నాణ్యమైన బియ్యం కోసం రూ.7,425 కోట్ల ధాన్యం సేకరణ

17 Feb, 2020 03:39 IST|Sakshi

ఒకవైపు రైతుకు మద్దతు ధర.. మరోవైపు పేదలకు నాణ్యమైన బియ్యం 

ఇప్పటికే 40.82 లక్షల మెట్రిక్‌ టన్నుల దాన్యం కొనుగోలు 

సాక్షి, అమరావతి: బియ్యం కార్డులున్న పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరిస్తోంది. ఇందులో భాగంగా పౌర సరఫరాల సంస్థ ఇప్పటికే రూ.7,425 కోట్ల విలువ చేసే 40.82 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఒకవైపు రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడం, మరోవైపు అదే ధాన్యాన్ని మర ఆడించి పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్‌ నుంచి రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా నాణ్యమైన రకం బియ్యానికి సంబంధించిన ధాన్యాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 1,710 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపి మర ఆడించాక 5, 10, 15, 20 కిలోల్లో ప్రత్యేక బ్యాగుల ద్వారా లబ్ధిదారులకు ఇంటింటా పంపిణీ చేయనున్నారు. వీటి కోసం 30 చోట్ల 99 నాణ్యమైన బియ్యం ప్యాకింగ్‌ యూనిట్లను కొత్తగా అందుబాటులోకి తీసుకురానున్నారు. రబీ, ఖరీఫ్‌ సీజన్లలో రైతులు పండించిన ధాన్యాన్ని సేకరిస్తే 28.74 లక్షల టన్నుల నాణ్యమైన బియ్యం అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 

పలు జిల్లాల్లో ఇప్పటికే సిద్ధం 
రాష్ట్రంలో శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో ఇప్పటికే నాణ్యమైన బియ్యం సిద్ధం చేశారు. ఆయా జిల్లాల్లో సేకరించిన బియ్యం నమూనాలను పరిశీలన కోసం అధికారులు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుంచిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న బియ్యం కార్డుల సంఖ్యను బట్టి 26.63 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతుందని అంచనా వేశారు. ఏప్రిల్‌ నుంచి జిల్లాకు ఒక నియోజకవర్గం చొప్పున ప్యాకింగ్‌ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద శ్రీకాకుళం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్‌ నాటికి 22 నియోజకవర్గాలు, మేలో 46, జూన్‌లో 70, జూలైలో 106, ఆగస్టు నాటికి మొత్తం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. 

మరిన్ని వార్తలు