ఆ అమ్మకు కవలలు..

6 Sep, 2019 02:14 IST|Sakshi

ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చిన 73 ఏళ్ల వృద్ధురాలు.. ఆరోగ్యంగా తల్లీబిడ్డలు

గుంటూరు మెడికల్‌/రామచంద్రాపురం రూరల్‌: బామ్మ వయసులో ఆమె అమ్మ అయింది. సంతానం కావాలన్న ఆమె కల కవలల రూపంలో నెరవేరింది. 73 ఏళ్ల వయసులో ఆమె మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తోంది. సంతానం కోసం ఏళ్ల తరబడి నిరీక్షించిన ఆమె కల ఎట్టకేలకు గురువారం నెరవేరింది. దేశం అంతా నివ్వెరపోయేలా 73 ఏళ్ల వయసులో గర్భం దాల్చడం.. వివాహమైన 57 సంవత్సరాలకు కడుపు పండి ఒకేసారి ఇద్దరు ఆడ శిశువులకు జన్మనివ్వడం అందరినీ ఆశ్చర్యపడేలా చేసింది. గుంటూరు కొత్తపేటలోని అహల్య ఐవీఎఫ్‌ సెంటర్‌లో గురువారం మంగాయమ్మకు విజయవంతంగా ఆపరేషన్‌ చేసి శిశువులను బయటకు తీశారు. 

ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రి అధినేత, ఐవీఎఫ్‌ స్పెషాలిటీ వైద్య నిపు ణులు డా. శనక్కాయల ఉమాశంకర్‌ ఆస్ప త్రిలో మీడియాకు వివరించారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నెలపర్తిపూడి గ్రామానికి చెందిన మంగాయమ్మ, రామ రాజారావు దంపతులకు 57 ఏళ్లుగా పిల్లలు పుట్టలేదన్న బాధతో 2018 నవంబర్‌లో తమను సంప్రదించారన్నారు. వయసు పెద్దది కావటంవల్ల ఆమెకు కౌన్సెలింగ్‌ చేసి, మెడికల్‌ బోర్డు అనుమతి తీసుకున్న అనంతరమే ఆమెకు వైద్యం ప్రారంభించామని ఆయన చెప్పారు. తమ వద్దకు వచ్చిన నెలరోజులకు నెలసరి వచ్చిందన్నారు. రెండో నెలలో ప్రణాళిక ప్రకారం ఐవీఎఫ్‌ చేయడంతో అదే నెలలో గర్భ నిర్ధారణ అయిందన్నారు. 

2019 జనవరి 28న గర్భం దాల్చినట్లు నిర్ధారించుకుని ఆమెకు ఆసుపత్రిలోనే ప్రత్యేక గదిలో వైద్య సేవలు అందించామన్నారు. బీపీ, సుగర్‌ లేకపోవడంతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గర్భంలో బిడ్డ ఎదిగిందన్నారు. పుట్టిన శిశువులు ఒకొక్కరు 1.8 కేజీలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరినీ ఎన్‌ఐసీయూలో ఉంచామని, 21 రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని ఉమాశంకర్‌ తెలిపారు. దేశంలో మొట్టమొదటిసారిగా 73 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చడం ఇదే మొదటిసారి అని ఆయనన్నారు. 

ఆపరేషన్‌కు ముందు సీమంతం
ఇదిలా ఉంటే.. ఆపరేషన్‌ థియేటర్‌లోకి వెళ్లే ముందు మంగాయమ్మకు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సీమంతం చేశారు. మంగాయమ్మ భర్త రామరాజారావు, తల్లి దేవళ్ల తులసమ్మ (93) అక్షింతలు వేసి ఆశీర్వదించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా