ఆంధ్రాకు రూ.7155 కోట్లు తెలంగాణకు 3756 కోట్లు

25 May, 2014 00:42 IST|Sakshi

రెండు రాష్ట్రాల పీడీ ఖాతాల్లో నగదు నిల్వల లెక్కతేల్చిన అధికారులు

 హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలోని వ్యక్తిగత డిపాజిట్ల(పీడీ ఖాతా) లోని నగదు నిల్వలు రెండు రాష్ట్రాలకు జూన్ 2వ తేదీ నుంచి పంపిణీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు, పట్ణణ, గ్రామీణ స్థానిక సంస్థలకు చెందిన పీడీ ఖాతాల్లోని నగదు నిల్వలను మరోసారి సరిచూసి ఈ నెలాఖరులోగా లెక్కలు తేల్చాల్సిందిగా అన్ని శాఖలను ఆర్థిక శాఖ శనివారం ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ కల్లం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా స్థాయిల్లో ప్రస్తుత ఉమ్మడి రాష్ట్రంలో 72,547 పీడీ ఖాతాలున్నాయి. అందులో ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 43,343 పీడీ ఖాతాల్లో రూ.7155.45 కోట్లు నిల్వ ఉండగా తెలంగాణలోని 10 జిల్లాల్లో 29,204 పీడీ ఖాతాల్లో రూ.3756.77 కోట్లు నిల్వ ఉన్నట్లు తేల్చారు.

ఈ పీడీ ఖాతాల్లో నిల్వలను నెలాఖరులోగా సరి చూసి లెక్క తేల్చాల్సిందిగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఖాతాల్లో నిల్వలను సరిచూసి జూన్ 2వ తేదీ నుంచి పీడీ ఖాతాల్లో కచ్చిత నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి ప్రస్తుత ఉమ్మడి రాష్ట్రంలో 35 పీడీ ఖాతాలున్నాయని, ఆ ఖాతాలు జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి చెందుతాయని, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొత్త పీడీ ఖాతాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ఇన్‌స్టిట్యూషన్స్, కార్పొరేషన్లు, కేంద్రాలకు చెందినవి 75 పీడీ ఖాతాలుండగా ఆ ఖాతాలు రెండు రాష్ట్రాలకూ చెందుతాయని పేర్కొన్నారు.
 

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు