స్థానికులకే 75% ఉద్యోగాలపై నిబంధనలు జారీ

15 Oct, 2019 02:50 IST|Sakshi

 నిబంధనలు పాటించకపోతే కంపెనీలపై చర్యలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కర్మాగారాలు, ఫ్యాక్టరీల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన చట్టానికి సంబంధించి ప్రభుత్వం సోమవారం నిబంధనలు జారీ చేసింది. వీటిని కర్మాగారాలు, పరిశ్రమలు తప్పనిసరిగా పాటించాలి. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు, కర్మాగారాలు, పబ్లిక్‌–ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) కింద నడిచేవాటితోపాటు జాయింట్‌ వెంచర్స్‌లో ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందులో సాంకేతిక, అత్యంత నైపుణ్యం, నైపుణ్యం ఉన్న, నైపుణ్యం లేని వారిని కూడా తీసుకోవాలి. జనవరి నుంచి మూడు త్రైమాసికాల్లో నియామకాలు చేయాలి. ఈ నియామకాలకు సంబంధించి జిల్లా స్థాయిలో కలెక్టర్‌ అధ్యక్షతన నోడల్‌ ఏజెన్సీ ఉంటుంది.

రాష్ట్ర స్థాయిలో కార్మిక ఉపాధి కల్పన ట్రైనింగ్‌– ఫ్యాక్టరీస్‌ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, ఇండస్ట్రీస్‌ కమిషనర్‌ మెంబర్‌గా, ఫ్యాక్టరీస్‌ డైరెక్టర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఏపీలో పదేళ్లుగా నివశిస్తున్న ఎవరైనా ఈ చట్టం కింద ప్రయోజనం పొందొచ్చు. రేషన్‌ కార్డు, వాటర్‌ బిల్లు, విద్యుత్‌ బిల్లు, ఓటర్‌ ఐడీ కార్డ్, గ్యాస్‌ కనెక్షన్‌ కార్డ్, ఆధార్‌ కార్డ్, బ్యాంక్‌ పాస్‌ పుస్తకం, ప్రభుత్వం ఇచ్చిన ఏదైనా గుర్తింపు ఉండాలి. ఇవి లేకపోతే స్థానిక తహసీల్దార్‌ ఇచ్చిన ధ్రువపత్రాన్ని నివాసానికి తగిన రుజువుగా పరిగణించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. కంపెనీల్లో స్థానికంగా నివశిస్తున్నవారికి 75% ఉపాధి కల్పించాలి.

నైపుణ్యం లేని వారని కంపెనీలు భావిస్తే నోడల్‌ ఏజెన్సీకి సమాచారం ఇవ్వాలి. నోడల్‌ ఏజెన్సీ అభ్యర్థులకు తగిన శిక్షణ ఇప్పించి నైపుణ్యాల మెరుగుదలకు కృషి చేస్తుంది. కంపెనీలు, సంస్థల యజమానులు ప్రభుత్వానికి అవసరమైన సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే చట్టంలోని సెక్షన్‌ ఐదు ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చినట్టు భావించి చర్యలు తీసుకుంటారు. నిబంధనలు పాటించడంలో విఫలమైతే యజమాని నేరం చేసినట్లు భావించి మొదటిసారి రూ.25 వేలు, రెండోసారి అయితే రూ.50 వేలు జరిమానా విధిస్తారు.

మరిన్ని వార్తలు