కవలలకు జన్మనిచ్చిన 74 ఏళ్ల బామ్మ

5 Sep, 2019 11:29 IST|Sakshi

గుంటూరు : 74 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన బామ్మ కవలలకు జన్మనిచ్చారు. గురువారం ఆమెకు సిజేరియన్‌ ద్వారా వైద్యులు ప్రసవం చేశారు.  గుంటూరు అహల్యా ఆస్పతిలో నలుగురు వైద్యుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్‌ జరిగింది. ప్రస్తుతం తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. పండంటి ఇద్దరు ఆడపిల్లలు జన్మించడంతో.. 57 ఏళ్లుగా పిల్లల కోసం తపనపడ్డ ఆ దంపతుల కల నెరవేరింది. దీంతో వారి కుటుంబంలో సంతోషం నెలకొంది. 

కాగా, తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపూడికి చెందిన యర్రమట్టి రామరాజారావుతో  మంగాయమ్మకు 1962లో వివాహమైంది. రైతు కుటుంబానికి చెందిన రామరాజారావు దంపతులు వివాహమైన నాటి నుంచి సంతానం కోసం ప్రయత్నించారు. గత ఏడాది మంగాయమ్మ ఇంటి పక్కనే ఉన్న ఓ మహిళ ఐవీఎఫ్‌ ద్వారా గర్భం దాల్చింది. ఆ మహిళ వయసు 55 ఏళ్లు ఉండటంతో మంగాయమ్మ ధైర్యం తెచ్చుకుని.. ఐవీఎఫ్‌ ద్వారా గర్భం దాల్చేందుకు సిద్ధమైంది. 2018 నవంబర్‌లో ఆ దంపతులు గుంటూరు అహల్యా ఆస్పత్రిని సంప్రదించగా.. ఐవీఎఫ్‌ పద్ధతిలో మంగాయమ్మ గర్భం దాల్చింది. దీంతో ఆమెకు ఆస్పత్రిలోనే ప్రత్యేక గదిని ఏర్పాటుచేసి వైద్యసేవలందించారు. బీపీ, షుగర్‌ లేకపోవడంతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఎదిగింది. గుండె వైద్య నిపుణుడు పీవీ మనోహర్, జనరల్‌ మెడిసిన్‌ వైద్య నిపుణుడు శనక్కాయల ఉదయ్‌శంకర్‌ పర్యవేక్షణలో రోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ తల్లి, గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.

దీంతో మంగాయమ్మ ప్రపంచంలో ఐవీఎఫ్‌ చేయించుకున్న అతి పెద్ద మహిళగా రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు రాజస్తాన్‌లో దల్జీందర్‌ పేరిట ఈ రికార్డు ఉంది. దల్జీందర్‌ 72 ఏళ్ల వయస్సులో మగ బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా దల్జీందర్‌ రికార్డును అధిగమించి మంగాయమ్మ కవలలకు జన్మనిచ్చారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా