నాణ్యమైన 70 లక్షల బ్లేడ్ల్ల కొనుగోలు

3 May, 2015 01:23 IST|Sakshi
నాణ్యమైన 70 లక్షల బ్లేడ్ల్ల కొనుగోలు
  •  టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడి
  •  కొలువుదీరిన ధర్మకర్తల మండలి
  • సాక్షి, తిరుమల: తిరుమల కల్యాణకట్టల్లో భక్తుల తలనీలాలు తీసేందుకు రూ.1.54 కోట్లతో 70 లక్షల బ్లేడ్లు కొనుగోలు చేస్తామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి చెప్పారు. టీటీడీ ధర్మకర్తల మండ లి తొలి సమావేశం శనివారం జరిగింది. అనంతరం సమావేశంలో చర్చించిన అంశాలను చైర్మన్ మీడియాకు వెల్లడించారు. కల్యాణకట్టల్లో గతంలో కొనుగోలు చేసిన బ్లేడ్లపై ఫిర్యాదులున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో టీటీడీ నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టుగా ఎస్‌ఎస్ డబుల్ ఎడ్జ్ ఫుల్ బ్లేడులు కొనుగోలు చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. గోదావరి పుష్కరాల సందర్భంగా జూలై 14 నుంచి 25వ తేదీ వరకు రాజమండ్రి, కొవ్వూరుల్లో శ్రీవారి నమూనా ఆలయాలు నిర్మించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తిరుమల ఆలయం, తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో మూడు నెలలకు అవసరమైన 450 పట్టు చీరలు కొనుగోలు చేస్తామన్నారు. తిరుపతిలోని అలిపిరి వద్ద రూ.4.94 కోట్ల అంచనాలతో తలనీలాలు భద్రపరిచేందుకు గిడ్డంగి నిర్మాణానికి ధర్మకర్తల మండలి ఆమోదించిందని ఆయన చెప్పారు.
     
     అంతకుముందు ఆలయ సన్నిధిలో ఉదయం 11.09 గంటలకు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, సభ్యులతో ఆలయ ఈవో డి.సాంబశివరావు ప్రమాణం చేయించారు. ప్రమాణం చేసిన సభ్యుల్లో  కోళ్ల లలితకుమారి, పిల్లి అనంతలక్ష్మి, డోల  శ్రీబాలవీరాంజనేయస్వామి, పుత్తా సుధాకర్ యాదవ్, జి.సాయన్న, ఎ.వి.రమణ, జె.శేఖర్, సంపత్ రవినారాయణన్, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, సుచిత్ర ఎల్లా ఉన్నారు. చివరగా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఈవో సాంబశివరావుతో జేఈవో శ్రీనివాసరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్, సభ్యులకు రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో, జేఈవో లడ్డూ ప్రసాదాలు అందజేశారు. సినీ దర్శకుడు రాఘవేంద్రరావు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైనా ప్రమాణం చేయలేదు. మరో సభ్యుడు డి.పి.అనంత శనివారం సాయంత్రం ప్రమాణం చేశారు.

మరిన్ని వార్తలు