఇలా.. 
సెంచురీ మాట్రిసెస్‌ దేశవ్యాప్తంగా పది నగరాల్లో ప్రజల స్లీపింగ్‌ ట్రెండ్స్‌పై సర్వే చేసింది. ఇందులో సుమారు పదివేల మంది నుంచి ‘ఆన్‌లైన్‌’లో అభిప్రాయాలు సేకరించి ఈ సర్వేకు తుదిరూపం ఇచ్చారు. ప్రధానంగా టీవీ, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, సహా.. స్మార్ట్‌ఫోన్లలో ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో నిరంతరాయంగా అప్‌డేట్‌ అవుతోన్న ఫీడ్‌ను తిలకిస్తూ మెజార్టీ సిటీజన్లు కాలక్షేపం చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తంగా పది నగరాల్లో సరాసరి 53 శాతం మంది రాత్రి సమయాల్లో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలతోనే గడుపుతూ కాలక్షేపం చేస్తూ నిద్రకు దూరం అవుతున్నట్లు తేలింది. ఇక మరో 54 శాతం మంది నిత్యం రాత్రి 11–12  గంటల మధ్య నిద్రకు ఉపక్రమిస్తున్నట్లు చెప్పారు. ఉరుకుల పరుగుల జీవితంలో రాత్రి పొద్దుపోయాక నిద్రపోయినప్పటికీ ఉదయం 5–6 గంటల మధ్య మేల్కొనాల్సి వస్తుందని పలువురు తెలిపినట్లు సర్వేలో పేర్కొన్నారు. ఇక అధిక పని ఒత్తిడి.. ఉద్యోగాలు చేసేందుకు సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండడంతో వారంలో మూడురోజుల పాటు పని ప్రదేశాలు.. జర్నీలో కునికిపాట్లు పడుతున్నట్లు 37 శాతం మంది అభిప్రాయపడినట్లు తేలింది.

అధికంగా వీక్షిస్తే ప్రమాదమే.. 
ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను అవసరాన్ని బట్టి ఉపయోగించాలి. గంటల తరబడి అదేపనిగా వాటితో కాలక్షేపం చేస్తే రేడియేషన్‌తో కంటిచూపు దెబ్బతింటుంది. కళ్లు, వాటిలోని సూక్ష్మ నరాలు అధిక ఒత్తిడికి గురవుతాయి. దీంతో మెడ, మెదడుపై దుష్ప్రభావం పడుతుంది. కనీసం పడక సమయంలోనైనా ఎలక్ట్రానిక్‌ వస్తువులకు దూరంగా ఉంటే మేలు. 
– డాక్టర్‌ రవీంద్రగౌడ్, సూపరింటెండెంట్, సరోజినిదేవి కంటి ఆస్పత్రి

మరిన్ని వార్తలు